అమరుల బలిదానాలకు విలువేది?

by srinivas |   ( Updated:2024-06-02 00:01:19.0  )
అమరుల బలిదానాలకు విలువేది?
X

రాష్ట్ర సాకారానికి సకల జనులను ఉత్తేజ పరిచి మహోద్రిక్తంగా కదిలించింది పాట కాగా, రెండవది అమరత్వం. వేలాది బలిదానాలతో అమరుల త్యాగాలు అనివార్యంగా రాష్ట్రాన్ని ప్రకటించేలా చేశాయి. ఈ రెండు రాష్ట్ర ఏర్పాటుకు కీలకంగా మారాయి. ఆ రెండిటినీ కేసీఆర్ అప్రధానం చేశారు. ముందుచూపుతో పాటను నిర్వీర్యం చేశారు. కవి గాయకులను ఉద్యోగులుగా మార్చివేసి బానిసలను చేశారు. పాలనలోకి వచ్చేదాకా అమరత్వాన్ని వాడుకుని పరిపాలన పగ్గాలు చేపట్టాక విస్మృతిలోకి నెట్టారు. నెట్టి వారి పేర్లకు కూడా పేర్కొనకుండా కోట్లాది రూపాయలతో ‘స్మృతి వనా’న్ని ఏర్పాటు చేసి పక్కకు తప్పుకున్నారు.

పదేళ్ళు కేసీఆర్ భజన చేసి ఇవ్వాళ నోరు తెరిచిన వారంతా పచ్చి అవకాశవాదులు, ద్రోహులే అనడానికి వెనుకాడనక్కర లేదు. వారు తమ ప్రాసంగికతను కోల్పోయారని వేరే చెప్పనవసరం లేదు. గత పదేళ్లుగా తమ ఇష్టానుసారంగా, ఒక పద్ధతి, విధానం లేకుండా అమరుల విషయంలో గత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యహరించిందనే చెప్పాలి. ఇది నిజానికి ఉదాసీనత కాదు. ఒక చరిత్రను వాంఛితంగా విస్మృతిలోకి నెట్టే ప్రయత్నమే అని చెప్పాలి.

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమరుల కుటుంబాలను నేటి ఆవిర్భావ ఉత్సవాలకు ఆహ్వానించడం మంచి పని. నూతన లోగోలో అమరుల స్థూపాన్ని చేర్చి ఘనంగా స్మరించుకోవాలని నిర్ణయించడం కూడా చక్కటి నిర్ణయం. ఐతే, వారిని గౌరవించి ఊరుకోవడమే కాదు, మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు వారికి పూర్తి న్యాయం చేయడానికి యుద్ధ ప్రాతిపదికగా కార్యాచరణలోకి దిగాలి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నూతన ప్రభుత్వానికి ఇది మనందరి డిమాండ్ కావాలి.

((అమరుల కుటుంబాలే కదలాలి

గత సంవత్సరం జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి నుంచి కొంతమంది కళాకారుల బృందం ఊరేగింపుగా స్మృతి వనం చేరుకుంది. స్మృతి వనం వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి ప్రతిమ మెడలో పూలహారం వేశారు. కానీ వేలాది బిడ్డలను కోల్పోయిన తల్లులు వందలాది మంది కళ్ళ ముందే ఉండగా శిలా విగ్రహానికి దండలెందుకు నిజంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పన్నెండు వందల మంది అమరుల కుటుంబ సభ్యులు, ఉద్యమ కారులు – వీళ్ళు కదా ఒక గొప్ప జులూస్ తీయవలసింది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇట్లా ప్రజలంతా తమ రాష్ట్ర పండుగగా అన్నట్లు ఆనందోత్సవాలతో గొప్ప ఉద్విగ్నంగా మిలియన్ మార్చ్‌ని మించిన మార్చ్‌ని జరుపుకోవాలి. అమరుల త్యాగాలను సమున్నతంగా స్మరించుకుంటూ పునర్ నిర్మాణానికి ప్రతిన బూనాలి. కానీ ఏం జరుగింది? ప్రభుత్వం ఒక ప్రదర్శన చేసింది. జీవం లేని సమాధి వంటి నిర్మాణాన్ని ప్రారంభించింది. అసలు స్పిరిట్‌ని వదిలేసి దశాబ్ది ఉత్సవం జరుపుకుంది. ఇదే విషాదం.))

చరిత్ర క్షమించలేదు కాబట్టే...

గతేడాది ఘనంగా జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందడి ముందు, సాంస్కృతిక శాఖ ఆడంబరంగా చేసే ప్రదర్శనల ముందు నిరుపేద అమరుల తల్లులు, తండ్రులు, భార్యలు, చెల్లెండ్ల ప్రశ్నలను ఎవరూ పట్టించుకోలేదు. ‘మా కుటుంబాల ఆధ్వర్యంలో దీని ప్రారంభోత్సవం జరుగుతుందా’, ‘మా పిల్లల అందరి చరిత్రను స్మృతి వనం పొందుపరుస్తుందా’, ‘ మొత్తం అమరుల కుటుంబాలకు సహాయం ఇచ్చేలా ప్రభుత్వం అధికారులను ఆదేశిస్తుందా మీరేమైనా ఈ విషయాలు రాయగలరా’ అని అమరుల కుటుంబ సభ్యులు అడుగుతుంటే వారి మాటలు అమాయకంగా అనిపించవచ్చు. వారి గొంతులు నిస్సహాయంగా వినిపించవచ్చు. కానీ అవి శాపనార్థాలుగా మారాయి కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. రాష్ట్ర ఏర్పాటుకు ఆధారమైన ‘అమరత్వం’ని మొదట కీర్తించకపోయినందుకు ప్రజలు గత ప్రభుత్వానికి తగిన శాస్తి చేశారు.

కొత్త సర్కార్ చేయాల్సింది...

ప్రజ్వలిస్తున్న అమర జ్యోతి సాక్షిగా తెలంగాణ నూతన ముఖ్యమంత్రి నేడు తప్పక జవాబివ్వాలి. మరోమారు మేము కోరేది ఒకటే. త్యాగాలు చేసి అమరులైన వారికి కాస్త గౌరవం కావాలి. అలానే కుటుంబాల బాగోగులు చూడాలి. వారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కారు చేయదని భావిస్తున్నాం. స్థూపాలకు ఇచ్చే కనీస గౌరవం వారిని కన్న తల్లితండ్రులకు ఇవ్వండి. పాడె మోసిన వారు మోసం చేశారు అని ఈ రోజు వరకు ప్రతి తల్లి శోకభారాన్ని అనుభవిస్తూనే ఉంది. అధికార చిహ్నంలో అమరుల స్థూపం లోగోని పెట్టినందుకు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణం పడి ఉంటం. అలానే అంతే గౌరవంతో వారి కుటుంబాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. వారికి ఉన్న న్యాయపరమైన అన్ని హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం. కొత్తగా గుర్తించే అమరుల కుటుంబాల కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఒక హైపర్ కమిటీ ఏర్పాటు చేయాలి ... రాజకీయ పార్టీల జోక్యం లేకుండా సమగ్ర కార్యాచరణ ప్రకటించాలి.

- నరేష్ నాయక్,

తెలంగాణ అమరవీరుల కుటుంబాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు

85005 85982

Advertisement

Next Story

Most Viewed