స్త్రీ ఉత్పత్తి సామర్థ్యంపై గొడ్డలి వేటు!

by Ravi |   ( Updated:2023-06-18 00:15:37.0  )
స్త్రీ ఉత్పత్తి సామర్థ్యంపై గొడ్డలి వేటు!
X

భారతదేశంలో స్త్రీలపై అణచివేత నానాటికీ పెరుగుతోంది. చాలా రంగాల్లో స్త్రీ, భాగస్వామ్యం పెరుగుతున్నట్లు కనిపించినా, వారిపై అంతర్గత అణచివేత కొనసాగుతూనే ఉంది. దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన స్కీమ్‌లన్నీ కూడా ఆకాశంలో తెల్ల మబ్బుల్లా ఉన్నాయి. ఉదాహరణకు జవహార్ రోజ్ గార్, ఇందిరా ఆవాస్ యోజన వంటి పథకాలు కాగితాల్లోనే ఘనంగా ఉండిపోతున్నాయి. స్త్రీల నిరక్షరాస్యతను ఒక పథకం ప్రకారం పెంచుతున్నారు. స్త్రీలను ఆహారోత్పత్తిలోనూ, పారిశ్రామికోత్పత్తిలోనూ భాగస్వామిని చేయలేక పోవడం మహిళా జనాభాలో పేదరికం పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం.

ఇందులో స్త్రీల పాత్ర ఎక్కువ!

నిజానికి ఇప్పటికీ భారతదేశం నుండి అత్యధికంగా ఎగుమతి అవుతున్న టెక్స్‌టైల్ పరిశ్రమ స్త్రీల ఉత్పత్తి క్రమం నుంచే రూపొంది కొనసాగుతోంది. దేశానికి ఎక్కువ లాభాలు అందిస్తున్న తేయాకు పరిశ్రమ కూడా స్త్రీల శ్రమ నుండే పెరుగుతోంది. భారతదేశంలో ఫార్మసీ రంగం 22.5 బిలియన్ డాలర్ల ఔషధాలను ఎగుమతి చేస్తోంది. దీంట్లో కూడా స్త్రీల పాత్రే ఎక్కువగా ఉండటం గమనార్హం. విదేశీ కరెన్సీని సాధించడంలో దేశం మెరుగ్గా ఉంటున్నప్పటికీ అయితే భారతదేశంలో మాత్రం అత్యున్నతమైన ఉత్పాదక రంగాల నుండి స్త్రీలని తొలగించే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు (ఎఫ్.ఎ.పి.ఆర్.) గణనీయంగా తగ్గుతోంది. ఇది కాలక్రమంగా కనిపించే పరిణామం. పని చేసే వయసులో ఉన్న మహిళల్లో పని చేసే వారి సంఖ్య క్షీణిస్తోంది. 2011-12లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు 32.2 శాతం ఉంటే 2017-18లో ఇది 23.3 శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాలలో మహిళా కార్మికుల భాగస్వామ్యం 2017-18లో 11 శాతం తగ్గింది. గ్రామీణ ప్రాంతాలలో పురుష కార్మికుల భాగస్వామ్యం కూడా తగ్గినా మహిళల భాగస్వామ్యం అంతకన్నా ఎక్కువగా తగ్గింది.

గ్రామీణ ప్రాంతాలలో మహిళా కార్మిక భాగస్వామ్యం తగ్గడమే కాక వారి స్థానంలో పురుషులను నియమించుకోవడం ఎక్కువైంది. మహిళా కార్మికుల భాగస్వామ్యం ఎందుకు తగ్గుతోందో లోతుగా పరిశీలించవలసిన అగత్యం ఉంది. ఉద్యోగావకాశాలు లేకపోవడం, విద్యావకాశాలు పెరగడం, కుటుంబాల ఆదాయం పెరగడం, మహిళా కార్మికులు చేసే పని గురించి సరైన సమాచారం లేకపోవడం దీనికి కారణం అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో సంక్షోభం ప్రభావం మహిళల మీదే ఎక్కువ ఉంటుంది. మహిళలకు ఆదాయ వనరులు తగ్గిపోతున్నాయి. అక్కడ తగిన ఉపాధి దొరకడం లేదు. వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోతోంది. వ్యవసాయేతర రంగంలో ఆర్థిక అవకాశాలు ఉండడం లేదు. దీనికి యాంత్రీకరణ కూడా తోడైంది.

ఆదాయం రాని పనుల భారంతో..

మహిళలు పని చేయాలంటే వారికి అనువైన సమయంలో పని చేసే అవకాశం ఉండాలి. పని ఇంటికి దగ్గరలో ఉండాలి. మహిళలు ఆదాయం సమకూరని ఇంటి చాకిరీ చేయడం వల్ల కార్మిక శక్తిలో వారి పాత్ర తగ్గుతోంది. ఆదాయం రాని ఇంటి పనికి ఎక్కువ సమయం వెచ్చించవలసి వస్తున్నందువల్ల మహిళలు ఇతర పనులు చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాలలో మరింత ఎక్కువగా ఉంది. పితృస్వామిక నియమాల వల్ల, మతపరమైన నిషేధాలు, సాంస్కృతిక పక్షపాతం వల్ల మహిళలు పని చేసే అవకాశం తగ్గుతోంది. ఇటీవలి కుటుంబాలు చిన్నవై పోతున్నందువల్ల, మగవారు పని కోసం అన్వేషిస్తూ వలస వెళ్లడం వల్ల మహిళలు ఆదాయం రాని పనులకే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. సమయాన్ని వినియోగించుకునే విషయంలో ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ అందించిన సమాచారం ప్రకారం భారతీయ మహిళలు రోజూ 352 నిమిషాలు ఇంటి పనిలోనే మునిగిపోతారు. ఇది ఆదాయం రాని పని చేయడంకన్నా 577 శాతం ఎక్కువ. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. "సమయం దక్కకపోవడం" వల్ల పేదల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఇంటి పని వల్ల మెరుగైన నైపుణ్యం సంపాదించడం సాధ్యం కావడం లేదు. అందువల్ల మహిళలు కార్మిక శక్తిలో భాగస్వాములు కాలేకపోతున్నారు. ఇంట్లో ఉండే వారిని చూసుకోవడం కోసం, పిల్లలను చూసుకోవడానికి మౌలిక సదుపాయాలు కల్పించడం సాధ్యమైతే కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది.

ఇటీవల రాజ్యవ్యవస్థ నిర్ణయించిన విధానాలు వ్యవస్థీకృత రంగంలోని మహిళా కార్మికులకే ఉద్దేశించినవి. 2016 నాటి ప్రసూతి ప్రయోజన (సవరణ) బిల్లులో మహిళలకు 26 వారాలు ప్రసూతి సెలవు ఇచ్చే అవకాశం కల్పించారు. ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు ప్రకారం శిశువుల రక్షణకు పని చేసే మహిళలు 50 మందికన్నా ఎక్కువ ఉంటే శిశు సంరక్షణాలాయాలు ఏర్పాటు చేయాలని ఉంది. అవ్యవస్థీకృత రంగంలో ఇలాంటి సదుపాయాలు తక్కువ. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే మహిళల కోసం శిశు సంరక్షణాలయాలు ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉన్నా వాస్తవంలో ఇది సాధ్యం కావడం లేదు. శిశు సంరక్షణాలయాలకు కేటాయించే నిధులలో కేంద్ర ప్రభుత్వం కోత పెట్టినందువల్ల దేశ వ్యాప్తంగా అనేక శిశు సం రక్షణాలయాలు మూత పడుతున్నాయి.ఇప్పుడు అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, సమగ్ర శిశు అభివృద్ధి పథకంతో పాటు మారుతున్న ఉత్పత్తి ప్రక్రియ కు అనుగుణంగా వృత్తి శిక్షణా సదుపాయాలు కల్పిస్తే కార్మిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. ఇప్పుడు సామ్రాజ్యవాద భావజాలంలో భాగంగా వస్తున్న మార్కెటింగ్ కళల్ని స్త్రీలు ఆహ్వానిస్తున్నారు. దాంతో మళ్ళీ స్త్రీ పురుషుని యొక్క భోగ వస్తువుగా మారిపోతుంది. పురుషుణ్ణి ఆనంద పెట్టే దిశగా ఆమె ప్రవర్తనని, వ్యక్తిత్వాన్ని మార్చివేస్తూ ప్రపంచ సామ్రాజ్యవాదం, భారతీయ హిందూ వారం అడుగులేస్తూ ఉంది.

వివక్ష లేని విధానాలు రూపొందాలి..

భారతదేశ ప్రధానమైన ఉత్పత్తి రంగం నుంచి స్త్రీని తప్పించే ప్రయత్నంలో భాగంగా స్త్రీ విద్య మీద హిందూ మతం పెద్దయెత్తున దాడి చేసింది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పితృస్వామ్య అధిపత్యాన్ని పెంచడం కోసం స్త్రీని పురుషుడు గృహహింసకు గురిచేసే ఆయుధంగా మద్యాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో స్త్రీల పాత్రను మరింత తగ్గిస్తూ వస్తున్నారు. ఉద్యోగాల్లో కోటాలు, మహిళలకు రుణాల వంటి నిర్దిష్ట వర్గాల వారి కోసం అనుసరించే విధానం వల్ల శ్రామిక మార్కెట్ లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. కార్మిక శక్తిలో మహిళా భాగస్వామ్యానికి అడ్డంకులను తొలగించాలంటే కార్మికుల డిమాండ్‌కు సంబంధించిన అవరోధాలను తొలగించి స్త్రీ-పురుష వివక్ష లేని విధానాలు విధానాలు రూపించించాలి. అప్పుడే మహిళలు ఆదాయం రాని పనుల మీద ఆధారపడడం తగ్గిపోతుంది. కార్మికుల డిమాండ్ పెంచడానికి దానికి ఆటంకాలు తొలగించడానికి ప్రభుత్వాలు అనుసరించే విధానాలు సవ్యంగా లేనందువల్ల మహిళలు ఆదాయం రాని పనులు చేయవలసి వస్తోంది. మహిళలు ఆదాయం రాని పనులలో మునిగిపోవడానికి సామాజిక, సాంస్కృతిక అంశాలు కూడా కారణం. భారతదేశంలో 6 కోట్ల మంది స్త్రీలు వస్తు ఉత్పత్తిలో భాగంగా లేరు. ఇంకా జనాభా పెరుగుతున్న కొద్దీ ఆహార భద్రతా వ్యవస్థ కూడా తగ్గిపోతూ వస్తుంది. ముఖ్యంగా పర్యావరణ రక్షణ విషయంలో, చెట్లు పెంచే విషయంలో, నీటిని పరిశుభ్రంగా ఉంటే విషయంలో పిల్లలకు ఇంటి దగ్గర పాఠాలు చెప్పే విషయంలో స్త్రీల శాతం తగ్గిస్తూ వచ్చారు. ఇకపోతే దళిత గిరిజన స్త్రీలకు చాట్లు, కోతలు తప్ప రెండో పనిలోకి రానివ్వడంలేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వీరికి ప్రవేశం కల్పించకుండా చేశారు. వారికి వచ్చిన వ్యవసాయోత్పత్తి, నైపుణ్యంలో కూడా వారికి దెబ్బవేసారు. వాళ్ళు రక్తహస్తులవుతున్నారు. ఆహారోత్పత్తిలోనూ, పారిశ్రామికోత్పత్తిలోనూ స్త్రీల సంఖ్య గణనీయంగా తగ్గించి వారిని కొనుగోలు ప్రదేశాల్లోకి నెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే స్త్రీలను ఆహార, పారిశ్రామిక ఉత్పత్తి రంగాల్లోంచి తప్పింది విక్రయ రంగంలోకి నెట్టడం, అక్కడ కూడా అవకాశాలు తగ్గిపోతుండటం దేశాభివృద్ధికి మేలు చేయదని గ్రహించాలి.

- డా. కత్తి పద్మారావు

సామాజిక దళిత ఉద్యమ నాయకులు

98497 41695

Advertisement

Next Story

Most Viewed