నాణ్యమైన ప్రభుత్వ విద్య అవసరం!

by Ravi |   ( Updated:2024-10-05 00:30:36.0  )
నాణ్యమైన ప్రభుత్వ విద్య అవసరం!
X

‘‘ఉపాధ్యాయుల హోదా పెంచడానికి, వారి హక్కులు, బాధ్యతలకు సంబంధించి‘‘ కొన్ని నిర్దిష్టమైన సిఫార్సులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించిన ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 5వ తేదీని ‘‘ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం’గా ప్రకటించింది. ‘‘స్టేటస్ ఆఫ్ ది టీచర్స్” పై యునెస్కో 1966 అక్టోబర్ లో 13 చాప్టర్లతో , 146 అంశాలతో కూడిన విధాన పత్రాన్ని ఆమోదించింది. అయితే ఉపాధ్యాయ అంతస్తు సాధనకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉద్యమించవలసి వస్తోంది.

బోధనకు ఆటంకం కలగకుండా..

ఉపాధ్యాయులకు వారి కుటుంబ అవసరాలు, ఉన్నత జీవన స్థాయి, మార్కెట్లో నిత్యావసరాల ధరల సూచీలు, ఉన్నత విద్యార్హతలు పొందడానికి అయ్యే ఖర్చులు, పరిగణనలోకి తీసుకొని గౌరవప్రదమైన జీవన వేతనాలను నిర్ణయించాలని, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి వేతన స్కేళ్ళను రూపొందించాలని, తాత్కాలిక ఉపాధ్యాయులకు కూడా శాశ్వత ఉపాధ్యాయుల కన్నా తక్కువ వేతనాలు ఇవ్వకూడదని, వేతనాలు నిర్ణయించడంలో ఉపాధ్యాయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనకుండా చూడాలని, వార్షిక వేతనాభివృద్ధితో పాటు అప్రయత్న పదోన్నతి స్కేళ్ళను కూడా ఇవ్వాలని యునెస్కో తీర్మానించింది. ప్రతిభ ప్రాతిపదికన వేతనాలు నిర్ణయించకూడదని, విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ ఉండే విధంగా తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య నిర్ణయించాలని, ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కలగకుండా బోధనేతర సిబ్బందిని నియమించాలని, ఉపాధ్యాయులకు బోధనోపకరణాలను ప్రభుత్వమే సమకూర్చాలని కూడా తీర్మానించింది. అయితే ఈ బోధనోపకరణాలు ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కారాదని స్పష్టంగా తెలిపింది. ఉపాధ్యాయుల పని భారం నిర్ణయించడంలో ఉపాధ్యాయ సంఘాల సూచనలు, సలహాలు పాటించాలని, ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం మానసిక, శారీరక విశ్రాంతి లభించే విధంగా సెలవులు ఇవ్వాలని, పై చదువులు చదువుకోవడానికి, అనారోగ్యానికి ప్రత్యేకంగా సెలవులు ఇవ్వాలని కూడా తీర్మానం పేర్కొంది.

టీచర్ హోదా క్షీణిస్తోంది

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం 1990 నుంచే ఉపాధ్యాయుని హోదా క్షీణించడం ప్రారంభమైందని, ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించడానికి యువత అనాసక్తతను ప్రదర్శిస్తోందని, పాఠశాలలు, ఉపాధ్యాయులపై నియంత్రణ అధికమై స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన జరుపలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ‘‘ఉపాధ్యాయ వృత్తి ఎంత గౌరవప్రదమని భావించినప్పటికీ” వారికి తక్కువ ప్రతిఫలం లభిస్తోందని, ఫలితంగా ఈ వృత్తిని ఉపాధ్యాయులు సంతృప్తికరంగా సమాజం భావించిన విధంగా నిర్వహించలేకపోతున్నారని తెలుస్తోంది.

వేతనాల చెల్లింపులో వివక్ష

తాత్కాలిక, శాశ్వత ఉపాధ్యాయుల మధ్య వేతనాలలో వివక్ష ఉండరాదని యునెస్కో చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఒకే రకమైన పనికి ఒకే వేతనం ఉండాలని గతంలో తీర్పు చెప్పింది. అయినా మన దేశంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా తక్కువ వేతనంతో పనిచేసే ఉపాధ్యాయులు విద్యావ్యవస్థలో ఉన్నారు. పెట్టుబడిదారుల, పాలకుల కనుసన్నల్లో నడిచే ఐక్యరాజ్యసమితి, యునెస్కో ఉపాధ్యాయుల హోదా అంతస్తు వేతనాల చెల్లింపులో వివక్షత పట్ల వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నాయి. పారా టీచర్లు, గెస్ట్ టీచర్లు, కాంట్రాక్టు టీచర్లు, విద్యా వాలంటీర్లు, అకడమిక్ కన్సల్టెంట్లు ... పేరు ఏదైనా కావచ్చు! ఉపాధ్యాయులు చట్టబద్ధమైన దోపిడీకి గురవుతున్నారు. పైన తెలిపిన అంశాలు ఏవి కూడా నూతన జాతీయ విద్యా విధానంపై చర్చించలేదు. పైగా ఉపాధ్యాయులను ‘‘హైర్” చేసుకోవాలనే కొత్త భావనను జాతీయ విద్యా విధానం ముందుకు తెచ్చింది. కొఠారి కమిషన్ ఉపాధ్యాయ వృత్తిలోకి సమాజంలోని అత్యంత ప్రతిభావంతులైన యువకులను ఆకర్షించడానికి అధిక వేతన విధానం మెరుగైన పని పరిస్థితులు సర్వీస్ కండిషన్లను రూపొందించాలనే సిఫార్సులను నూతన జాతీయ విద్యా విధానం గమనంలోకి తీసుకోలేదు. అంతే కాకుండా ఉపాధ్యాయులకు పదోన్నతులు సీనియార్టీ ప్రకారం కాకుండా ప్రతిభ ప్రాతిపదికన ఇవ్వాలనే ఉపాధ్యాయ వ్యతిరేక సూచనలు చేసింది.

అప్పుడే నాణ్యమైన విద్య!

విద్యారంగానికి ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున కేటాయిస్తూ, యునెస్కో విధాన పత్రం ప్రాతిపదికన ఉపాధ్యాయుల హోదా, అంతస్తు పెరిగే విధంగా చర్యలు తీసుకుంటూ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ రంగంలో విద్యావ్యవస్థ నడిచేలా చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రజలందరికీ నాణ్యమైన, సమానమైన విద్య అందించగలుగుతాం. అదే నినాదంతో యునెస్కో, ఐక్యరాజ్యసమితి, ఎడ్యుకేషనల్ ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ సారి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని నిర్ణయించాయి.

(ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా)

కె. వేణుగోపాల్,

పూర్వ అధ్యక్షులు, ఏపీటీఎఫ్,

98665 14577

Advertisement

Next Story

Most Viewed