స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు కేటీఆర్ హామీ

by Sridhar Babu |
Minister KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో : వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కథలాపూర్‌లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే జోన్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానన్నారు. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను వేములవాడ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విజ్ఞప్తులను మంత్రికి అందజేశారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సైతం ఫోన్లో కథలాపూర్ మండలంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాలని కేటీఆర్‌ను కోరారు.

కథలాపూర్ మండలం గంభీర్పూర్‌లో 344 ఎకరాలలో మామిడి, పసుపుకు సంబంధించి స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులకు మేలు జరుగుతుందన్నారు. జగిత్యాల జిల్లాలో 36 వేల ఎకరాలలో మామిడి సాగుతో తెలంగాణలోనే మొదటి స్థానం, పసుపు 22 వేల ఎకరాలలో సాగుతో రెండవ స్థానంలో ఉందని తెలిపారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ను ఏర్పాటు ప్రతిపాదనపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. మంత్రికి ఎమ్మెల్యే రమేష్, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, జడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ జవ్వాజి రేవతి గణేష్, వైస్ ఎంపీపీ కిరణ్ రావు, ఎంపీటీసీలు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed