ప్రచారానికి తెర..సాగర్​లో నేటితో బహిరంగ ప్రచారం ముగింపు

by Shyam |
graduate MLC election campaign
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జున సాగర్​ ఉప ఎన్నికల తుది అంకానికి చేరుతోంది. సాగర్​లో ప్రచారపర్వం గురువారంతో ముగియనుంది. గురువారం సాయంత్రం 5 గంటలకు పార్టీలు, అభ్యర్థులు బహిరంగ ప్రచారాన్ని ముగించనున్నారు. పోలింగ్​కు 48 గంటల ముందు ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంటోంది. శనివారం సాగర్​లో పోలింగ్​ జరుగనుంది.

నాగార్జున సాగర్​ ఉప ఎన్నికకు ఫిబ్రవరి 23న నోటిఫికేషన్​ జారీ అయింది. అన్ని పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసిన నోటిఫికేషన్​ నాటి నుంచే ప్రచారాన్ని మొదలుపెట్టారు. అటు అధికార టీఆర్​ఎస్​ ముందుగా అభ్యర్థిని ఖరారు చేయకున్నా.. మండలి పోలింగ్​ ముగిసిన వెంటనే మంత్రులు, ఎమ్మెల్యేలను సాగర్​కు తరలించారు. ఇక బీజేపీ కూడా అంతే. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించి ప్రచారానికి దిగింది. సాగర్​లో టీఆర్​ఎస్​ నుంచి భగత్​, కాంగ్రెస్​ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవి కుమార్​ నాయక్​ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

రాజకీయ పార్టీలన్నీ సాగర్​లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో టీఆర్​ఎస్​ పార్టీ ప్రచారాన్ని హోరెత్తించింది. ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా నేతలకు వల వేసింది. ఆఖరుకు సీఎం కేసీఆర్​ కూడా బరిలోకి దిగారు. బుధవారం హాలియాలో ప్రచార సభను నిర్వహించారు. అటు కాంగ్రెస్​ కూడా ముందు నుంచీ ప్రచారంలో ఉన్నా.. ఆఖరి వారం రోజులు మాత్రం మరింత దూకుడు పెంచింది. ఎంపీలు రేవంత్​రెడ్డి, ఉత్తమ్​, వెంకట్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డితో సహా ప్రచారం చేయగా.. బుధవారం కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారా ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ ప్రచారం చేశారు. అటు బీజేపీ కూడా సీనియర్లను రంగంలోకి దింపింది. పార్టీ చీఫ్​ బండి సంజయ్​తో పాటు డీకే అరుణ, పార్టీ ఇంఛార్జ్​ తరుణ్​ చుగ్​ వంటి నేతలు ప్రచారం చేశారు.

నేటితో ముగింపు

సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ శనివారం జరగనుండగా, అభ్యర్థుల ప్రచారానికి గురువారం సాయంత్రం 5 గంటలకు తెర పడనుంది. ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ గెలుపుపై ఫోకస్​ పెట్టాయి. అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్​ఎంసీ, మండలి ఎన్నికల్లో టీఆర్​ఎస్​ వర్సెస్​ బీజేపీగా మారిన పోరు… సాగర్​కు వచ్చేవరకు మారింది. ఇక్కడ టీఆర్​ఎస్​ వర్సెస్​ కాంగ్రెస్​గా మారింది. కాంగ్రెస్‌ అభ్యర్థి, రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత సీనియర్‌ నేతల్లో ఒకరైన జానారెడ్డికి పోటీగా టీఆర్‌ఎస్‌, బీజేపీ ఎంచుకున్న అభ్యర్థులు యువకులు కావడంతో ఉప ఎన్నిక ఆసక్తిగా మారింది. ప్రచారంలో మూడు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు జోరుగా సాగాయి. టీఆర్​ఎస్​ నుంచి నోముల కొడుకు భగత్​ను పోటీకి దింపిన కేసీఆర్​.. గెలిపు తథ్యం అన్నట్టుగానే ధీమాతో ఉన్నారు. అయితే బీజేపీ గట్టిపోటీ అని ముందు అనుకున్నా.. తర్వాత పరిణామాల్లో రాజకీయ పరిణామాలు మారినట్లు ప్రచారం జరుగుతోంది.

కాగా నేటితో ప్రచారం ముగుస్తుండటంతో ఇప్పటి వరకు సాగర్​లో మకాం వేసిన వలస నేతలు ఖాళీ చేయనున్నారు. ఇప్పటి వరకు హోటళ్లు, అతిథిగృహాలన్నీ నేతలతో నిండిపోయాయి. నేటి నుంచి మళ్లీ అవన్నీ ఖాళీగా కన్పించనున్నాయి. రాష్ట్రంలో రెండు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికలు కూడా జరుగుతాయనుకుంటున్న నేపథ్యంలో జిల్లాల నేతలను ఆ ప్రాంతాలకు వెళ్లాలని సీఎం కేసీఆర్​ ఇప్పటికే సూచించారు. దీంతో సాగర్​ను వీడే నేతలు మళ్లీ వరంగల్​, ఖమ్మం జిల్లాలకు తరులుతున్నారంటూ అధికార పార్టీలో టాక్​.

మరోవైపు బహిరంగ ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఇక ప్రలోభాల పర్వం మొదలవుతుందని సాగర్​లో ప్రచారం. ఇప్పటికే అధికార పార్టీ కోట్లు కుమ్మరించిందంటున్నారు. ఆఖరి రెండు రోజులు ప్రధానం కావడంతో విరివిగా ప్రలోభాల పర్వానికి దిగుతున్నారని, అడ్డుకట్ట వేయాలంటూ ఇప్పటికే ఎన్నికల సంఘానికి కాంగ్రెస్​ ఫిర్యాదు చేసింది. అయితే అధికార పార్టీకి ప్రలోభాలకు గురి చేయాల్సిన అవసరం లేదని, ప్రతిపక్ష పార్టీలే నగదు పంపిణీ చేస్తున్నాయంటూ అటు టీఆర్​ఎస్​ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా ఇక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story

Most Viewed