ఫీజుల పెంపు ఇష్టారాజ్యమా?

by Ravi |   ( Updated:2023-05-31 23:30:09.0  )
ఫీజుల పెంపు ఇష్టారాజ్యమా?
X

రాష్ట్రంలో అధిక ఫీజులను కట్టడి చేస్తామని తొమ్మిది సంవత్సరాలు కమిటీలు వేస్తూ కాలాయాపన చేసి చివరికి ఆ కమిటీలు ఇచ్చిన సిఫార్సులను పక్కన పెట్టేశారు పాలకులు. దీంతో ఫీజులు మళ్లీ ఎంత పెంచుతారో అంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో 10వేల పైచిలుకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వీటిలో 32 లక్షల మంది చదువుతున్నారు. అయితే ఇందులో కొన్ని పాఠశాలలకు కనీసం పర్మిషన్ ఉండదు, కేవలం అద్దె భవనాలు చూపిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా అడ్మిషన్ల పేర డబ్బులు దండుకుంటున్నాయి ప్రైవేట్ యాజమాన్యాలు. అయితే ఆ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నా వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం.

వసతులు లేకున్నా!

ఈ విద్యాసంవత్సరం గత ఫీజు కంటే 𝟐𝟓 నుంచి 𝟓𝟎 శాతం వరకు ఫీజులు పెంచి వసూల్ చేస్తున్నాయి ప్రైవేట్ యాజమాన్యాలు. పైగా ఈ స్కూల్స్ బ్రాంచీల పేరుతో రాష్ట్రంలో నిర్మానుషంగా ఉండే ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని నారాయణ,శ్రీ చైతన్య, భాష్యం, సెయింట్ జోసెఫ్ పబ్లిక్, కృష్ణవేణి టాలెంట్, శాంతినికేతన్, నాగార్జున స్కూల్స్ వివిధ ప్రాంతాలలో బ్రాంచీల పేరుతో విద్యా వ్యాపారం సాగిస్తూ పుస్తకాలు, బూట్లు, టై, బెల్ట్ వరకు ఇష్టం వచ్చినట్లు రేటు పెట్టి అమ్ముతున్నారు. నిజానికి ప్రభుత్వ సూచనల మేరకు స్కూల్ పరిధిలో ఇవి అమ్మరాదు అని నిబంధన ఉన్న పట్టించుకోకుండా వీటిని అమ్ముతున్నారు. ఈ స్కూళ్ళకు పూర్తిస్థాయిలో భవనాలు ఉండవు, క్రీడా స్థలాలు ఉండవు, ఇరుకైన తరగతి గదులు, మౌలిక సదుపాయాలు ఉండవు, ఫైర్ సేఫ్టీ ఉండవు అయినప్పటికీ ఈ స్కూలుకు రెన్యువల్‌కు దరఖాస్తు పెట్టుకుంటే విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇస్తున్నారు.

నియంత్రణ చట్టం ఏమైంది?

రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై 𝟐𝟎𝟏𝟕 మార్చ్ నెలలో ప్రొ. తిరుపతిరావు నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ వివిధ రాష్ట్రాల్లోని స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి 𝟓𝟐 పేజీల నివేదికను అందించింది. అయితే ఆ కమిటీ ప్రతిఏటా దాదాపుగా 𝟏𝟎 శాతం ఫీజు పెంచుకోవచ్చనే ప్రతిపాదన చేసింది. కానీ ఫీజుల వివరాలు ప్రజలకు తెలిసేలా ప్రభుత్వ వెబ్ సైట్‌లో ఉండాలని సూచించింది. అలాగే స్కూల్ ఫీజుల పెంపును నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం చేయాలని నిర్ణయం తీసుకొని దీనికోసం విధివిధానాలు ఏర్పాటు చేసేందుకు ఉపసంఘాన్ని సైతం నియమించారు. దీనిని ప్రత్యేక చట్టం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. కానీ ఇప్పటివరకు ఆ ప్రయత్నం జరగలేదు. ప్రత్యేక చట్టం చేయాలని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్ నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం పెద్దలు నిమ్మకు నీరుతున్నట్టు వ్యవహరిస్తున్నారు.

నిజానికి ఏ విద్యా సంస్థనైనా ట్రస్ట్ పేరిట నడపాలి. దానికి ఒక గవర్నమెంట్ బాడీ ఏర్పాటు చేయాలి. అయితే కార్పొరేట్ పాఠశాలలో నామమాత్రంగా గవర్నమెంట్ బాడీని చూపిస్తున్నా, అధికారం మొత్తం యాజమాన్యం చేతుల్లో పెట్టుకుంటుంది. కొన్ని స్కూల్స్ ఒకేసారి మొత్తం ఫీజు కట్టాలని నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వడం లేదు. అందుకే వెంటనే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ ఉండేటట్టు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

సభావట్ కళ్యాణ్

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు

9014322572

Advertisement

Next Story