వరల్డ్ వాక్: ప్రపంచం మొత్తం వాటి గుప్పిట్లోనే

by Ravi |   ( Updated:2022-11-29 19:15:55.0  )
వరల్డ్ వాక్: ప్రపంచం మొత్తం వాటి గుప్పిట్లోనే
X

గో గ్రీన్' అనే థీమ్‌తో అన్ని రంగాలలో నూతన ఆవిష్కరణలు రావాలి. స్వయం సమృద్ధి సాధించుటకు మార్గాలు అన్వేషించాలి.‌ ఇతర దేశాలపై ఆధారపడే స్థితి నుంచి బయటపడాలి. ప్రతీ దేశంలో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూత నివ్వాలి. చేతి వృత్తులను, కుటీర పరిశ్రమలను అభివృద్ధి పరిచేందుకు అడుగులు వేయాలి.‌ అప్పుడు మాత్రమే కేవలం కొన్ని దేశాల కనుసన్నలలో నడిచే పరిస్థితి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఆయా దేశాల ఆదేశాల ప్రకారమే నడిచే స్థితి దాపురిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులను బట్టి, ప్రతీ దేశం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూ, ఆయా దేశాల అవసరాల మేరకు ప్రతీ రంగంలో స్వయం సమృద్ధి సాధించుటకు కృషి చేయాలి. అదే సమయంలో గ్లోబలైజేషన్ లో వచ్చిన మార్పులతో ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటూ ముందుకు సాగాలి.

చిప్స్, చమురు, గ్యాస్.. ఈ మూడు రంగాల ఆధారంగా అమెరికా, చైనా, రష్యా, తైవాన్, దక్షిణ కొరియా, ఒపెక్ దేశాలు ప్రస్తుతం ప్రపంచ దేశాలను తమ గుప్పిట పెట్టుకొని శాసిస్తూ, ఆడిస్తున్నాయి. వేళ్ల మీద లెక్కించదగిన ఈ దేశాల కనుసన్నలలో మిగిలిన యావత్ ప్రపంచ దేశాలు నడవాల్సిన పరిస్థితి గత ఐదు దశాబ్దాలుగా నెలకొని ఉంది. గృహ అవసరాలు, పారిశ్రామిక, ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి చమురు, గ్యాస్, చిప్స్ అత్యంత అవసరమైన అంశాలు. ఇవి కొన్ని దేశాలలో సహజ సిద్ధ వనరులుగా లభిస్తుండగా, చిప్స్, సెమీ కండక్టర్ వంటివి ఆయా దేశాల శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. అవి పలు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెడికల్, రక్షణ వంటి వ్యవస్థలలో కీలక పాత్ర పోషించడం వలన, సమస్త దేశాలు ఆయా దేశాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది.

కరోనా మహమ్మారి కారణంగా ఆహార పదార్థాలు, వివిధ రకాల వస్తువుల సప్లయి చైన్ సరఫరాలో అంతరాలు ఏర్పడి ప్రపంచం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. దీనికి తోడు, ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాలు, గ్యాస్, చమురు వివిధ వస్తువులు కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వస్తు ఉత్పత్తుల మధ్య సరఫరా-డిమాండ్ మధ్య పెద్ద అగాథం ఏర్పడింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్, చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రపంచ దేశాల ప్రజల ఆర్థిక పరిస్థితి దుర్భరం అయింది. దీంతో ప్రపంచ దేశాల జియో పాలిటిక్స్ మరో రూపం సంతరించుకున్నాయి.

సరఫరాలో అంతరాలు

'అగ్గికి ఆజ్యం పోసినట్టు' తైవాన్ విషయంలో చైనా-అమెరికా దేశాల మధ్య ఘర్షణ వాతావరణం (కోల్డ్‌వార్) తారస్థాయికి చేరింది.‌ సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేసే అతి పెద్ద కంపెనీ టీఎస్‌ఎంసీ తైవాన్‌లో ఉండుట వలన సరఫరా కష్టం అవుతున్నది.‌ లాక్‌డౌన్, కర్ఫ్యూలతో పలు కంపెనీలు మూతపడుతున్నాయి.‌ నేటికీ పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదు. దీంతో అనేక దేశాలు వివిధ రంగాలలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.‌ అమెరికాలోని ఇంటెల్, క్వాల్ కం, దక్షిణ కొరియాలోని సామ్‌సంగ్, తైవాన్‌లోని టీఎస్‌ఎంసీ చేతిలోనే 80 శాతం సెమీ కండక్టర్ చిప్స్ ఉత్పత్తి ఉన్నది.‌ 1958లో 'జాక్ కిల్ బి' (Jack Kilby) కనిపెట్టిన 'ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్"(integrated circuit) ప్రస్తుత మైక్రో చిప్‌కు పునాది. దీనిని 20వ శతాబ్దంలోనే అతిపెద్ద ఆవిష్కరణగా చెప్పవచ్చు. దీంతో ప్రపంచ స్వరూపమే మారిపోయింది.

1960లో సెమీ కండక్టర్ ఉత్పత్తి పరిశ్రమలు ప్రారంభమై, అతి కొద్ది కాలంలోనే 1966 నాటికి వన్ బిలియన్ అమెరికన్ డాలర్‌ల వ్యాపారం జరిగింది.‌ 2022 నాటికి అది 600 బిలియన్ అమెరికన్ డాలర్‌లకు చేరుకుంది.‌ చిప్స్ ఆధారంగానే ప్రతీ రంగం ముడిపడి ఉండుటచే దాదాపు అన్ని దేశాలు ఈ చిప్స్ సెమీ కండక్టర్ ఉత్పత్తి చేసే దేశాలపై పూర్తిగా ఆధారపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితి నుంచి బయట పడాలనే ఉద్దేశ్యంతో మనదేశంలో సెమీ కండక్టర్ చిప్స్ తయారీ పరిశ్రమ ప్రారంభించటానికి సుమారు 30 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు.‌ అమెరికా కూడా 52 బిలియన్ అమెరికన్ డాలర్‌లతో ఈ పరిశ్రమలు అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నది.

Also read: ఆధిపత్య దేశాల గుత్తాధిపత్యం వదిలించాలి

‌మనం కూడా మారాలి

ఇక మరో అంశం ముడి చమురు, గ్యాస్, ఆహార ధాన్యాలు. ఇవి ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్, ఒపెక్ దేశాల నుంచే ప్రపంచంలోని చాలా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.‌ ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించారు. చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. దీంతో అనేక దేశాలు వివిధ రంగాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.‌ సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవితాలు దుర్భరం అవుతున్నాయి.‌ దేశంలో విదేశీ నిల్వలు తరిగిపోతున్నాయి.‌ ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఎలక్ట్రానిక్ వెహికల్స్‌కు గిరాకీ పెంచుతున్నారు.

ప్రజలు కూడా వాటి వైపు భారీగా మొగ్గు చూపుతున్నారు. ఇథనాల్ వాడకం, సోలార్ ఎనర్జీ, పవన విద్యుత్ సరఫరా పెంచే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ప్రతీ దేశం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.‌ పంటలు పండించే విధానం మారాలి. ఆధునిక పద్ధతులను ఉపయోగించి పంట దిగుబడిని పెంచేందుకు కృషి చేయాలి.‌ ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారాలి. ప్రత్యామ్నాయ ఆహారం భుజించడం అలవాటు చేసుకోవాలి. ఆహార వృథాను అరికట్టాలి. 'క్లయిమేట్ ఛేంజ్'కు(climate change) కారణాలు తెలుసుకోవాలి.

Also read: ప్రస్తుతం ప్రపంచదేశాలకు అదే సవాల్ గా మారిందా?

ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టాలి

వీటన్నింటికీ బాధ్యులం మనమే అనేది నిర్వివాదాంశం. నివారణా చర్యలు చేపట్టాలి. 'గో గ్రీన్' (go green) అనే థీమ్‌తో అన్ని రంగాలలో నూతన ఆవిష్కరణలు రావాలి. స్వయం సమృద్ధి సాధించుటకు మార్గాలు అన్వేషించాలి.‌ ఇతర దేశాలపై ఆధారపడే స్థితి నుంచి బయటపడాలి. ప్రతీ దేశంలో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూత నివ్వాలి. చేతి వృత్తులను, కుటీర పరిశ్రమలను అభివృద్ధి పరిచేందుకు అడుగులు వేయాలి.‌ అప్పుడు మాత్రమే కేవలం కొన్ని దేశాల కనుసన్నలలో నడిచే పరిస్థితి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఆయా దేశాల ఆదేశాల ప్రకారమే నడిచే స్థితి దాపురిస్తుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పులను బట్టి, ప్రతీ దేశం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూ, ఆయా దేశాల అవసరాల మేరకు ప్రతీ రంగంలో స్వయం సమృద్ధి సాధించుటకు కృషి చేయాలి. అదే సమయంలో గ్లోబలైజేషన్ లో వచ్చిన మార్పులతో ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటూ ముందుకు సాగాలి. 'అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి' అనే థీమ్‌తో ముందుకు సాగుటయే మన అందరి ముందు ఉన్న ప్రస్తుత కర్తవ్యం.


ఐ. ప్రసాదరావు

63056 82733

Advertisement

Next Story

Most Viewed