యువతకు నైపుణ్యం కావాలి

by Ravi |   ( Updated:2022-09-03 13:48:46.0  )
యువతకు నైపుణ్యం కావాలి
X

దేశ అభివృద్ధి అయినా యువశక్తి పైనే ఆధారపడి ఉంటుంది. నేటి యువతే రేపటి తరానికి కొలమానం. ప్రస్తుతం యువత విలాసవంత జీవితాలకు అలవాటు పడుతున్నారు. అల్కాహాల్, డ్రగ్స్ , గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. మత్తులో వాహనాలను వేగంతో నడపడంతో వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలుగుతోంది. యువత స్వేచ్ఛను కోరుకోవడంలో తప్పు లేదు కానీ, అది మితిమీరితే అనేక అనర్థాలు జరుగుతాయి. పిల్లల అవసరాలు తీర్చవలసిన బాధ్యత తల్లిదండ్రులది. వారి మీద ప్రేమతో విలాసవంత జీవితం కల్పించాలని ప్రయత్నించడం సబబు కాదు.

ప్రపంచ యువతలో దేశ యువత అధికంగా ఉంది. ప్రపంచ దేశాలు అభివృద్ధిలో పోటీ పడి ముందుకు పోతున్న తరుణంలో భారత్ మాత్రం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. మన విద్యావంతులు, మేధావులు, సంపాదన కోసం విదేశాలకు పయనమవుతున్నారు. ప్రపంచంలో పేరెన్నికగన్న సంస్థలకు అధిపతులుగా ఉంటున్నారు. అది గౌరవమే అయినా, పుట్టిన దేశానికి ఏం చేశామనేది ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. యువశక్తి చెడు మార్గం పట్టకుండా తగు చర్యలు తీసుకోవాలి. వారి వ్యక్తిత్వ వికాసానికి తల్లిదండ్రులు కృషి చేయాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత పెడదారి పట్టకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకొని వివిధ దేశాలు అద్బుతాలు సృష్టిస్తున్నాయి. మన యువతకు అది ఎందుకు సాధ్యం కాదో ఓసారి ఆలోచించాలి. చిన్న చిన్న సంఘటనలకు భయపడుతూ ఎదుర్కొనే సత్తా లేక ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. యువతలో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.

వివిధ లక్ష్యాలతో

2000 సంవత్సరం నుంచి అంతర్జాతీయ యువ దినోత్సవాన్ని ఆగస్టు 12 న జరుపుకుంటున్నారు. 2030 నాటికి సాంఘిక న్యాయం, శాంతి స్థాపన, విద్యను యువతకు అందించాలని, పర్యావరణ కాలుష్య గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యల పరిష్కారానికి యువతను ప్రభావితం చేసి వారిలో చైతన్యం నింపే విధంగా తయారు చేయాలని భావించారు. యువశక్తిలో 96.8 శాతం అసంఘటిత రంగంలో పని చేస్తున్నారు. దానికి కారణం నైపుణ్యం లేకపోవడం. నూతన విద్యా విధానం ద్వారా ఇది పెంపొందించాలి. ప్రపంచంలో 15-24 మధ్య వయస్సు యువత దాదాపుగా 15.5 శాతంగా ఉన్నారు ఇదే సంఖ్య 2030 నాటికి 15.1 శాతానికి, 2050 వరకు 13.8 శాతానికి తగ్గుతుంది. ఆఫ్రికా, ఆసియా ఖండంలో యువత జనాభా పెరుగుతుందని అంచనా. ఇతర దేశాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెంది యువత శక్తి సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకుని ముందుకు పోతున్నాయి. మన దేశం కూడా యువశక్తిని వినియోగించుకొని అభివృద్ధి సాధించాలని కోరుకుందాం.

(నేడు ప్రపంచ యువజన దినోత్సవం)


మిద్దె సురేశ్

కవి, వ్యాసకర్త

9701209355

Advertisement

Next Story