రాయి ఓట్లు రాలుస్తుందా?

by Ravi |   ( Updated:2024-04-19 00:30:56.0  )
రాయి ఓట్లు రాలుస్తుందా?
X

నిశ్చలమైన సరస్సులో రాయి విసిరితే ఎలా ప్రకంపనలు వస్తాయో ఇప్పుడు రాజకీయ నాయకులపై రాయి దాడి రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. “ఫలించిన వృక్షానికే రాతి దెబ్బలు” అన్న సామెతను అధికార పక్షం ఇప్పడు ఎన్నికల ఆయుధంగా వాడుకొంటోంది.

ఏ అకతాయి పనో ఏ గడుగ్గాయి ఘనకార్యమో. వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగింది. ఇందులో కుట్ర కోణం ఉందా? బెంగాల్ తరహాలో ఎన్నికలకు ముందు ప్రజల నుంచి సానుభూతి కోసం చేస్తున్నారా? అనే విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. వైసీపీ అధినేతకు ఐ ప్యాక్ టీం ఇచ్చిన సలహా మేరకు దాడి జరిగిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండగా, చంద్రబాబు కుట్ర చేశాడంటూ మంత్రులు, సలహాదారులు విరుచుకుపడుతున్నారు. అసలు సీఎం జగన్‌‌పై రాయి దాడి వెనుక ఏం జరిగి ఉండవచ్చు?

వ్యూహకర్తల పన్నాగమా!

2019 ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా, ఇప్పుడు రాయి దాడి ఎన్నికల వ్యూహకర్త పన్నాగమా సానుభూతి కోసం సంచలనం కోసం రాజకీయ పార్టీలకు ఇలాంటి వ్యూహాలను రచించేది ఎన్నికల్లో లాభం పొందడానికి వ్యూహకర్తలు ఇలాంటి వాటిని మంత్ర తంత్రాలుగా వాడుకుంటున్నారా అన్నది సామాన్యుని మదిలో మెదిలే సందేహం.గతంలో కోడికత్తితో డ్రామాలాడారని, ఇప్పుడు ఎవడో గులకరాయి వేస్తే ఆది ప్రతిపక్షం కుట్ర అని ఆధికార పక్ష రాద్దాంతం చేస్తోందని ప్రతిపక్షం చేస్తోన్న వాదన. అయితే, ఆ తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి ర్యాలీలో ఆకతాయి రాయి విసరడం కలకలం రేపింది. అయితే, అది ఆయనకు తగలకుండా పక్కకు పోయింది.

సంయమనంతో మెలగాలి

ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్షాలు విమర్శలు చేసుకోవడం పరిపాటి కానీ నేడు ఎన్నికల్లో ఏదో ఆశించి వ్యక్తులపై భౌతిక దాడులు చేయటం సమర్థనీయం కాదు. ఇది కక్షాపూరితమైన రాజకీయాలకు ఆజ్యం పోస్తుంది కాబట్టి దీనిపై రాజకీయ పార్టీలు రచ్చ చేయకుండా వారి కార్యకర్తలను సంయమనంతో మెలగాలి అని సూచించాలి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలకు దూరంగా వుండి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఎన్నికల ప్రచారంలో కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిది. అద్దాల మేడలో ఉండి రాయి విసిరితే అది వారికే ప్రమాదం అని ఆందరూ గుర్తించాలి. ఏ పాపం చేయ్యని వాడు మొదట రాయి విసరండి అన్న బైబిల్ సూక్తిని సృరణలో వుంచుకుంటే ఇటువంటి దాడులు దారుణాలు జరగవు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు.

వి. సుధాకర్

99898 55445

Advertisement

Next Story