ఎన్నికలు హుజురాబాద్‌లో.. ప్రచారం పక్క జిల్లాల్లో..!

by Anukaran |   ( Updated:2021-09-30 06:29:52.0  )
Huzurabad
X

దిశ ప్రతినిది, కరీంనగర్ : ఎన్నికల కమిషన్ పెట్టిన నిబంధనల కారణంగా కరీంనగర్ పక్క జిల్లాలకు ప్రముఖుల తాకిడీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తమ పార్టీ ప్రచారం చేసుకునేందుకు ఇరుగు పొరుగు జిల్లాల్లో సభలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎన్నికలు హుజురాబాద్‌లో అయితే ప్రచారం పక్క జిల్లాల్లో అన్నట్టుగా సాగనుంది ఉప ఎన్నికల తీరు.

ఆతిథ్యం ఇవ్వక తప్పదా..?

హుజురాబాద్ నియోజకవర్గం కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలో వస్తున్నందున ఈ రెండు జిల్లాల్లో కోడ్ అమలవుతోంది. సీఈసీ విధించిన నిబంధనల ప్రకారం సాధారణ సభలకు 500 మంది, స్టార్ క్యాంపెనర్లు పాల్గొనే సమావేశాలకు 1000 మంది మాత్రమే ఉండాలన్న నిబంధన విధించింది. ఇంటింటి ప్రచారానికి ఐదుగురు వ్యక్తులకు మించి ఉండరాదని స్పష్టం చేసింది. ఈసీ రూల్స్ అమలవుతున్నాయో లేదో పరిశీలించాలని, ఎన్నికల నియమావళి అమలు తీరుతెన్నులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ అధికారులను ఆదేశించారు. దీంతో ఎన్నికల ప్రచారంలో హంగు ఆర్భాటం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టు అవుతుందని భావించిన రాజకీయ పార్టీలు పొరుగు జిల్లాలపై తమ దృష్టిని సారించనున్నట్టు తెలుస్తోంది. హుజురాబాద్ నియోజవకర్గంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్న సిద్దిపేట, వరంగల్, జిల్లాలను వేదికగా చేసుకుని పరోక్ష ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది.

స్టార్ క్యాంపెనర్లకు డిమాండ్…

ఎన్నికలు జరగనున్న హుజురాబాద్‌లో ప్రచార హోరును పెంచేందుకు స్టార్ క్యాంపెనర్లను రంగంలోకి దింపనున్నాయి ఆయా పార్టీలు. వీరి ద్వారా రోడ్ షోలు ఏర్పాటు చేసి ప్రచారాన్ని విస్తృతంగా చేయనున్నాయి. స్టార్ క్యాంపెనర్లు పాల్గొనే వేదికల వద్ద వెయ్యి మంది వరకూ హాజరు కావచ్చన్న నిబంధన ఉండడంతో ఈ సారి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిన 20 మందితో ప్రచారాలు చేయించుకునే అవకాశం ఉండనుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఎక్కువగా స్టార్ క్యాంపెనర్ల హవానే ఎక్కువగా సాగనుందని స్పష్టం అవుతోంది.

బహిరంగ సభలు లేనట్టే…

తమ బలం, బలగాన్ని ప్రదర్శించి ముఖ్య నాయకులతో ఏర్పాటు చేయాలని కలలుకన్న ఆయా పార్టీలకు సీఈసీ షాకిచ్చిందనే చెప్పాలి. ప్రముఖ నాయకులను రప్పించినా కేవలం వెయ్యి మందిని ఆహ్వానించినా లాభం లేదని, దీనివల్ల అనుకున్నంత మేర ప్రచారం జరగదని భావిస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. భారీగా ఖర్చు చేసి చిన్న చిన్నసభలు ఏర్పాటు చేయడం కన్నా రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతోనే సరిపెట్టాలన్న యోచనతోనే ముందుకు సాగనున్నాయి. ఏది ఏమైనా ఎన్నికలంటే భారీ బహిరంగ సభలు, ముఖ్య నాయకుల ప్రసంగాలతో హోరెత్తే పరిస్థితికి భిన్నంగానే హుజురాబాద్ ఎన్నికలు జరుగుతాయన్నది స్పష్టం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed