తెలంగాణలో పవర్ ‘ఫుల్ వినియోగం’

by Shyam |
Electricity
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. వేసవి కావడంతో డిమాండ్ ఎక్కువవుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్ నగరంలో 49.56 మిలియన్ యూనిట్లున్న వినియోగం ఏటేటా పెరుగుతూ ఈ నెలలో దాదాపు 80 మిలియన్ యూనిట్ల డిమాండ్‌కు చేరువైంది. దక్షిణ డిస్కం పరిధిలోని జిల్లాల్లోనూ ఇదే స్థాయిలో వినియోగం పెరుగుతోంది. రాష్ట్రం ఏర్పడేనాటికి సుమారు 120 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటే ఇప్పుడు అది సుమారు 185 మిలియన్ యూనిట్లకు చేరువైంది. డిమాండ్ ఎంత పెరిగినా ప్రజలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరంతో పాటు ఆనుకుని ఉన్న జిల్లాల్లో పరిశ్రమలు పెరగడంతో పాటు ప్రజల జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని ఆ శాఖ అధికారులు అంచనా వేశారు. గతంలో ఎన్నడూ లేనంత పీక్ డిమాండ్ ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా వినియోగం పెరగడానికి ఒక కారణం అని అధికారుల అభిప్రాయం. ఈ ఏడాది మార్చి చివరి నాటికే దక్షిణ డిస్కం పరిధిలో 180 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. ఏప్రిల్, మే నెలల్లో ఇది మరింతగా పెరుగుతుందని, దానికి తగినట్లుగా విద్యుత్ వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దినట్లు సీఎండీ తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం నాటికి 2764 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడగా గతేడాది ఇది కేవలం 1464 మెగావాట్లు మాత్రమే. ఒక్క ఏడాది కాలంలోనే 1300 మెగావాట్లు పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిశ్రమల నుంచి ఎక్కువ డిమాండ్ వస్తోంది. గతేడాది కరోనా కారణంగా చాలా కంపెనీలు మూసేసినందున పెద్దగా డిమాండ్ ఏర్పడలేదు. కానీ ఈసారి పరిశ్రమల ఉత్పత్తి ప్రారంభించడంతో ఎక్కువ విద్యుత్ అవసరం తలెత్తింది. హైదరాబాద్ నగరం లాగానే దక్షిణ డిస్కం పరిధిలో విద్యుత్ డిమాండ్ గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో కూడా విద్యుత్ డిమాండ్ ఎక్కువగానే ఉంది. గరిష్ట స్థాయిలో శుక్రవారం విద్యుత్ డిమాండ్ 4260 మెగావాట్లకు చేరింది. గతేడాది ఇది కేవలం 3235 మెగావాట్లు మాత్రమే. ఒక్క సంవత్సరంలోనే డిమాండ్ 1025 మెగావాట్లు పెరిగింది.

Advertisement

Next Story

Most Viewed