వరల్డ్ వాక్: ఆధిపత్య దేశాల గుత్తాధిపత్యం వదిలించాలి

by Ravi |   ( Updated:2022-11-15 18:30:21.0  )
వరల్డ్ వాక్: ఆధిపత్య దేశాల గుత్తాధిపత్యం వదిలించాలి
X

ప్రతీ దేశం తమకు కావలసిన వస్తువులు, సరుకుల కోసం ఇతర దేశాలపై ఆధారపడితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో కరోనా కాలంలో చూశాం. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంతో అన్ని దేశాలకు కనువిప్పు కలిగింది. యూరప్ దేశాలన్నీ గ్యాస్, ఆహార పదార్థాలకు రష్యాపై, చిప్స్ కోసం తైవాన్, చైనాపై, చమురు కోసం ఓపెక్ దేశాలపై ఆధారపడుతున్నాయి. మనదేశం సైతం ఫార్మస్యూటికల్ ఇంగ్రిడెంట్స్ విషయంలో దాదాపు మూడొంతులు చైనాపై ఆధారపడుతోంది.

ప్రపంచంలో పెద్ద మార్కెట్

ద్రవ్యోల్బణం, అధిక ధరలు, ఆహార సప్లయి చైన్ అంతరాలు, ఆహార ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి. దీనికంతటికీ కారణం వివిధ దేశాలు వారికి కావలసిన వస్తువులు, సరుకుల కోసం ఒకటి, రెండు దేశాలపై ఆధారపడటమే. కొన్ని దేశాలు తమ అవసరాలు తీర్చుకోవడానికి తమ దేశంలోనే వస్తువులు, సరుకులు తయారు చేసుకోవడానికి ప్రణాళికలు మొదలు పెట్టాయి. అందులో భాగంగానే మన దేశం గతిశక్తి, ఆత్మ నిర్భర్ భారత్ అనే నినాదంతో స్వయం సమృద్ధి సాదించుటకు మార్గాలను రూపొందించింది. సెమీ కండక్టర్ చిప్స్ తయారు చేయడానికి ప్రోత్సహకరంగా రూ.76,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని 'ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ' ప్రకటించింది.

గూగుల్‌లో ఏ వస్తువు కోసం వెతికినా చైనా ఉత్పత్తులే కనబడుతుంటాయి. 87 శాతం టోస్టర్స్, 83 శాతం ఎలక్ట్రిక్ లాంప్స్, 80 శాతం ఆడియో వీడియో డివైజ్‌లు, 72 శాతం మొబైల్ ఫోన్లు, 70 శాతం మైక్రోవేవ్ ఓవెన్లు, 66 శాతం ఇయర్ ఫోన్స్, 65 శాతం హెయిర్ డ్రస్సర్స్, హాంగ్‌కాంగ్ నుంచి ఉత్పత్తి చేస్తూ చైనా ప్రపంచ మార్కెట్‌ను పెద్ద ఎత్తున ఆక్రమించింది. సోషల్ మీడియాలో 64 శాతం, అమెజాన్ ద్వారా 37శాతం చైనా ఉత్పత్తులే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం చైనా వస్తువులు చౌకగా లభించడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, అక్కడ చౌకగా కార్మికులు లభ్యం కావడం, పారిశ్రామిక విధానం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉంటడం. కార్బన్ ఉద్గారలాపై పెద్దగా అజమాయిషీ లేకపోవడమే. వేల కొలది మల్టీ నేషనల్ కంపెనీలు చైనాలో ఏర్పాటయ్యాయి. అందుకే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది.

Also read: వరల్డ్ వాక్: కరువు ముంగిట్లో ప్రపంచం

బయటకు రావాలి

రష్యా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ కూడా వివిధ రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తూ ప్రపంచ దేశాలను తమ గుప్పిట పెట్టుకొని శాసిస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఈ గుత్తాధిపత్య దేశాల నుంచి బయటపడి స్వయం సమృద్ధి సాధించడానికి మార్గాలు అన్వేషించాలి. తమ దేశాలలలో కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు చేయూత నివ్వాలి. ఎంఎస్ఎంఈ, చేతి పరిశ్రమలకు చేయూత నివ్వాలి. కరోనా కారణంగా కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు చైనాను విడిచి పెట్టాయి ఈ కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

గ్యాస్, సెమీ కండక్టర్ చిప్స్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువులకు అన్ని దేశాలు ఒకటి రెండు దేశాలపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడాలి. లేకపోతే దేశాలన్నీ తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలపై భారం, ఒత్తిడి పెరిగి బహుముఖ పేదరికం విజృంభిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు ఇతర దేశాలపై ఆంక్షలు విధిస్తూ, ఆయా దేశాల అభివృద్ధికి అడ్డుగోడగా నిలుస్తాయి. అప్పులు ఇచ్చి ఆయా దేశాల సార్వభౌమత్వంపై స్వారీ చేస్తాయి. 'ఆటోక్రసీకి డెమొక్రసీ' మధ్య సంఘర్షణ మొదలవుతుంది.‌ ' మోనోపోలీ నుంచి డిమోనోపొలైజ్' అవ్వాలి.

Also read: వరల్డ్ వాక్: సంక్షోభంలోనూ మేలైన దిగుమతి

అందరికీ అందుబాటులో ఉండేలా

మన దేశం కూడా ఇటీవల ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. అమెరికా శాటిలైట్ వస్తువులు, తైవాన్ సెమీ కండక్టర్ చిప్స్ విషయంలో, చైనా చాలా వస్తువులలో, రష్యా గ్యాస్, చమురు రంగంలో, ఉక్రెయిన్ ఆహార పదార్థాలు, మంచి నూనె విషయంలో ముందంజలో ఉన్నాయి. సమస్యలు వచ్చినప్పుడు ప్రపంచ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇకనైనా అన్ని దేశాలు తమ తమ అవసరాలు తీర్చుకోవడానికి యత్నించాలి. ప్రపంచవ్యాప్తంగా అందరూ తరచూ వాడే సుమారు వంద వస్తువులు అన్ని దేశాలకు అందుబాటులో ఉండేలా 'వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్' ప్రయత్నాలు చేయాలి.

జి-20 సారథ్యం వహించనున్న భారత్ ఈ అంశాలపై స్పష్టమైన అవగాహనతో ముసాయిదా తయారు చేసి, ప్రపంచ దేశాలు ముందు ఉంచి, ఆమోదం పొందాలి. అప్పుడు మాత్రమే గుత్తాధిపత్యం పోయి, అన్ని వస్తువులు అందరికీ అందుబాటులో వచ్చి, ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రపంచ దేశాల మధ్య ఉన్న ఆధిపత్యం పోరు తగ్గుతుంది.


ఐ.ప్రసాదరావు

63056 82733

Advertisement

Next Story

Most Viewed