ఐసిస్‌పై ఈజిప్ట్ పంజా.. 89 మంది ఉగ్రవాదులు హతం

by vinod kumar |
terriosts
X

కైరో : ఈజిప్ట్ ప్రభుత్వం తమ దేశంలో తిష్ట వేసిన ఐసిస్ ఉగ్రవాదులపై విరుచుపడింది. తీవ్రవాద గ్రూపులు గత దశాబ్దకాలం నుంచి ఈజిప్ట్ లోని ఉత్తర సహరా ఎడారి ప్రాంతం, సినాయ్ ద్వీపకల్పంలోని దక్షిణ ప్రాంతాలను తమ స్థావరంగా ఏర్పరచుకుని దేశ వ్యాప్తంగా బాంబుదాడులు చేస్తున్నారు. దీంతో వీరిపై సైన్యం దాడులు జరపటం ప్రారంభించింది.

తాజాగా సినాయ్ ప్రావిన్స్ పై జరిపిన దాడిలో 89 మంది ఐసిస్ తీవ్రవాదులను హత మార్చినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఆపరేషన్లో ఎనిమిది మంది సైనికులు కూడా తీవ్రంగా గాయపడినట్లు ప్రకటించారు. ఐసిస్ ఉగ్రవాదులు తమ స్థావరాల చుట్టూ నాలుగు వందలకు పైగా ఐఈడీలను అమర్చారని, వాటిని సురక్షితంగా నిర్వీర్యం చేసామని తెలిపారు. తమ దేశంలోకి చొరబాడటానికి ఏర్పాటు చేసుకున్న 13 సొరంగాలను కూడా గుర్తించామని అన్నారు.

వారి స్థావరాల్లో భారీ స్థాయిలో నిల్వ చేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఆపరేషన్ మున్ముందు కూడా కొనసాగుతుందని వెల్లడించారు. దేశంలో దాడి జరుపుతున్నవి స్థానిక ఉగ్రవాద ముఠాలేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారిని దేశం నుంచి ఏరివేస్తామని కుండబద్దలు కొట్టారు.

పెనం మీద నుంచి పొయ్యిలో..

ఈజిప్ట్ ను కుదిపేసిన జాస్మిన్ విప్లవం వల్ల ముఫ్పై సంవత్సరాలుగా దేశాన్ని పట్టిపీడించిన హోస్నీ ముబారక్ పాలన అంతమయింది. కానీ ఆ తరువాతే కైరో కష్టాలు రెట్టింపయ్యాయి. దేశం మొత్తం అరాచకం ప్రబలింది. వ్యవస్థలు మొత్తం, మెల్లగా సైన్యం చేతిలోకి వెళ్లాయి. మధ్యలో ప్రజాస్వామ్య పరిపాలన అంటూ మహ్మద్ మోర్సీ కొద్దిగా ఆశలు రేపిన అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది.

మోర్సీ అధికారం కొల్పోవటంలో అతి వాద ముస్లిం బ్రదర్ హూడ్ సంస్థ ఉగ్రవాదులతో చేతులు కలిపింది. ఇదే సమయాన దేశంలో ఉగ్రవాదుల దాడుల తీవ్రత రెట్టిపయ్యాయి. ప్రజలను రక్షించడానికనే పేరుతో సైన్యం రంగంలోకి దిగింది. ఉగ్రవాదులను హతమారుస్తూ క్రమంగా అధికారాన్ని చేజిక్కించుకుంది. 2018 నుంచి సైన్యం ప్రత్యేకంగా ఇస్లామిక్ అతివాద తీవ్రవాదులపై దాడులు చేయటం ప్రారంభించింది.

ఈ నాలుగు సంవత్సరాల్లో 1060 మంది వరకు వివిధ గ్రూపులకు చెందిన తీవ్రవాదులను అంతం చేసింది. ప్రస్తుత సినాయ్ ద్వీపకల్పం ఇజ్రాయోల్ సరిహద్దుగా ఉండటంతో, భవిష్యత్ లో తనకు, టెల్ అవీవ్ కు ఎటువంటి వివాదాలు రాకుండా ఉండాలనే ఆలోచన కూడా ప్రస్తుత సైనిక ఆపరేషన్లకు ఒక కారణంగా తెలుస్తోంది.

Advertisement

Next Story