- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
24 ఫ్రేమ్స్: సినిమా వినోదం అంపశయ్యపై చేరిందా?
మొత్తం మీద ఇవ్వాళ ప్రజలలో స్పూర్తిని పెంపొందించే సినిమాల కంటే, ఆకాంక్షలనూ, అందులోనూ భూటకపు ఆకాంక్షలను పెంచే సినిమాలకు అధికంగా ఆదరణ లభిస్తున్నది. అది సమాజానికి అంత అభిలషణీయం కాదు. లాభాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే వ్యాపార సినిమా రంగం పెట్టుబడి, లాభాల ప్రాతిపదికగా పని చేస్తుంది. అందుకే వందలాది కోట్ల పెట్టుబడితో మరిన్ని సినిమాలు రూపొందే అవకాశాలు మెండుగా వున్నాయి. వాటిలో ఎన్ని 'పుష్ప'లు అవుతాయో, మరెన్ని 'ఆచార్య'లు అవుతాయో చూడాలి. మొత్తం మీద మన ప్రేక్షకులకు అతి చౌక వినోదాన్ని క్రమంగా అతి ఖరీదైన వినోదంగా మార్చే పనిలో సినిమా రంగం తలమునకలై వుంది. చూద్దాం, ఇంకా ఏమి జరుగనుందో? భవిష్యత్తులో సినిమా వారు గెలుస్తారా? ప్రేక్షకులు నెగ్గుతారా!?
థియేటర్‌కు వెళ్లి టిక్కెట్ కొనుక్కుని సినిమా చూడడంలో వున్న ఆనందమే వేరు. దయచేసి థియేటర్‌కు వెళ్లండి. మా బొమ్మలను చూడండి. ఇప్పుడు ఎవరూ సినిమా THEATREకు వెళ్లేందుకు సిద్ధంగా వుండడం లేదు. చేతులు జోడించి వేడుకుంటున్నారు. దయచేసి మా సినిమాని థియేటర్‌కు వెళ్లి చూడండి' అంటూ సుప్రసిద్ధ నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆయన తన పాపులర్ క్విజ్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కొత్త ఎపిసోడ్‌లో తన కొత్త సినిమా 'unchai' ప్రమోషన్ షో నిర్వహించారు. సహనటులు అనుపమ్ ఖేర్, నీనా గుప్తా, బొమ్మన్ ఇరానీని షోకు అతిథులుగా పిలిచారు. ఆ కార్యక్రమంలోనే అమితాబ్ ప్రేక్షకులను ఇలా కోరుకున్నారు.
అమితాబ్ లాంటి పాపులర్ సీనియర్ నటుడు ఈ మేరకు విన్నవించే పరిస్థితి వచ్చిందంటే, ఇవ్వాళ ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడం దాదాపుగా మానేసినట్టు కనిపిస్తున్నది. వారిని టాకీసుల దాకా రప్పించడం ఎంత గగనంగా మారిందో తేటతెల్లం అవుతున్నది. ఇన్నేళ్లుగా భారతీయ ప్రజలకు చౌకగా అందుబాటులో వున్న సినిమా వినోదం 'అంపశయ్య'పై చేరిందా? అనిపిస్తున్నది. ఏదో ఒక సినిమా ఆర్థికంగా విజయవంతమైతే పది సినిమాలు పరాజయం పాలవుతున్న వర్తమాన స్థితిలో హిందీ సహా దాదాపు అన్ని భారతీయ భాషా సినిమా రంగాలూ కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. 'పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాల తాకిడితో హిందీ సినిమా చచ్చిపోతోంది' అన్న వాదన కూడా ముంబైలో విస్తృతంగా వినిపిస్తున్నది. ఆ వాదన కొంత అతిగా ఉన్నప్పటికీ, వాస్తవంగా హిందీ సినిమా దాదాపు సంక్షోభంలో ఉందన్నది మాత్రం నిజం. దాదాపు మిగతా భాషా సినిమాలది కూడా అదే పరిస్థితి.
ఇందుకు కారణాలేమిటి?
ఈ స్థితికి కారణాలను అన్వేషిస్తే రెండు అంశాలు మన ముందుకు వస్తున్నాయి. ఒకటి ఉప్పెనలా దాడి చేస్తున్న సాంకేతిక ఆవిష్కరణలు కాగా, రెండవది ఊక దంపుడు కథలతో, రొడ్డ కొట్టుడు కథలతో సినిమా రంగం చేసుకుంటున్న స్వయంకృతాపరాధం. మొదట సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకుంటే అసలు సినిమా ఆవిష్కరణే గొప్ప సాంకేతిక పరిణామం. తెరమీద బొమ్మలు కదలడమే ఆనాటి అద్భుతం. మూకీ నుంచి టాకీ, 16 ఎంఎం నుంచి ఇప్పటి డిజిటల్ కాలం దాకా సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులే నేటి సినిమా రూపానికి మూలాధారం. అప్పటిదాకా వీధి భాగోతాలూ, నాటకాలూ, బుర్రకథలు, హరికథలు మాత్రమే వినోదాంశాలుగా వున్న ప్రజలకు సినిమా కొత్త వినోదంగా ముందుకొచ్చింది. ఇది తొలి రోజులలో కొంత సామాజిక ఉపయోగానికి, మంచి విలువలతో కూడిన కథలకు పరిమితమై ప్రజలను అలరించింది. సమాజంలో వచ్చిన మార్పులు, సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలు సినిమా రూపాలను పూర్తిగా మార్చేశాయి. సినిమా ప్రేక్షకుల మీద మొట్టమొదటి సాంకేతిక ప్రభావం టీవీలతో వచ్చింది. టీవీ వచ్చిన మొదటి రోజులలో సాయంత్రాలు, ఆదివారాలు ప్రజలు ఇండ్లలోంచి బయటకు రావడమే మానేశారు.
రామాయణాలు, భారతాలు, సీరియళ్లు, టీవీలలో ప్రసారమయ్యే సినిమాల ప్రభావంతో 70-80లలో సినిమాలు చూడ్డానికి ప్రేక్షకులు కరువయ్యారు. తర్వాత 'వీడియో' మరింత ప్రభావాన్ని చూపించింది. వీడియో పార్లర్స్ సినిమాలను దెబ్బ తీసాయి. టీవీ కార్యక్రమాలు రొటీన్ కావడం, వీడియోలు అంతగా ఆకట్టుకోకపోవడం, థియేటర్‌లో చూసిన అనుభూతి పూర్తిగా కలగకపోవడంతో ప్రేక్షకులు తిరిగి టాకీసులకు మరలారు. సినిమాలు కూడా CRIME, SEX లాంటి ఎమోషన్స్ ని ప్రేరేపించే కథలతో ప్రజల ముందుకు వచ్చి ఆకర్షించే ప్రయత్నాలు చేసాయి. ఇప్పటి పరిస్థితి వేరు. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు ఇండ్లలోంచి బయటకు రాకపోవడం, సరిగా అప్పుడే OTTలు రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విపరీతంగా పెరిగిన సెల్ వినియోగం కూడా ప్రభావాన్ని చూపిస్తున్నది. అరచేతిలోనూ, ఇంటిలోనూ సినిమాలను చూసే లుక్ కల్చర్ పెరిగిన తర్వాత ప్రత్యేకంగా సినిమా హాళ్లకు వెళ్లి వందలాది రూపాయలు ఖర్చు చేసేందుకు జనం ప్రస్తుతానికి సిద్ధంగా లేరు.
Also read: 24 ఫ్రేమ్స్ :మంచి ప్రేక్షకులు ఎట్లా రూపొందుతారు?
ఓటీటీలదే హవా
ఒక సర్వే ప్రకారం ఓటీటీలలో DISNEY+HOTSTAR కు నాలుగు కోట్ల మంది చందాదారులు వున్నారు. AMAZON PRIME కు రెండున్నర కోట్లు. ZEE-5కు 60 లక్షలు, NETFLIXకు 60 లక్షలు, SONYLIV కు 40 లక్షలు, వూట్‌కు 30 లక్షల మంది చందాదారులు ఉన్నారు. అలా దేశం మొత్తంగా పది కోట్లకు పైగా ఓటీటీ చందాదారులున్నారు. సగటున ఓటీటీలలో స్ట్రీమింగ్ చూసే సమయం మాత్రం వారానికి 10 నుంచి 13 గంటలు మాత్రమే. ఓటీటీలలో వారానికి సగటున 2-3 సినిమాలు చూసేవారి సంఖ్యే హెచ్చుగా వుంది. గత రెండు సంవత్సరాలుగా ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య క్రమంగా పెరగడం గమనించవచ్చు. అదే క్రమంలో THEATRE వెళ్లి సినిమాలు చూసేవారి సంఖ్యా తగ్గుతూ వస్తున్నది. అంటే, మన దేశంలో టాకీసులో వినోదం ప్రమాదంలో పడినట్టే. ఇక రెండో కారణం గురించి ఆలోచిస్తే మన దేశంలో థియేటర్‌కు వెళ్లి సినిమా చూసేవారు మూడు నుంచి నాలుగు కోట్ల మంది వుంటారు. ఆ సంఖ్య సినిమా హాళ్లలోని 80 శాతం సీట్లకు మాత్రమే సమానం. ఇక సాధారణ ప్రేక్షకుడు సంవత్సరానికి ఐదారు సినిమాలను మాత్రం చూస్తాడు.
పెద్ద స్టార్లు, విపరీతమైన ముందస్తు ప్రచారం వున్న సినిమాలకు మాత్రమే జనం తండోపతండాలుగా వచ్చే అవకాశం వుంది. మిగతావాటికి జనం రావడం గగనమే అయిపోతున్నది. అందుకే గతంలో లాగా టాకీసుల ముందు 'HOUSE FULL' బోర్డులు కనిపించడం లేదు. మల్టీప్లెక్సులు, విపరీతంగా పెరిగిన టిక్కెట్ రేట్లు కూడా మరో ప్రధాన కారణం. కథ, భిన్నంగానూ హైఫైగానూ వుండి ప్రేక్షకులను ఊహా లోకాలకు తీసుకెళ్లే సినిమాలకు కొంత ఆదరణ దొరికే అవకాశం వుంది. అవి కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అబ్బురపరిచే దృశ్యాలతో కూడి వుండాలి. ఇటీవలి కాలంలో PAN INDIA MOVIES పేరున వచ్చిన పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌లు అలాంటివే. 'కాశ్మీర్ ఫైల్స్' లాంటి భావోద్వేగాలను ప్రేరేపించే సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రాజకీయంగా పాలకులు ప్రమోట్ చేయడం ఆ సినిమా ఆదరణ పొందడానికి మరో ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు.
Also read: 24 ఫ్రేమ్స్:ఓటీటీ సినిమాను మింగుతుందా?
అంతా లాభాల కోసమే
మొత్తం మీద ఇవ్వాళ ప్రజలలో స్పూర్తిని పెంపొందించే సినిమాల కంటే, ఆకాంక్షలనూ, అందులోనూ భూటకపు ఆకాంక్షలను పెంచే సినిమాలకు అధికంగా ఆదరణ లభిస్తున్నది. అది సమాజానికి అంత అభిలషణీయం కాదు. లాభాలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే వ్యాపార సినిమా రంగం పెట్టుబడి, లాభాల ప్రాతిపదికగా పని చేస్తుంది. అందుకే వందలాది కోట్ల పెట్టుబడితో మరిన్ని సినిమాలు రూపొందే అవకాశాలు మెండుగా వున్నాయి. వాటిలో ఎన్ని 'పుష్ప'లు అవుతాయో, మరెన్ని 'ఆచార్య'లు అవుతాయో చూడాలి. మొత్తం మీద మన ప్రేక్షకులకు అతి చౌక వినోదాన్ని క్రమంగా అతి ఖరీదైన వినోదంగా మార్చే పనిలో సినిమా రంగం తలమునకలై వుంది. చూద్దాం, ఇంకా ఏమి జరుగనుందో? భవిష్యత్తులో సినిమా వారు గెలుస్తారా? ప్రేక్షకులు నెగ్గుతారా!?
వారాల ఆనంద్
94405 01281