శూన్య ఉద్గారమే మానవాళికి మేలు

by Ravi |   ( Updated:2022-09-20 18:30:32.0  )
శూన్య ఉద్గారమే మానవాళికి మేలు
X


ప్రపంచ దేశాలు 21 సెప్టెంబర్‌ రోజున 24 గంటలు శిలాజ ఇంధనాల వాడకాన్ని నిషేధించాలని సూచించబడింది. ఆ రోజున శిలాజ ఇంధన వాహనాలు వాడకుండా సైక్లింగ్‌ లేదా కాలి నడకన ప్రయాణిద్దాం. ఇంధన వాడకాన్ని తగ్గిస్తూనే రీయూజ్‌, రెడ్యూస్‌, రీఫ్యూజ్‌‌, రీసైకిల్‌, రిమూవ్‌ సూత్రాలను అనుకూలతను బట్టి శాస్త్రీయంగా ఉపయోగించాలి. భూగ్రహాన్ని నివాసయోగ్య ఆవాస స్థలంగా మలుచుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి విశ్వ మానవాళి తమ జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకుంటూ, ధరిణిని భూమాతగా భావించి, భూమిని స్వర్గంగా మార్చుకుందాం. విశ్వాన్ని సురక్షిత నివాస గృహంగా తీర్చి దిద్దుకుందాం

ర్యావరణ కాలుష్యానికి కార్బన్‌తో పాటు ఇతర ఉద్గారాలే ప్రధాన కారణం. ఈ విషయం ప్రపంచ మానవాళికి క్రమక్రమంగా అవగతమవుతోంది. కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే పటిష్ట ప్రణాళికలను అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతో వాతావరణంలోకి కార్బన్‌ డై ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ లాంటి కార్బన్‌ ఉద్గారాలు చేరుతాయి. కార్బన్‌ ఉద్గారాలు పెరిగితే 'భూతాపం (గ్లోబల్‌ వార్మింగ్‌)'తో సకల జీవకోటి ఉనికి ప్రమాదంలో పడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా కార్బన్‌ ఉద్గారాల దుష్ప్రభావాలను వివరించడానికి, శూన్య ఉద్గార లక్ష్యానికి చేరువకావడం, కార్బన్‌ ఉద్గార ఇంధనాల వినియోగాన్ని తగ్గించడంలాంటి విషయాల పట్ల విస్తృత ప్రచారం చేసేందుకు యేటా సెప్టెంబర్‌ 21న ప్రపంచ దేశాలు 'శూన్య ఉద్గార దినం (జీరో ఎమిషన్‌ డే, జీడే)' పాటిస్తారు. 'ఏడాదిలో ఒక రోజైనా భూగోళానికి ఉద్గారాల దుష్ప్రభావాల నుంచి ఉపశమనం కలిగిద్దాం' అంటూ, భూమికి 'విశ్రాంతి దినం'గా మానవాళి నినదించే సందర్భమిది.

అనారోగ్య హేతువులు

ఘన, ద్రవ, వాయు శిలాజ ఇంధనాలను విస్తృతంగా వినియోగించడంతో గాలిలోకి ప్రమాదకర కార్బన్‌ ఉద్గారాలు చేరతాయి. వీటిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌తో భూతాపం, కార్బన్‌ మోనాక్సైడ్‌తో విష ప్రభావం కలుగుతాయి. ఎల్‌పీజీ, పెట్రోల్‌, డిజిల్‌, కిరోసిన్‌, బొగ్గులాంటి ఇంధనాల దహన క్రియలో కార్బన్‌ ఉద్గారాలు విడుదల కావడం తప్పనిసరి. ఇలాంటి అత్యంత పర్యావరణ విచ్ఛిన్నకర విషయాలను వివరించాలనే సదుద్దేశంతో 2008 నుంచి 'జీరో డే'ను నిర్వహిస్తున్నారు. శిలాజ ఇంధనాల వినియోగంతో కార్బన్‌ ఉద్గారాలతో పాటు పలు ఇతర కాలుష్యాలు, సూక్ష్మ కణాలు (మైక్రోపార్టికిల్స్‌), విషలోహం లెడ్‌, పొగరూపంలో పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ కూడా గాలిలో కలిసిపోయి పర్యావరణ అనారోగ్యానికి కారణం అవుతాయి.

తరిగే సాంప్రదాయ శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, వాటికి ప్రత్యామ్నాయంగా 'సాంప్రదాయేతర తరగని ఇంధనాల' వాడాకాన్ని ప్రోత్సహించాల్సిన అగత్యం ఏర్పడింది. ప్రపంచ దేశాలు 21 సెప్టెంబర్‌ రోజున 24 గంటలు శిలాజ ఇంధనాల వాడకాన్ని నిషేధించాలని సూచించబడింది. ఆ రోజున శిలాజ ఇంధన వాహనాలు వాడకుండా సైక్లింగ్‌ లేదా కాలి నడకన ప్రయాణిద్దాం. ఇంధన వాడకాన్ని తగ్గిస్తూనే రీయూజ్‌, రెడ్యూస్‌, రీఫ్యూజ్‌‌, రీసైకిల్‌, రిమూవ్‌ సూత్రాలను అనుకూలతను బట్టి శాస్త్రీయంగా ఉపయోగించాలి. భూగ్రహాన్ని నివాసయోగ్య ఆవాస స్థలంగా మలుచుకోవడానికి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి విశ్వ మానవాళి తమ జీవనశైలిలో స్వల్ప మార్పులు చేసుకుంటూ, ధరిణిని భూమాతగా భావించి, భూమిని స్వర్గంగా మార్చుకుందాం. విశ్వాన్ని సురక్షిత నివాస గృహం గా తీర్చి దిద్దుకుందాం.

(నేడు 'శూన్య ఉద్గార దినం' )

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి

కరీంనగర్‌, 9949700037

Advertisement

Next Story