- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
24 ఫ్రేమ్స్ :మంచి ప్రేక్షకులు ఎట్లా రూపొందుతారు?
ఎన్నో మంచి సినిమాలు ఆన్ లైన్‌లో అందుబాటులో వున్నాయి. సినిమా ప్రదర్శన తర్వాత వీక్షించండి- సమీక్షించండి' (VIEW AND REVIEW) అని ఓ వ్యాసరచన లేదా ఉపన్యాస పోటీ పెట్టామనుకోండి సినిమా మంచి చెడుల సమీక్ష, భావవ్యక్తీకరణ శక్తి పెరుగుతాయి. అర్థ వంత సినిమాలు చూడడంతో విద్యార్థులకు నిరర్ధక సినిమాలేవో తెలిసి పోతాయి. సినిమాలకు సంబంధించి అనేక విషయాలనూ అందించవచ్చు. కాలేజీ విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ సినిమాలు అనేకం వున్నాయి. ఫిలిం మేకింగ్ శిక్షణ కూడా ఇవ్వొచ్చు. దీంతో ఉత్తమ ప్రేక్షకులుగా తయారయే దిశలో మొదటి అడుగు పడినట్టే. తొలి అడుగు బలంగా పడితే ఇక ముందుకు పరుగు తీయడం సులభమే.
స్నేహాలు పదహారేళ్లలోపే చేయాలి. ఆ స్నేహితులే ఎప్పటికీ హితులై, సన్నిహితులై, స్వార్థ రహితులై వుంటారు. సదా ప్రేమ, అభిమానం కలిగి వుంటారు. టీనేజి దాటింతర్వాత ఏర్పడే స్నేహాలలో అత్యధిక శాతం స్వార్థంతో అవసరార్థం ఏర్పడతాయి. 'ఇవ్వడం పుచ్చుకోవడం, నాకేమిటి నీకేమిటి' అంటాయి. అంటే ఒక రకంగా బాల్యంలో చేసే స్నేహాలే మంచిగానూ, స్వచ్చంగానూ ఉంటాయన్నమాట. ఆ కాలంలోనే మనలో కలిగే సాన్నిహిత్యాలూ అంత గొప్పగా వుంటాయి. చిన్నప్పుడే మనం, మన మనసులు తెల్ల కాగితంలాగా, చాక్‌పీసు అంటని పలకలా వుంటాయి. వాటి మీద ఏ ముద్ర వేస్తే ఆ ఛాయలే జీవితాంతం వుంటాయి.
సరిగ్గా స్నేహాలలానే మానవీయ విలువలు, కళలూ కూడా. చిన్నప్పుడే సాహిత్యమూ సంగీతమూ, చిత్రలేఖనం లాంటి వాటిని పిల్లలకు సరైన రీతిలో సరిగ్గా అందిస్తే భవిష్యత్తులో వాళ్లు మంచి మనుషులుగా ఎదుగుతారు. సందేహం లేదు అత్యంత ప్రభావవంత సినిమా విషయమూ అంతే. మంచి సినిమా అంటే ఏమిటి, ఏది మంచి సినిమా, ఎందుకు మంచి సినిమా అన్నవేవీ పిల్లలకు, యువకులకు చెప్పకుండా వీళ్లంతా పాడైపోతున్నారు. మంచి సినిమాలను చూడడం లేదు. చెడ్డ సినిమాల ప్రభావం వల్లనే మొత్తం సమాజంలో ఆత్మీయతలు అభిమానాలు కరిగిపోతున్నాయి, అంతా కాలక్షేపం వ్యాపారం అయిపొయిందని పెద్దలంతా ఇవ్వాళ మాట్లాడుతూ వుంటారు. నిజానికి పిల్లలు మంచి ప్రేక్షకులుగానూ, మంచి యువకులుగానూ ఎదగక పోవడానికి కారణాలు ఏమిటని పెద్దలు ఆలోచిస్తున్నారా? చెడిపోతున్నారు అనడం, వాదించడం, వేదనపడడం తప్ప. మంచి ఏదో, చెడు ఏదో చెప్పకుండానే మంచి ప్రేక్షకులు ఎట్లా తయారవుతారు? దానికి బాధ్యత ఖచ్చితంగా పెద్దలదీ ఈ సమాజానిదే.
వీటి గురించి ఆలోచించండి
పిల్లలకు విద్యతో పాటు వినోదమూ అవసరం. విద్యతో పాటు ఆటవిడుపూ కావాలి. గతంలో లాగా మరివ్వాళ గోటీలాట లేదు, బొంగరాలు లేవు, ఎగిరే గాలిపటాలు లేవు, చార్ పత్తా లేదు, చిర్రగోనె లేదు, పచ్చీసు లేదు, పున్జీతం లేదు. చివరికి కబడ్డీ, ఖోఖో చెస్ కూడా ఎక్కడో స్టేడియంలోనో, అకాడెమీలలోనో కనిపిస్తాయి. మరి, అలాంటప్పుడు పిల్లలకు ఆటవిడుపు ఏది? ఎక్కడుంది? ఇవ్వాళ వాళ్లకు వినోదమంటే కేవలం చేతిలో వున్న స్మార్ట్ ఫోన్ మాత్రమే. వాటిలో చూసే వీడియోలు, ఆడే గేమ్స్, లేదా మల్టీప్లెక్స్ సినిమాలు అంతే. ఫలితంగా వాళ్లలో సామూహిక వినోదం కనుమరుగైపోతోంది.
స్మార్ట్ ఫోన్స్ వాళ్లని ఒంటిగాళ్లను చేస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లూ, అక్కడి క్యాంటీన్లూ వాళ్లని ఎలైట్ చేస్తున్నాయి. ఇక మంచి చెడుల విచక్షణకు అవకాశం ఎక్కడ? ఇండ్లల్లో పిల్లలు పెద్దలు కనీసం తల్లి దండ్రులు కలిసి కూర్చుని ముచ్చట్లు పెట్టె స్థితి ఉందా? అంతా ఎవరికీ వారు తమ తమ సెల్ ఫోన్లలో బిజీ. చుట్టాలూ పక్కాలూ స్నేహితులూ రావడం పోవడం అరుదు. కరోనాతో మరింత మారిపోయింది. దాంతో పిల్లలు పెద్దలు అంతా ఒంటరితనంలోనే . ఇక వారాంతాలలో పిక్నిక్‌లకూ, చారిత్రిక ప్రదేశాలను దర్శించడం కంటే, రెస్టారెంట్లకు వెళ్లడం పట్లనే ఎక్కువ మక్కువైంది. ఈ నేపథ్యంలో మంచి మనుషులు, మంచి ప్రేక్షకులు, మంచి శ్రోతలు ఎట్లా రూపొందుతారు?
అంతా యాంత్రికమే
మరో విషయం 90ల తర్వాత ఒక వైపు ప్రపంచీకరణ, ఇంకోవైపు టెక్నాలజీ చదువులు విద్యార్థులను ఒక చిత్రమైన పోటీ ప్రపంచంలోకి నేట్టేసాయి. తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే విజ్ఞాన్, వికాస్, నారాయణ, చైతన్య, రామయ్య ఐఐటీ లాంటి సంస్థలు వచ్చి విద్యనూ వ్యాపారమే కాదు పోటీ కేంద్రాలుగా EDUCATION GYMS గా మార్చేశాయి. కేవలం లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవడమే జీవితానికి పరమావధిని చేసేసాయి. తెలుగు స్కోరింగ్ కాదని సంస్కృతాన్ని తెచ్చారు. అక్కడితో ఆగలేదు ఇంగ్లిష్, సంస్కృతం ఏడాది చివర ఒక నెల బట్టీ పట్టి చదివి 100 శాతం మార్కులు సాధించే సౌలభ్యాన్ని కనిపెట్టారు. దాంతో విద్యార్థులకు భాషా సాహిత్యాలతో సంబంధమే లేకుండా పోయింది.
సైన్స్, టెక్నాలజీ చదువవద్దని నేను అనడం లేదు.. పోటీలో నిలబడాల్సిందే కానీ గత ఇరవై ఏళ్లలో మూలాలను విడిచి ఎదిగిన తరం ఎంతగా యాంత్రిక జీవులై పోయారో చూస్తూనే వున్నాం. 'యంత్రాలలో తడిని ఆర్ద్రతను ఆశించడం అత్యాశే' కదా. ఈ స్థితికి కేవలం పిల్లలను బాధ్యులను చేయడం అన్యాయం. ఇప్పటికైనా పిల్లలు మంచి పాఠకులు,శ్రోతలు, ప్రేక్షకులు, మొత్తంగా మంచి మనుషులుగా ఎదగడానికి పెద్దలూ, సమాజం, పాలకులు ఆలోచించాల్సి వుంది. ప్రణాళికతో కృషి చేయాల్సి వుంది. మంచి పాఠకులు, శ్రోతలు, ప్రేక్షకులు తయారవడానికి స్కూలు స్థాయి నుంచే వారి ప్రధాన స్రవంతి విద్యకు భంగం కలగాకుండానే అనేక పనులు చేయొచ్చు.
ఇలా చేస్తే మేలు
నేనిక్కడ మంచి ప్రేక్షకులు తయారవడానికి తయారుచేయడానికి నావి కొన్ని ఆలోచనలు అనుభవాలు పంచుకుంటాను. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం వసతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని స్కూళ్ళు కాలేజీల్లో విజువల్ సంస్కృతి పెరిగిపోయింది. టీవీ, ఇంటర్నెట్, వీడియో ప్రొజెక్షన్‌తో పాటు అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయి. ఆ స్థితిని అవకాశంగా తీసుకుని విద్యాసంస్థలలో ఫిలిం క్లబ్స్ పెట్టాలి. నెలకు కనీసం ఒకటి లేదా రెండు మంచి సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించాలి. ఎన్నో మంచి సినిమాలు ఆన్ లైన్‌లో అందుబాటులో వున్నాయి.
సినిమా ప్రదర్శన తర్వాత వీక్షించండి- సమీక్షించండి' (VIEW AND REVIEW) అని ఓ వ్యాసరచన లేదా ఉపన్యాస పోటీ పెట్టామనుకోండి సినిమా మంచి చెడుల సమీక్ష, భావవ్యక్తీకరణ శక్తి పెరుగుతాయి. అర్థ వంత సినిమాలు చూడడంతో విద్యార్థులకు నిరర్ధక సినిమాలేవో తెలిసి పోతాయి. సినిమాలకు సంబంధించి అనేక విషయాలనూ అందించవచ్చు. కాలేజీ విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ సినిమాలు అనేకం వున్నాయి. ఫిలిం మేకింగ్ శిక్షణ కూడా ఇవ్వొచ్చు. దీంతో ఉత్తమ ప్రేక్షకులుగా తయారయే దిశలో మొదటి అడుగు పడినట్టే. తొలి అడుగు బలంగా పడితే ఇక ముందుకు పరుగు తీయడం సులభమే.
వారాల ఆనంద్
94405 01281