- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజ్యాంగ పరిరక్షణతోటే.. దేశానికి భవిష్యత్తు!
భారత రాజ్యాంగం ఒక జీవశాస్త్రం. అది మానవ అభ్యుదయ సోపానం. ప్రజాజీవన సమన్వయ సముజ్వల ప్రభాసమాన దీపిక. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమ రాజ్యాంగంగా కొనియాడబడింది. నిజానికి భారత రాజ్యాంగ రూపశిల్పి డా.బి.ఆర్.అంబేద్కర్ ప్రపంచ తత్వశాస్త్ర అధ్యయనపరుడు. ఆయన మీద రూసో ప్రభావం వుంది. సామాజిక న్యాయం కోసం ఆయన తపించాడు. సమాజంలో మానవులందరు సమానంగా జీవించాలనే ఆకాంక్ష అంబేద్కర్‌ను ఒక సామాజిక, రాజకీయ దార్శనికుడుగా మార్చింది. నిజానికి భారత రాజ్యాంగ రూపకల్పన చరిత్ర ఈనాడు చర్చనీయాంశంగా వుంది. చిన్న పిల్లల మీద కరుణ, స్త్రీల మీద అత్యుత్తమైన గౌరవం, హక్కుల పరిరక్షణకు అంబేద్కర్ కట్టుబడి ఉన్నారు. ప్రతి అధికరణంలోనూ ఆయన ముద్రను చూపించారు. అందువల్లే భారత రాజ్యాంగం మీద ప్రజలకి ఇంత నమ్మకం ఇంత అధ్యయన దృష్టి వున్నాయి.
రాజ్యాంగ సభలో ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ఉన్న అంబేద్కర్ గతంలో తాను ప్రతిపాదించిన 'ప్రజల సామాజిక మానసిక స్థితిని రాజ్యాంగం పరిగణనలోకి తీసుకోవాల'న్న వాదనను ఉద్ఘాటించలేదు. అంతే కాదు, ప్రజాస్వామిక సోషలిజం సూత్రా లను రాజ్యాంగం నిర్వహించాలని కూడా ప్రస్తావించలేదు. ‘సోషలిస్టు’ అన్న పదాన్ని రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్లో చేర్చా లంటూ కె.టి.షా ప్రతిపాదించిన సవరణను తోసిపుచ్చుతూ, రాజ్యాంగమనేది రాజ్యం/ ప్రభుత్వంలోని వివిధ అంగాల పనిని క్రమబద్ధీకరించేందుకు ఉద్దేశించిన యంత్రాం గం మాత్రమేనని పేర్కొన్నారు. ఇది కొన్ని నిర్దిష్ట పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు ఉద్దేశించింది కాదని స్పష్టం చేశారు. రాజ్యం/ ప్రభుత్వ విధానం ఎలా ఉండాలి, ఆర్థికంగా, సామాజికంగా సమాజాన్ని ఎలా వ్యవస్థీకరించాలన్న విషయాలను ప్రజలు స్వయంగా నిర్ణయించుకోవాలి. ఈ అంశాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరిస్తే, ఫలితం ప్రజాస్వామిక విధ్వంసం అని ఆయన విస్పష్టంగా చెప్పారు. ‘ఒకవేళ అటువంటి అంశాలను రాజ్యాంగంలో పేర్కొంటే, రాజ్యం లేదా ప్రభుత్వ సామాజిక వ్యవస్థీకరణ ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంటుందని, నా దృష్టిలో, తాము జీవించే సమాజంలో సామాజిక వ్యవస్థీకరణ ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రజల నుంచి మీరు లాక్కుంటున్నారు,’’ అని స్పష్టంగా చెప్పారు.
రాజ్యాంగంలో బౌద్ధ జీవన పరిమళం
నిజానికి భారత రాజ్యాంగ రూపకల్పన మీద ప్రపంచవ్యాప్తంగానే అనేక విశ్వవిద్యాలయాల్లో లోతైన పరిశీలన జరుగుతూ వుంది. ఎహెచ్ ఆహిర్ అనే పరిశోధకుడు అంబే ద్కర్ రూపొందించిన రాజ్యాంగంలో బౌద్ధ జీవన సిద్ధాంత పరిమళం ఉందని చెప్పారు. ఇటీవల విలియం డాల్‌రింపుల్ రాసిన The Golden Road అనే పుస్తకంలో కూడా బౌద్ధ సాంస్కృతిక విప్లవ ప్రభావం డా॥బి.ఆర్.అంబేద్కర్ మీద, ఆయన రాజ్యాంగం శిల్పం మీద ఉందని చెప్పారు. అంబేద్కర్‌లో బెర్ట్రాండ్ రస్సెల్ హేతువాద దృక్పథం దాగివుంది. అందుకే ఆయన భారత రాజ్యాంగాన్ని ఒక జీవశాస్త్రంగా రచించగలిగారు. ఇందులో కరుణ స్వభావం పరిఢవిల్లుతుంది. రాజ్యాంగంలో 24వ అధికరణలో 'చిన్న పిల్లలచేత ఫ్యాక్టరీలలోను, గనులలోను, ఇతర ప్రమాద భరిత ఉత్పత్తి ప్రక్రియలలోను పనిచేయించరాదు.' అని ఉంది. కానీ సభ్య సమాజానికే తలవంపులు తెచ్చే విధంగా బాల కార్మిక వ్యవస్థ మన స్వతంత్ర భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉన్నదో మనందరికీ తెలుసు. బడికివెళ్లి చదువుకోవాల్సిన వయసులో ఎందరో బాలలు కార్మికులుగా మారుతున్నారు. ఈ బాల కార్మిక వ్యవస్థను రూపుమాపే సంకల్పంతో ఈ అధికరణం రూపొందించబడిందని భావించుకోవచ్చు. అయితే కేవలం కొన్ని విభాగాలలో మాత్రమే బాలలు పనిచేయరాదని ఈ అధికరణం శాసిస్తున్నది. అంటే మిగిలిన వ్యవస్థలో బాలలు పనిచేయవచ్చా? అందుకు ఈ అధికరణం అనుమతిస్తుందా? అన్న అనుమానం రావటం సహజమే. ఈ అధికరణం ఏ విధంగా ఉన్నప్పటికీ, ఏ రంగంలోనూ బాలకార్మిక వ్యవస్థ ఉండరాదని పలు శాసనాలు నిర్దేశిస్తున్నాయి.
బలమైన కేంద్రం తప్పదు కానీ..
బలహీనమైన కేంద్రంతో కేబినెట్ మిషన్ రూపొందించిన భారతదేశానికి మూడు అంచెల సమాఖ్య రాజకీయాల ప్రణాళికపై అంబేద్కర్ సంతోషంగా లేడు, కానీ బలమైన ఐక్య కేంద్రానికి అనుకూలంగా ఉన్నాడు. దేశ విభజన తర్వాత కేబినెట్ మిషన్ ప్రణాళిక దాని స్థానాన్ని కోల్పో యింది. మారిన పరిస్థితుల్లో భారత రాజ్యాంగ నిర్మాతలు బలమైన కేంద్రంతో సమాఖ్యను అంగీకరించారు. దానిని డ్రాఫ్టింగ్ కమిటీ ఆమోదించింది. ఐక్యత, దేశ నిర్మాణానికి ఇది అవసరమని అంబే ద్కర్ రాజ్యాంగ సభలో సమర్థించారు. నిజా నికి రాజ్యాంగంలోని ఆదర్శ సూత్రాల్లో ప్రాథమిక హక్కుల్లోనూ ఆయన బౌద్ధ సూత్రాలనే చేర్చారు. భావప్రకటనా స్వేచ్ఛకు, వ్యక్తి స్వేచ్ఛకు, విద్యా హక్కుకు, అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలకు, విద్యావ్యాప్తికి, కార్మిక వేతనాలకు, బలహీన వర్గాల అభివృద్ధికి, మత్తు పానీయాల నిషేధానికి, వ్యవసాయ పశుగణాభివృద్ధికి, పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణకు, పురాతన కట్టడముల పరిరక్షణకు, అంతర్జాతీయ శాంతి సంరక్షణకు, పేదలకు ఉచిత న్యాయ సహాయానికి, గ్రామ స్వపరిపాలనా, పంచాయితీలు రక్షణకు ఆయన రాజ్యాంగ నిబంధనల్లో ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సూత్రాలన్నీ మన దేశానికి రక్షణ కవచంగా వున్నాయి. ప్రాథమిక హక్కులకు భంగం కలిగే అనేక అంశాలు దేశంలో జరుగుతున్నాయి. నిరుద్యోగం, అవిద్య, అవినీతి, అరాచకం, స్త్రీలపై అత్యాచారాలు మిన్నంటుతున్న ఈ సమయాన రాజకీయ పార్టీలన్నీ కూడా రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడాల్సిన చారిత్రక సందర్భం ఇది.
ఎనిమిది గంటల పనికి సవాళ్లు..
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 8గంటల పని విధానాన్ని నిర్ణయించారు. వారానికి 40 గంటలు పనిదినాలుగా నిర్ధారించారు. ఇది చట్టబద్దమైన నిర్ణయం. రోజులో ఎనిమిది గంటలు పని, మరో ఎనిమిది గంటల విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించారు. అయితే ప్రస్తుతం పెట్టుబడిదారులు కార్పొరేట్ల అనుకూల నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టాలను మార్పు చేస్తోంది. రోజులో కనీసం 9గంటల నుంచి 12 గంటల వరకు పనిచేయాలని వారంలో 45గంటలు పనిచేయాలని నిర్ణయించారు. అందుకు అవసరమైన కార్మిక చట్టాలను సవరించారు. కులం, ప్రాంతం, మతం, వివక్ష దేశంలో చాలా ఎక్కువగా ఉంది. కులం, ప్రాంతం ఆధారంగా ఉండే కార్మికులు సమైక్యంగా ఉండరు. తరచుగా విభేదాలను ఎదుర్కొంటారు. భారత దేశంలో భిన్నమైన వర్గాలకు చెందిన కార్మిక ప్రజలలో ఇప్పటికీ మతం తదితర అంశాల ఆధారంగా వివక్ష పెరుగుతోంది. కులం, ప్రాంతం, మతం లాంటి వాటిని తొలగించడానికి ప్రభుత్వం ఇంతవరకు గణనీయమైన చర్యలను చేపట్టనేలేదు.
రాజ్యాంగ పరిరక్షణ అందరిదీ!
దేశంలోని సకల వర్గాల ప్రజలు భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలో ఈ దశాబ్ధం అంతా ఒక నిర్ణాయక శక్తితో పోరాడినప్పుడే ఈ రాజ్యాంగ భవన పరిరక్షణకు మనం బాధ్యులమవుతాం. ఏ సమాజానికైనా, ఏ దేశానికైనా వారి రాజ్యాంగమే వారికి జీవధాతువు. అది జీవన వ్యవస్థల పునర్జీవనానికి ఆర్థిక, సామాజిక, రాజకీయ, పరిపుష్టతకు చారిత్రక చోదక శక్తిగా వుంటుంది. నిర్మించుకున్న ప్రతి తాత్విక, సాంస్కృతిక, సామాజిక రాజకీయ సిద్ధాం తాన్ని రాజ్యాంగ నిర్మాణాన్ని అన్ని భౌతిక కట్టడాలకంటే కూడా గొప్పవిగా భావించి మనల్ని మనం పరిరక్షించుకునే ఉద్యమంలో పునరుత్తేజంతో పాల్గొందాం. స్వతంత్ర పోరాట కాలం వచ్చిన స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడంలోనే చరిత్ర దాగివుంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు.
(నేడు రాజ్యాంగ సంవిధాన్ దినోత్సవం సందర్భంగా)
- డాక్టర్ కత్తి పద్మారావు
98497 41695