విద్యాశాఖ మంత్రికి స్వేచ్ఛనివ్వాలి: నర్సిరెడ్డి

by Shyam |
విద్యాశాఖ మంత్రికి స్వేచ్ఛనివ్వాలి: నర్సిరెడ్డి
X

దిశ, ముషీరాబాద్: అధికారాన్ని ప్రగతి భవన్‌లోనే కేంద్రీకరించండి.. కానీ విద్యాశాఖ మంత్రికి స్వేచ్ఛనివ్వాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. విద్యాశాఖ మంత్రి పరిధిలోని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించే అధికారాలను మంత్రిని వినియోగించు కోనివ్వాలని సీఎం కేసీఆర్‌కు విజ్జప్తి చేశారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ… ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఎటువంటి సమాధానం రాలేదన్నారు.

మామూలుగా ఇవ్వాల్సిన పదోన్నతులు, పైసా ఖర్చు లేని బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం ఎందుకింత తాత్సారం చేస్తుందని ప్రశ్నించారు. విద్యారంగం పట్ల ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2వేలకు పైగా స్కూళ్లలో హెడ్ మాస్టర్ల పోస్టుల ఖాళీగా ఉన్నాయన్నారు. 10 వేలకు పైగా పండిట్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని చెప్పారు. అంతర్ జిల్లా బదిలీలను వెంటనే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే షెడ్యూల్ ను వెంటనే ప్రకటించాలని కోరారు. కోవిడ్ పేరుతో పాఠశాలలను తెరవకుండా పిల్లలకు జరిగే నష్టానికి ప్రభుత్వమే కారణమౌతుందన్నారు. టీచర్లు లేకుండా ఆన్ లైన్ తరగతుల పర్యవేక్షణ ఎలా జరుగుతుందని నర్సిరెడ్డి ప్రశ్నించారు.

పాఠశాలల్లో పనిచేసేందుకు సహాయకులను నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మాట్లాడుతూ… ధర్నాకు వస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. క్లాస్ రూంలో ఉండాల్సిన ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్‌లలో పెట్టినందుకు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. టీచర్ల డిమాండ్లన్నీ న్యాయమైనవని, ఉపాధ్యాయ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలని ఎమ్మెల్సీ రాంచందర్ రావు డిమాండ్ చేశారు. కేంద్రంతో మాట్లాడి సీపీఎస్ రద్దుకు ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు. మూడు నెలల్లో ఇస్తానన్న పీఆర్సీ 30 నెలలైనా ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రోఫేసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు.సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు జైల భరో కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed