రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగేనా?

by Ravi |   ( Updated:2023-02-21 19:00:12.0  )
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగేనా?
X

ష్యా-ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం రెండవ సంవత్సరంలోకి ప్రవేశించింది. రష్యా ఈ యుద్ధాన్ని కేవలం మిలటరీ ఆపరేషన్ అని వర్ణిస్తున్నప్పటికీ అది యుద్ధమేనని ప్రపంచ దేశాలన్ని భావిస్తున్నాయి.

అయితే 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి. యుద్ధం కారణంగా ఆహార ధాన్యాలు ఎరువులు, ఇంధన సరఫరాలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సంక్షోభం నుంచి చాలా దేశాలు ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యాలపై ఆధారపడిన దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. తీవ్రమైన చలి కారణంగా యుద్ధం కొద్దిగా మందగించడంతో ప్రపంచ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాయి.

యుద్ధాన్ని తీవ్రతరం చేసే యోచనలో..

రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం ఆగాలని అమెరికా, భారత్ సహా పలు దేశాలు కోరుతున్నాయి. అయితే శాంతి కోసం రష్యా నుండి ఎలాంటి సంకేతం రావడం లేదు. తొలుత యుద్ధ ప్రారంభంలో రష్యా ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించాలని ప్రయత్నించినా ఉక్రెయిన్ పోరాట పటిమతో రష్యాను నిలవరించి తన భూభాగంపై ఆధిపత్యాన్ని నిలుపుకుంది. అయితే ప్రస్తుతం ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని రష్యా ప్రయత్నాలు చేస్తోంది. రాకెట్స్, మిసైళ్ళతో బాంబుల వర్షం కురిపిస్తోంది. అయినా ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు. దానికి కారణం ఉక్రెయిన్‌కు అమెరికాతో పాటు నాటో దేశాల నుంచి ఆయుధాలు, ఇతర మిలిటరీ సహాయం రావడమే. దీంతో ఉక్రెయిన్ రష్యాకు సరెండర్ కావడం లేదు. అంతేకాకుండా తమ దేశ స్వతంత్రత, స్వేచ్ఛ తమకు ముఖ్యమని అందుకే తమకు మిలటరీ సహాయం అందించాలని ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా, యూకే దేశాలను అభ్యర్థించారు.

అయితే ఈ విషయంలో భారత్, చైనాలు తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులను సరఫరా చేసే విషయంలో నాటో దేశాలు కొంత తటాపటాయిస్తున్నట్టు తెలుస్తుంది. సరైన మిలిటరీ ఆయుధాలు లేకుండా రష్యాను నిలవరించడం సాధ్యం కాదని అందుకే ఆయుధాలు పంపాలని జెలెన్‌స్కీ అభిప్రాయం. మరోవైపు రష్యా ఉక్రెయిన్ నగరాలపై దాడులు ముమ్మరం చేస్తుంది. ఉక్రెయిన్ వ్యూహాత్మక ప్రాంతాలపై రష్యా దాడులు చేస్తుంది. దీనికోసం అవసరమైతే యుద్ధాన్ని ఇంకా తీవ్రం చేసే యోచనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉన్నారు.

శరణార్థులుగా ప్రజలు

ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి వేలాది మంది తమను అనుమతించిన దేశాలకు శరణార్థులుగా వెళ్ళిపోతున్నారు. వీరికి సహాయం చేయడానికి ఐరాస శరణార్థుల విభాగం యూఎన్‌హెచ్‌సీఆర్(ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్) సిద్ధమైంది. ఇప్పటికే ఉక్రెయిన్ నుండి 10 దేశాలకు మిలియన్ల కొద్ది మంది సమీప దేశాలకు పారిపోయారని వీరికి సహాయంగా దాదాపు 5 బిలియన్ డాలర్లు అవసరమని ప్రతిపాదించింది. ఈ సొమ్ము ద్వారా దాదాపు 11 మిలియన్ల ప్రజలను ఐరాస, ఇతర సహాయ ఏజెన్సీలు ఉక్రెయిన్ ప్రజలను ఆదుకుంటున్నాయి. మరోవైపు నార్వే దేశం 7 మిలియన్ డాలర్ల సహాయాన్ని ఉక్రెయిన్‌కు ప్రకటించింది. మరోవైపు తన ఆయుధాలకు పుతిన్ పదును పెడుతున్నాడు. దాదాపు 5 లక్షల మంది మిలటరీ సిబ్బందిని తయారు చేసుకుంటున్నారు. అందుకే ఏ రకంగా చూసిన యుద్ధం ఇప్పుడు ఆగేలా కనిపించడం లేదు.

శ్రీ నర్సన్

83280 96188

Advertisement

Next Story