చెరువులకు.. గత వైభవం రానుందా?

by Ravi |   ( Updated:2024-09-21 01:00:23.0  )
చెరువులకు.. గత వైభవం రానుందా?
X

ఒకప్పుడు చెరువులు, కుంటలతో కళకళలాడే హైదరాబాద్ నగరంలో నేడు చిన్నపాటి వర్షానికే ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీల్లో, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. లోతట్టు ప్రాంతాలు వరదకు గురికాకుండా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి సమన్వయంతో సరైన ప్రణాళిక సిద్ధం చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నగరంలో ఆదాయంపైనే దృష్టి సారించి మౌలిక వసతుల పెట్టుబడులను పట్టించుకోకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడంలో ప్రభుత్వాలు విఫలమవడం ఒక కారణమైతే చెరువులను ఆక్రమించి, నాలాలను మూసేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం మరో ప్రధాన కారణం.

హైరాబాద్‌లో ఈ సమస్యకు ప్రధాన కారణం ఏమిటి? హైదరాబాద్ వరదలకు ప్రభుత్వాలు ఎందుకు శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నాయి? హైదరాబాద్ చరిత్ర తెలిస్తే తప్ప వీటన్నింటికీ సమాధానం తెలుసుకోవడం కష్టమవుతుంది.

వందలాది చెరువుల్లో మిగిలినవెన్ని?

16, 17 శతాబ్దాలలో కుతుబ్ షాహీ కాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వెయ్యికి పైగా చెరువులు, కుంటలు ఉండేవి. 1970 నుంచి చెరువులు ఒక్కొక్కటిగా ఆక్రమణలకు గురవుతూ కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌కు అనేక నీటి వనరులు ఉండేవి. కానీ వాటిలో 70 నుంచి 50 మాత్రమే నేడు మనుగడలో ఉన్నాయి. తీగల కుంట, సోమాజిగూడ ట్యాంక్, మీర్ జుమ్లా ట్యాంక్, పహార్ తీగల్ కుంట, కుంట భవానీ దాస్, నవాబ్ సాహెబ్ కుంట, అఫ్జల్‌సాగర్, నల్లకుంట, మాసబ్ ట్యాంక్ మొదలైనవి పూర్తిగా కనుమరుగవగా, మనుగడలో ఉన్న కొన్ని చెరువులు చిన్న చెరువులుగా, మురికి కాల్వలుగా కుంచించుకుపోయాయి.

అడుగంటిన భూగర్భ జలాలు..

హైదరాబాదీల దాహార్తిని తీర్చేందుకు హుస్సేన్‌సాగర్‌, ఉస్మాన్ సాగర్‌తో పాటు మరెన్నో చెరువులను నీటి వనరులుగా ఉపయోగించేవారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో నీటి సమస్య లేదు. ఎప్పటినుండైతే చెరువులు, కుంటలు అక్రమాలకు గురవుతున్నాయో అప్పటినుండి నగరంలో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడుతోంది. గత కొంతకాలం నుంచి ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్లతో వాటర్ తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరం లోపల, పరిసర ప్రాంతాలలో చెరువులు కుంటలు లేకపోవడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడం, వృధాగా మూసినదిలో కలవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.

హుస్సేన్‌సాగర్‌ మురుగు సరస్సు!

ఒకప్పుడు హుస్సేన్‌సాగర్‌ చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీనదికి అనుసంధానం చేశారు. నేడు నగరంలోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చే మురుగునీరు పరిశ్రమల నుండి వచ్చే కలుషిత వ్యర్థ జలాలు హుస్సేన్ సాగర్ సరస్సులోకి వచ్చి చేరుతుండడం వల్ల మురుగు వాసనతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువుల సంరక్షణ బాధ్యతను రాజకీయ నేతలు విస్మరించి వాటిని యథేచ్ఛగా ఆక్రమించుకుని కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. అందుకే హైదరాబాద్‌లో చినుకుపడగానే వరద ఎక్కువై కాలనీలు మునిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో నాళాలకు మరమ్మతులు చేయకుంటే భవిష్యత్తులో నగరానికి ప్రమాదం తప్పదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌లో వరదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన తెలంగాణ ప్రభుత్వం ఆక్రమణలు తొలగించి చెరువులను పరిరక్షించడమే పరిష్కారమని భావించింది. నగరంలోని చెరువులను పునరుద్ధరించేందుకు ‘హైడ్రా’ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) వ్యవస్థను తీసుకొచ్చారు.

కబ్జాకు గురైన చెరువులు..

నగరంలో చెరువులు చూద్దామన్నా కనిపించకపోవడం అంతేకాకుండా అవన్నీ ఇప్పుడు కాలనీలుగా మారడం అత్యంత ఆశ్చర్యం కలిగిస్తుంది. గ్రేటర్‌లో చెరువుల ఆక్ర మణ యథేచ్ఛగా సాగుతూనే ఉంది. అందుకు కార ణం గా నగరంలో చిన్న వర్షం కురిసినా వరద పోటెత్తుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్‌ తరాలకు భద్రత కల్పించే లక్ష్యంతో హైడ్రా‌ను ఏర్పాటు చేసి ఎంతటివారినైనా ఉపేక్షించకుండా అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది.

హైడ్రా కూల్చివేతలు..

హైడ్రా నగరంలోని పలు ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఆక్రమణలపై నోటీసులు జారీ చేసింది. హెచ్చరికలు చేసినా, నిర్మాణాలు చేస్తున్నా వాటిని కూల్చివేస్తోంది. హైడ్రా ఇప్పటివరకూ మొత్తం 111 ఎకరాల చెరువుల భూములను కాపాడినట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అత్యధికంగా అమీన్‌పూర్ లేక్ 51.78 ఎకరాలు, బుమ్రాక్ డౌలా 12 ఎకరాలు, సున్నం చెరువు 10 ఎకరాలు, గండిపేట్ లేక్ 8.75 ఎకరాలు, గండిపేట్ చిల్కూర్ 6.5 ఎకరాలతో పాటు మొత్తం 23 ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది. హైడ్రా ఇప్పటి వరకు మొత్తం 262 నిర్మాణాలు కూల్చివేయగా.. ఒక్క అమీన్‌పూర్ చెరువులోనే 51.78 ఎకరాల్లో 24 నిర్మాణాలను కూల్చివేసింది. సున్నం చెరువులో 42 నిర్మాణాలు కూల్చివేయగా.. కత్వా చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో 2.5 ఎకరాలు రికవరీ అయింది. కత్వా చెరువులో 13 విల్లాలు కూల్చివేసింది. గండిపేట్ చెరువులో చిలుకూరు వద్ద మరో 6.5 ఎకరాలు, తుమ్మిడికుంట చెరువులో 4.9 ఎకరాలు రికవరీ చేసినట్లు హైడ్రా వెల్లడించింది.

కోట దామోదర్

93914 80475

Advertisement

Next Story