- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్థరైటిస్‌ను జయించడం ఎలా?
ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి... అంటారు మహాకవి శ్రీశ్రీ. ఒకప్పుడు ఇది నూటికి నూరుపాళ్ళు నిజమే. ఎందుకంటే మలివయసుకు చేరిన వృద్ధులలో ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమైతే ఆ బాధలను అధిగమించలేక, సమస్యలను తట్టుకోలేక నరకయాతన పడుతూ బ్రతకడం కంటే చావడమే మేలనే భావన అప్పట్లో ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు. వైద్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల, ఆధునిక విధానాల ద్వారా కీళ్ల వ్యాధుల నుండి పూర్తిస్థాయిలో ఉపశమనం పొంది తద్వారా సాధారణ జీవితం గడిపేందుకు పూర్తిగా అవకాశాలున్నాయి. కానీ ఈ రకంగా పూర్తిగా వైద్య ఫలాలు అందాలంటే కీళ్ల వ్యాధుల సమస్యల పట్ల సరైన అవగాహన ప్రతి ఒక్కరిలో కలగాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం, ఎముకల ఆరోగ్యం ఆవశ్యకతను తెలిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్ 12వ తేదీని ప్రపంచ ఆర్థరైటిస్ దినంగా పాటిస్తున్నది.
వ్యాధిని ఎలా గుర్తించాలి?
ఏ వ్యాధి విషయంలోనైనా ప్రతి ఒక్కరూ గమనించవలసినది వ్యాధిని ముందుగా గుర్తించడం. వ్యాధి లక్షణాలు సరైన సమయంలో గమనించి సరైన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ అయిన అనంతరం వైద్యుల సూచనల మేరకు మందులు వాడడం, నిర్దిష్టమైన వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడం, వైద్యుల సూచనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించడం వంటివి ప్రధానమైన అంశాలు.అయితే, అన్ని కీళ్ల సమస్యలు ఆర్థరైటిస్ కాదు. ఆర్థరైటిస్ వ్యాధి సంక్రమించిందని తెలుసుకోవడానికి కీళ్ల సమస్యలపై అవగాహన కలిగి ఉండాలి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఎముకలు బిరుసుగా ఉండడం, నొప్పులు రావడం, కండరాల నొప్పులు రావడం, తీవ్రమైన అలసట, నిస్సత్తువ కలగడం, కీళ్లలో వాపులు రావడం, కీళ్లలో చిన్నగా శబ్దాలు రావడం వంటివి తరచుగా సంభవిస్తాయి. ఈ లక్షణాలు ఉన్నవారు తక్షణమే వైద్యులను సంప్రదించాలి. కీళ్ల వ్యాధులు అనేక రకాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లు ప్రధానంగా పేర్కొనబడే కీళ్ల వ్యాధులు. దీనిని తెలుగులో కీళ్లవాతమని కూడా అంటారు.
పూర్వం ఈ వ్యాధి వయసు మళ్ళిన వారిలో వచ్చేది. కానీ ప్రస్తుత జీవనశైలి వలన అందరూ ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఎక్కువగా 35 ఏళ్లు పైబడిన మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, జీవక్రియ లోపం, హార్మోన్ల అసమతుల్యత, థైరాయిడ్ ప్రభావం, సోరియాసిస్, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ శక్తి తగ్గడం, సైనోవియల్ ద్రవంలో తేడాలు, అధిక బరువు, ప్రమాదాల కారణంగా ఎముకలకు తగిలిన గాయాల వల్ల లిగమెంట్ కార్టిలేజ్ దెబ్బతినడం. ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడడం. ఆహార విధానంలో మార్పులు, జాయింట్ లో వచ్చే ఇన్ఫెక్షన్లు, బోన్ ట్యూమర్లు, సోరియాసిస్ వంటివి ఆర్థరైటిస్లకు ప్రధాన కారణాలు
ఈ వ్యాధిని అదుపులో ఉంచొచ్చు!
శరీరంలో ఒకటి కంటే ఎక్కువ జాయింట్లలో తీవ్రమైన నొప్పులు ఉంటే ఆర్థరైటిస్‌గా అనుమానించాలి. జాయింట్లు వద్ద నొప్పులు, వాపులు ఉంటే ఇది ఆర్థరైటిస్‌ను సూచిస్తుంది. నిర్ధారణ కొరకు కొన్ని టెస్ట్‌లు చేయించుకోవాల్సి వస్తుంది. మనదేశంలో ఏడు నుండి 10 కోట్ల మంది ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారనేది ఒక అంచనా. ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలి. వైద్యుల సూచనల మేరకు వ్యాయామం, నడక వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి. కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అధిక బరువును నియంత్రించుకోవాలి. అధిక బరువులు ఎత్తకపోవడం, ప్రయాణాలలో ఎక్కువగా నిలబడి ఉండడం, ఆకస్మాత్తుగా జర్కులు ఇచ్చే ప్రయాణాలకు దూరంగా ఉండాలి.
రోగి యొక్క వ్యాధి తీవ్రతను బట్టి చికిత్సను నిర్ధారిస్తారు. సాధారణంగా ఆర్థరైటిస్ రోగుల్లో కేవలం 10 శాతం మందికి మాత్రమే శస్త్రచికిత్సలు అవసరం అవుతాయి. మిగిలిన వారికి మందులు, జీవన విధానంలో మార్పులు, వ్యాయామాల ద్వారా వ్యాధిని అదుపులో ఉంచవచ్చు. అది కూడా రోగి వ్యాధి తీవ్రతను అంచనా వేసి వైద్యులు సూచించిన విధంగా మాత్రమే చేయాలి. దీనిని తగ్గించుకునేందుకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది కావున భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తపడండి చాలు.
(నేడు వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా)
డా. వరుణ్ వేములపల్లి
ఎంబిబిఎస్, ఎం.ఎస్
98498 46124