కమల్‎నాథ్‎కు ఈసీ నోటీసులు

by Anukaran |
కమల్‎నాథ్‎కు ఈసీ నోటీసులు
X

దిశ, వెబ్‎డెస్క్: మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర మహిళా మంత్రిపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఇటీవల దబ్రా నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి ఇమర్తిదేవిని ఉద్దేశించి ‘ఐటెమ్’ అంటూ కమల్‌నాథ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి చాలా సింపుల్‌గా ఉంటారని, బీజేపీ అభ్యర్థి ఓ ఐటెమ్ అని.. ఆమె పేరు పలకడం కూడా తనకు ఇష్టం లేదన్నారు.

కమల్‎నాథ్ వ్యాఖ్యలపై ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. మహిళా మంత్రిని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సూచించింది. దీంతో తాజాగా, ఎన్నికల కమిషన్ కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై ఆయన ఉద్దేశం ఏమిటో 48 గంటల్లోగా ఎన్నికల కమిటీకి వివరణ ఇవ్వాలని కోరింది.

దీనిపై రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. కమల్‌‎నాథ్ ఆ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తాను అంగీకరించనని స్పష్టం చేశారు. కాగా, రాహుల్‌ వ్యాఖ్యలపై కమల్‌నాథ్‌ తిరిగి స్పందించారు. తాను ఎవరినీ అవమానించాలని అనుకోలేదన్నారు. తాను ఏ సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందో ఇప్పటికే వివరణ ఇచ్చానని.. కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ ఎవరినైనా తాను అవమానించినట్లు భావిస్తే ఇప్పటికే పశ్చాత్తాపం కూడా తెలిపానని అన్నారు.

Advertisement

Next Story