- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రేటర్ కేంద్రంగా పాలి‘ట్రిక్స్’..
ఎన్నికలకు ముందు సహజంగానే అధికార పార్టీ తాయిలాలు ఇవ్వడం, ఇతర పార్టీలు హామీలు గుప్పించడం ఆనవాయితీ. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. వివిధ వర్గాలను సంతృప్తిపరిచేందుకు పలు ప్రకటనలు చేస్తోంది. ఇంతకాలం పట్టించుకోని పనుల మీదా దృష్టి సారించింది. మంత్రులను పురమాయిస్తోంది. అధికారులను పరుగులు పెట్టిస్తోంది. పార్టీ నేతలను అప్రమత్తం చేస్తోంది. సానుకూల ఫలితాల కోసం అనేక వ్యూహాలు పన్నుతోంది. ఇవన్నీ వారకి ఏ మేరకు ఓట్లను కురిపిస్తాయన్నది చూడాలి.
దిశ, తెలంగాణ బ్యూరో : ఇంతకాలం డిమాండ్ ఉన్నా సానుకూలంగా స్పందించని ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఒక ఎమ్మెల్సీ, రెండు కార్పొరేషన్లకు చైర్మన్ పదవులను ఇచ్చింది. వరద సాయం పేరుతో బాధిత కుటుంబాలకు తలా రూ.10వేల నగదును పంపిణీ చేసింది. ఆస్తిపన్ను చెల్లింపులో 50% రాయితీని ప్రకటించింది. హడావుడిగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా టైమ్‌లో కోత పెట్టిన జీతాన్ని పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించింది. యువతను, పట్టణ ప్రజలను ఆకట్టుకోడానికి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పంచతత్వ పార్కు, సెల్ఫీ పాయింట్లు, నగర సుందరీకరణ లాంటి పనులను చేపట్టింది. రాష్ట్రంలో జరిగిన అనేక ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి సంక్షేమ పథకాలు శ్రీరామరక్షగా నిలిచాయి. మరే రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నట్లు మంత్రులు, అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. రైతుబంధు, రైతుబీమాలాంటి పథకాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటున్నారు. అయినా, ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలను పొందుతున్న లబ్ధిదారుల ఓట్లన్నీ తమకే పడతాయని, భారీ మెజార్టీతో గెలుపొందుతామని మంత్రి హరీశ్‌రావు చాలా వరకు విశ్వసించారు. మెజార్టీ సంగతేమోగానీ లబ్ధిదారుల ఓట్లు కూడా పార్టీకి పడలేదు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఆ అనుమానంతోనే ప్రభుత్వ కొత్త రాయితీలను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది.
ఎన్నో రకాలుగా..
జీహెచ్ఎంసీలోని ఓటర్లకు అనేక రకాలుగా ఎర వేసేందుకు టీఆర్ఎస్ పక్కా ప్లాన్ రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. నాలుగైదేళ్లుగా నత్తతో పోటీపడుతున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను హడావుడిగా పూర్తి చేయిస్తూ కొన్నిచోట్ల ప్రారంభోత్సవాలు కూడా చేశారు. కరోనా కష్టకాలంలో లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఆస్తిపన్ను బకాయిలను ఒకేసారి చెల్లిస్తే ‘వన్ టైమ్ స్కీమ్’ కింద జీహెచ్ఎంసీ రాయితీలను ప్రకటించింది. ఆశించిన స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఆస్తి పన్నులో 50 శాతం రాయితీని ప్రకటించింది. ఆ మేరకు ప్రభుత్వమే జీహెచ్ఎంసీకి చెల్లించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే కట్టినవారికి వచ్చే సంవత్సరం పన్నులో ఆమేరకు మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చింది. గతేడాది ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల సాధన కోసం సమ్మె చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో స్వచ్ఛందంగా ఆందోళనను విరమించుకుని విధుల్లో చేరాల్సి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వం పట్ల వారిలో తీవ్ర స్థాయిలోనే వ్యతిరేకత పోగైంది. కరోనా టైమ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ కార్మికుల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆ వేతనాన్ని ఒకే మొత్తంలో చెల్లించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం మూడు విడతల్లో చెల్లించనున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
తప్పులు దిద్దుకునేందుకు..
వరద బాధితులకు రూ.10 వేల నగదు సాయాన్ని ప్రకటించి అమలు చేసింది. అది పార్టీ కార్యక్రమంగా అమలైంది. అధికార పార్టీ నేతలు వారి జేబుల్లోంచి ఇచ్చినట్లుగా పబ్లిసిటీ చేసుకున్నారు. చాలా చోట్ల కమిషన్ పేరుతో వేల రూపాయలను నొక్కేశారు. చివరకు ప్రభుత్వం బాధితుల నిరసనలను చవిచూడాల్సి వచ్చింది. దీంతో, మిగిలినవారు మీసేవలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సాయం అందిస్తామని ప్రకటించింది. ఆర్య వైశ్యుల ఓట్లను రాబట్టుకోడానికి ఒక ఎమ్మెల్సీ పోస్టును, రెండు కార్పొరేషన్లకు (టూరిజం, ఇండస్ట్రీ) చైర్మన్ పోస్టులను కట్టబెట్టింది. గతంలో ఆర్య వైశ్య కార్పొరేషన్ మంజూరు చేస్తామని, రూ. కోట్ల కార్పస్ ఫండ్‌ను సమకూరుస్తామని, భవన్‌ను కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉప్పల్ భగాయత్‌లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఇలాంటి హామీలు, ప్రకటనలు, తాయిలాలు ఎన్నికల సమయంలో ఇంతకాలం ఒక రకంగా ఫలితాలను ఇచ్చినప్పటికీ, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల అనంతర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ మేరకు అధికార పార్టీకి లబ్ధి చేకూరుస్తుందన్న చర్చ మొదలైంది. స్థానిక పరిస్థితులను చూస్తున్న టీఆర్ఎస్ లోకల్ లీడర్లలో చాలా మందికి నమ్మకం లేకపోవడంతో పార్టీ అధిష్టానం తాయిలాల బాట ఎంచుకున్నట్లు తెలుస్తోంది.