డేంజర్‌లో ఆ 14 జిల్లాలు.. ఆందోళనలో ఆరోగ్యశాఖ

by Anukaran |   ( Updated:2021-08-15 22:22:05.0  )
Filaria
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ర్ట వ్యాప్తంగా 14 జిల్లాల్లో ఫైలేరియా వ్యాధి విస్తరిస్తోందని ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, మెదక్, సిద్ధిపేట్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్ జిల్లాల్లో ఫైలేరియా(బోధవ్యాధి) అధికంగా ఉన్నట్లు సూచించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 66,394 మంది బోధకాలు వ్యాధిగ్రస్తులు ఉండగా, వీరిలో 85 శాతం మంది ఆ 14 జిల్లాల్లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ జిల్లాల్లో వ్యాధి నివారణ చర్యలను వేగవంతం చేయాలని వైద్యారోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.

యవ్వన దశలో సోకి పెద్దవయసులో వెలుగులోకి..

ఫైలేరియా సూక్ష్మక్రిమి బోధకాలుకు కారణమవుతుండగా, క్యూలెక్స్ దోమలు కుట్టడం వలన వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. అయితే ఇది యవ్వన దశలో సోకితే పెద్ద వయసులో లక్షణాలు బయటపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. దశల వారీగా వ్యాధి తీవ్రతరం కావడానికి సుమారు 10 సంవత్సరాలు పడుతుందన్నారు. చంకల్లో, గజ్జల్లో బిళ్ల కట్టడం, కాళ్లు, చేతులపై ఎర్రని చారలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని రోజుల తర్వాత కాళ్లు, చేతులు, జననేంద్రియాల్లో వాపు మొదలవుతుంది. కొందరిలో ఊపిరితిత్తుల ఇసినోఫిలియా, పాల వంటి మూత్ర విసర్జనలూ జరుగుతాయి. అయితే దీంతో మరణాలు సంభవించకపోయినా, దీని వలన కలిగే దుష్పరిణామాలు మాత్రం చాలా తీవ్రమైనవని డాక్టర్లు పేర్కొంటున్నారు. బోధ వ్యాధి సోకినోళ్లకు వ్యాధి నిరోధక శక్తి లోపించి ఇతర వ్యాధులు సులువుగా దాడి చేస్తాయి. దీంతో అంగవైకల్యం, శారీరక, మానసిక బాధలు వెంటాడుతుంటాయి.

వ్యాధి ఎలా వృద్ధి చెందుతుందంటే..

క్యూలెక్స్ దోమ బోధకాలు రోగిని కుట్టినప్పుడు రక్తంతో పాటు దోమ కడుపులోనికి ఫైలేరియా క్రిములు ప్రవేశిస్తాయి. ఇలా దోమలో ప్రవేశించిన క్రిములు 10 నుంచి 15 రోజుల్లో వివిధ దశలుగా అభివృద్ధి చెంది, మరొక వ్యక్తిలోనికి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇలా వృద్ధి చెందిన దోమలు మరోవ్యక్తిని కుట్టినప్పుడు అతని శరీరంలోకి ఫైలేరియా క్రిములు ప్రవేశిస్తాయి. అవి శోష నాళములలో చేరి 1 నుంచి 2 సంవత్సరాలలో పెరిగి పెద్ద క్రిములుగా మారతాయి. సుమారు 10 సంవత్సరాల వరకూ ఇవి శోష కణుతులలో జీవించి పిల్లలను పెడుతుంది. ఈ మైక్రోఫైలేరియా క్రిములు పగటి సమయంలో శరీరములోని అంతర్భాగాల్లో నివసిస్తూ, రాత్రి సమయంలో ఉపరితల రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా చర్మం వద్దకు చేరతాయి.

అల్బెండజోల్ ట్యాబ్లెట్లతో ఫైలేరియా నివారించవచ్చు

రెండేళ్లు పైబడిన పిల్లలంతా సంవత్సరానికి ఓసారి డీఈసీ అల్బెండజోల్ మాత్రలు మిండగం ద్వారా ఫైలేరియా వ్యాధిని నివారించవచ్చు. ఇప్పటికే ఇంటింటికి తిరిగి ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం, వైద్య సిబ్బంది ట్యాబ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. కానీ రెండేళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక రోగులు ఈ ట్యాబ్లెట్లను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. ఈ వ్యాధి నివారణకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా తీవ్రత అధికంగా ఉన్న 14 జిల్లాల్లో మైకుల ద్వారా ప్రచారం, కరపత్రాలు, బ్యానర్లు, ఫ్లాష్ కార్డుల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాం.
-డాక్టర్ అమర్ సింగ్, అడిషనల్ డైరెక్టర్

Advertisement

Next Story