- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా తీర్పును వంచిస్తారా?
‘వ్యతిరేకత, ప్రశ్నించడం, నిరసన... ఇవేవీ సహించం’... అంటే, ఏ రూపంలోనూ ప్రతిపక్షమన్నదే ఉండొద్దు! ప్రస్తుతం ఈ ధోరణి పాలకపక్ష రాజకీయాల్లో పెరిగింది. ఆందోళనకర స్థాయికి చేరుకుంటోంది. ‘శత్రు శేషము, రుణ శేషము మిగుల్చుకోకూడద’న్నది పాత సామెత అయితే, ప్రతిపక్ష శేషం మిగులరాదన్నంత దుర్మార్గంగా అధికారపక్షాలు పెట్రేగుతున్న తీరిపుడు జుగుప్సాకరం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్... మొత్తంగా భారత రాజకీయాల్లోనే ఇది ముదిరి పాకానపడుతోంది. ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదం తెచ్చిపెడుతోంది. అటువైపు ఒక రీతి, ఇటువైపు వస్తే మరో నీతి... సరికాని ఈ ద్వంద్వ నీతికి రాజకీయ పక్షాలు మొగ్గుతున్నాయి. ప్రజాస్వామ్య వాదులు, మేధావులు... చివరకు ఓటర్లుగా సామాన్యులు కూడా మనసుపెట్టి చర్చ చేయవలసిన, పరిష్కారం వెతకవలసిన కీలకాంశమిది.
ప్రజాతీర్పు తర్వాత పార్టీలు అధికారంలోకి రావటం, ప్రతిపక్షంలో సరిపెట్టుకోవడం అనే స్థితితో నిమిత్తం లేకుండా... రాజకీయాల్లో ఇదివరకు కొన్ని మౌలిక విలువలుండేవి. పరస్పర మర్యాదలుండేవి. ఇప్పుడవన్నీ నశిస్తున్నాయి. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తెలుగువాడైన విపక్షనేత పుచ్చలపల్లి సుందరయ్య సీటు వరకు వచ్చి పార్లమెంటు వేదికగా గౌరవించిన సందర్భాలున్నాయి. ‘చర్చిల్, చాంబర్లెయిన్ ఇద్దరూ నీలో ఉన్నారు, ఏమిటీ ద్వైదీ భావం’ అని యువ ఎంపీ అటల్‌బిహారీ వాజ్‌పేయ్ సభలో నిశితంగా విమర్శిస్తే ముఖం కళతప్పిన నెహ్రూ... అదే సాయంత్రం మరేదో సమావేశంలో ఎదురుపడ్డప్పుడు మాత్రం, దగ్గరికి వచ్చి ‘చాలా బాగా ప్రసంగించావ్, రాణిస్తావ్’ అని అభినందించినట్టు వాజ్‌పేయ్ స్వయంగా పార్లమెంటులో చెప్పారు. అవన్నీ కట్టుతప్పి, ఏం చేసైనా ప్రతిపక్షాల్ని సమూలంగా నిర్మూలించాలనే పాలకపక్ష పెడపోకడలు పెచ్చుమీరుతున్నాయి. ఎన్నికైన కొందరికేమో ప్రతిపక్షంలో ఉండటం నచ్చట్లేదు. జనాభిప్రాయంతో పని లేకుండా, నిస్సిగ్గుగా పాలకపక్షం వైపు పరుగులు తీసే తీరు రోత పుట్టిస్తోంది. దాన్ని ప్రోత్సహించడమే కాక.... విపక్ష నిర్మూలనకు ఎంత ప్రజాధనాన్నయినా వెచ్చించి అధికారపక్షాలు కుత్సిత రాజకీయాలు నడుపుతున్నాయి. పాలకపక్షం లాగే ప్రతిపక్షం కూడా ప్రజానిర్ణయ ఫలితమే! దాన్ని లేకుండా చేయడమంటే ప్రజాతీర్పును వంచించడమే! సర్కార్ల నిర్ణయాలపైన, ఏకపక్ష విధానాలపైన సమీక్షే లేని దుస్థితిని ఆహ్వానిస్తున్నట్టు లెక్క! దీన్ని పౌర సమాజం హర్షించదు. 2014, 2018 ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఒక పార్టీ జెండాతో, ఎజెండాతో నెగ్గిన ఎమ్మెల్యేలు మరే పార్టీ శిబిరంలో తేలారో జనాలకి తెలుసు. ముఖ్యంగా వారిని ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. అంత జరిగాకా.... మిగిలి ఉన్న కాంగ్రెస్ పార్టీనీ బతుకనీయకుండా తెలంగాణలో పాలకపక్షం ఎత్తులు వేస్తే ఏమైంది? వారి ఊహలకే అందని రీతిలో, బీజేపీ దూసుకొని వచ్చి ఉప ఎన్నికల్ని కైవసం చేసుకుంది. ఏపీలో ప్రజలు 151/175 అనుకూల తీర్పు ఇచ్చాక కూడా... విపక్ష టీడీపీలోని నలుగురు ఎమ్మెల్యేల్ని పాలకపక్షమైన వైసీపీ లాగితే ఏమైంది? అదే సంఖ్యలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గండి కొట్టి, ఏడో ఎమ్మెల్సీ సీటు దక్కకుండా చేస్తే, అది విపక్ష టీడీపీ పరమైంది.
ప్రతిపక్షం ప్రజాస్వామ్య వ్యవస్థ
‘సభ నిండా మనమే ఉండాలి...’ అనే పార్టీల కాంక్ష ప్రజాతీర్పు ద్వారా సంక్రమించాలి. కానీ, పాలకుల వంచన చర్యల వల్ల కాకూడదు. దానికోసం ఎన్నికల ముందు, తర్వాత ... ఎన్నో ఎత్తులు వేసి, కొనుగోళ్లు చేసి, విపక్ష ప్రజాప్రతినిధులకు తాయిలాలిచ్చి, కేసుల్లో ఇరికించి, తాఖీదులిచ్చి, నయానో, భయానో బెదిరించి తమ మందలో కలుపుకోవడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అసలు ప్రతిపక్షమే ఉండొద్దన్న ధోరణే సరికాదు. సమర్థ పాలకపక్షం, బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్య పాలనా రథానికి రెండు చక్రాల్లాంటివి. బ్రిటన్ లాగే కొన్ని అభివృద్ధి చెందిన సమాజాల్లో విపక్షంలో ‘షాడో క్యాబినెట్’ ఉంటుంది. ప్రజాధనం నుంచి దానికీ నిధులు, విస్పష్ట విధులు, తగు బాధ్యతలు ఉండటం ఓ ఆరోగ్యలక్షణం. 119లో 110 మనవే ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నా, ‘వైనాట్ 175’ అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినా.... ప్రజలు అలా తీర్పు ఇస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అది దక్కించుకోవడానికి ఎన్నికల ముందే వక్రమార్గం పడితేనో, ఎన్నికలయ్యాక విపక్ష సభ్యుల్ని కలిపేసుకోవడం ద్వారా అది సాధించడమో ప్రజాస్వామ్య హననమే! ‘ఈ సారి కుప్పంలోనూ మేమే గెలుస్తాం’ అని పాలక వైసీపీ అన్నా, ‘పులివెందుల’ లోనూ జనం మమ్మల్నే కోరుతున్నారని టీడీపీ చెప్పడమైనా ఇదే సూచిస్తోంది. ఆ మాటలకు అర్థమేమిటి ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేని పాలకపక్షంగా తాము ఉండాలని కోరుకుంటున్నట్టే కద! వ్యతిరేకించేవారు, నిరసించే స్వరాలు, తప్పులెన్నే విపక్షమే ఉండొద్దనే ధోరణి అనుచితం. విపక్షమే లేక ప్రజాస్వామ్యం బలహీనపడితే నికరంగా నష్టపోయేది ప్రజలే!
విలువలు మంట గలుస్తున్నాయ్
294 సభ్యులున్న సభలో ప్రధాన ప్రతిపక్షం 26 కి పరిమితమైన రోజుల్లో (1994-99) కూడా విపక్ష సభ్యులకు ఎన్ని అవకాశాలు లభించేవో, ప్రజా సమస్యలు ఎంతలా సభలో చర్చకు వచ్చేవో.... అసెంబ్లీ రికార్డులు చెబుతాయి. చనిపోయి ఏ లోకాన ఉన్నారో కానీ, 26 మంది సభ్యుల సీఎల్పీకి నేతృత్వం వహించిన ప్రజలమనిషి పి.జనార్దన్‌రెడ్డి (కాంగ్రెస్), ప్రభుత్వాన్ని ఢీకొనడంలో ఏ రోజూ అంగుళం వెనక్కి తగ్గలేదు. ‘వీళ్లు ఎన్నటికీ అధికారంలోకి రాలేరు, మంత్రులు కాలేరు...’ అని రూఢీగా తెలిసి కూడా..... ఒక నర్రా రాఘవరెడ్డి (సీపీఎం), ఒక ఓంకార్ (ఎమ్సీపీఐ), ఓ రజబ్ అలీ (సీపీఐ), ఒక గుమ్మడి నర్సయ్య (సీపీఐ-ఎమ్మెల్), ఓ బద్దం బాల్‌రెడ్డి (బీజేపీ) లను ప్రజలు ఎందుకు అన్నన్నిసార్లు గెలిపించేవారు అంటే, తమ సమస్యల్ని చట్ట సభల్లో వినిపిస్తారని. జనహితంలో నిలుస్తారని. ఏకపక్ష నిర్ణయాలని సమీక్షించి, సర్కారు మంచి మార్గంలో నడిచేలా చూసుకుంటారనే ప్రజల నమ్మకం. ఇప్పుడా స్ఫూర్తి ఏది? ఎన్నికయ్యే వరకు ఏ పార్టీని పగలు-రేయి తిట్టిపోస్తారో... ఎన్నికైన వెంటనే అధికారం కోసం వారి చంకలోకే వెళ్లిపోతున్నారు. ఏమంటే, ‘నియోజకవర్గం అభివృద్ధి కోసం’ అని చిలుకపలుకులు చెబుతున్నారు. విపక్ష ఎమ్మెల్యేలపైన, వారి నియోజకవర్గాలపైన పాలకుల వివక్ష కూడా ఇందుకొక కారణమే! సభ్యులకు సభపైన, సంప్రదాయాలపైన, ప్రజాస్వామ్య విలువలపైన గౌరవమే ఉండట్లేదు. తొలిసారి కాదు, రెండు, మూడు మార్లు ఎన్నికైన శాసనసభ్యుల్లో కూడా.... జీరో అవర్, కాలింగ్ అటెన్షన్, స్పెషల్ మెన్షన్.... సభా వ్యవహారాల్లో ఇవన్నీ ఏంటో, వాటి మధ్య వ్యత్యాసాలేమిటో ఏ సందర్భంలో దేన్ని ప్రభావవంతంగా వాడొచ్చో తెలియని వారున్నారు. చట్టసభల్లో గట్టి విపక్షంగా నిలబడి, నిలబడనిచ్చి పాలనను మెరుగుపరిచే ఏ ప్రయత్నమూ నిర్మాణాత్మకంగా జరుగటం లేదు. నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఏనాడూ సభకు గైర్హాజరు కాలేదు. ఒకటి, రెండు సందర్భాల్లో తప్ప విపక్షనేతగా డా.వైఎస్ రాజశేఖరరెడ్డి సభకు హాజరు కాని రోజు లేదు. ఇప్పుడా పరిస్థితి ఉందా?
వ్యక్తిగత వైరమేముంది?
సిద్ధాంత రాజకీయాలు బలహీనపడ్డాక వ్యక్తిగత వైరుధ్యాలు పెరిగాయి. మర్యాదగా జరగాల్సిన చట్టసభా వ్యవహారాల (బీఎసీ) భేటీల్లో కూడా... పరస్పరం ఆస్తులు లాక్కుంటున్నంత కోపతాపాలు! పాలక - ప్రతిపక్ష స్థానాల్ని గౌరవించకుండా, వ్యక్తిగతంగా తీసుకోవటం వల్లే ఈ కక్షలు, కార్పణ్యాలు మితిమీరుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అలిపిరి పేలుళ్లలో గాయపడితే, విపక్షనేత వైఎస్సార్ ఆయనకు సంఫీుభావం ప్రకటించి, నక్సలైట్ల హింసకు నిరసనగా దీక్ష జరిపారు. ముఖ్యమంత్రి వైఎస్సార్ పయనిస్తున్న హెలికాప్టర్ కనిపించడం లేదని తెలియగానే, నల్లమల అడవుల్లో గాలింపు చర్యల్లో పాల్గొనాలని టీడీపీ శ్రేణులకు విపక్షనేతగా చంద్రబాబు పిలుపిచ్చారు. ఇవి మర్యాదలు. నిజానికి, విపక్షం బలంగా ఉంటే ప్రజా సంబంధ విషయాల్లో సమీక్షకు ఆస్కారం ఉంటుంది. చట్టసభల్లో, బయట వివిధ రూపాల్లో ప్రభుత్వాన్ని, దాని విధానాలను విపక్షం ఎత్తిచూపే, ఎండగట్టే వెసులుబాటు లభిస్తుంది. పాలనలో జరిగే పొరపాట్లు సరిదిద్దుకునే వీలుంటుంది. అది ప్రభుత్వానికీ మంచిదే! ఆనాడు రాజీవ్‌గాంధీకి అన్ని సీట్లు లభించక, పోటాపోటి మెజారిటీ దక్కి, విపక్షం బలంగా ఉండుంటే సర్కారు సజావుగా సాగేదేమో! నిన్నటి ఏపీ ఎన్నికల్లో రఘువీరారెడ్డి, పవన్ కల్యాణ్ వంటి మరికొందరు ఎన్నికై ఉంటే.. నేటి సభ నడత భిన్నంగా ఉండేదేమో! యూపీఏ-2 (2009-2014) కన్నా యూపీఏ-1(2004-09) మంచి ఫలితాలివ్వడానికి... అధికార కూటమిలోనే విపక్షంలా కమ్యూనిస్టు పార్టీలు ఉండటం, ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ వల్ల సాధ్యపడింది ఉమ్మడి ఏపీలో... తరిమెల నాగిరెడ్డి వంటి ఉద్దండుల నుంచి... ఎస్.జైపాల్‌రెడ్డి, ఎం.వెంకయ్యనాయుడు, వి.రామారావు, జూపూడి యజ్ఞనారాయణ, ఓంకార్, మదన్‌మోహన్, వైఎస్సార్, రోశయ్య, పువ్వాడ నాగేశ్వరరావు, మైసూరారెడ్డి... వంటి ఎందరో నాయకులు విపక్షంలో వినిపించిన స్వరం ఆయా కాలాల్లో ప్రభుత్వాలను దారిలో పెట్టేది. చట్టసభలు జరిగే రోజులను క్రమంగా తగ్గిస్తున్నారు. పాలకపక్షంలోనే ధిక్కార స్వరం వినిపిస్తున్నారని, తన నియోజకవర్గ సమస్యల్ని కూడా ప్రస్తావించనీకుండా నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని ఈడ్చి అవతల పారేశారు. ఇదే రీతిన, అఖిల భారత స్థాయిలో ఏం జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారు. విపక్షం ఉనికినే సహించని, నిర్మూలించాలనే పాలకపక్షాల పెడ ధోరణి ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరం! ఇది మారాలి.
-దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ,
9949099802
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672