విద్యలో గుణాత్మక మార్పు తెస్తుందా!?

by Ravi |
విద్యలో గుణాత్మక మార్పు తెస్తుందా!?
X

విద్య సమాజ వికాసానికి గీటురాయి. ప్రజలందరికీ విద్య అందుబాటులో ఉంటే ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుంది. తద్వారా సాంకేతిక ప్రగతి, సాంఘిక సమానత్వం, సమన్యాయం, అందరికీ దక్కుతాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల ఆర్థిక, సాంఘికాభివృద్దిలోని వ్యత్యాసాలకు ప్రధాన కారణం విద్యాప్రణాళికలలోని తారతమ్యాలేనని ప్రపంచ అభివృద్ధి నివేదికలు పేర్కొంటున్నాయి.

నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే 2021 ప్రకారం, తెలంగాణాలో పేద విద్యార్థుల అభ్యాస ఫలితాలు సరిగా లేవని, విశ్వవిద్యాలయాలలో ప్రచురణ, పరిశోధన ఫలితాలు కూడా తగ్గుతున్నాయనీ, విద్యార్థుల నైపుణ్యం, సామర్థ్యం ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండటం లేదని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధ్యయనాలు అనేక అంశాలను గుర్తించాయి.

విద్యలో నైపుణ్య లేమి

అందుకే వీటన్నింటిని అనుసరించి ప్రాథమిక పాఠశాలలోని పూర్వ ప్రాథమిక స్థాయి అంటే బాల్యవిద్యను మరింత అందుబాటులోకి తేవడం, అలాగే ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు నైపుణ్యాలు, విద్యార్థుల సమగ్ర సంపూర్ణ అభివృద్ధికై మార్గాల అన్వేషణ, ఉన్నత విద్యాసంస్థలు అప్రెంటిన్షిప్ కాలంలో స్కిల్స్‌ను, ఉపాధితో ఏకీకృతం చేసే విధాన రూపకల్పనలు, చివరిగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తయారు చేయడానికి అవసరమైన నైతిక విలువలతో కూడిన విద్యను అందించే లక్ష్యంగా సిలబస్ మొదలుకుని అన్ని అంశాల అధ్యయనం, మేధోమథనం, కొత్త ఆలోచనలు, ప్రయోగాత్మక పరిశోధనలతో విలువలను పెంచడం, మార్గదర్శకాలు, నియమాలు రూపొందించడానికి తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సమగ్ర విద్యా విధాన రూపకల్పనే దీని ధ్యేయం.

కమిషన్ ముందు ఎన్నో సవాళ్లు..!

రాష్ట్రంలో విద్యా కమిషన్ నియామకం ఇదే ప్రథమం. ఈ కమిషన్ ముందు అనేక సమస్యలు, సవాళ్లు కలవు. గడిచిన పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినప్పటికీ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందనడానికి లేదు. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులకు విద్యనందించిన వందలాది గురుకుల విద్యాసంస్థలను వివిధ సొసైటీల ఆధ్వర్యంలో నెలకొల్పి నిర్వహిస్తూ వచ్చింది. వాటిలో చదివిన విద్యార్థులు దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలలో ఉన్నత విద్య కోసం ఎంపికయ్యారు. ఉపాధి, ఉద్యోగ పరీక్షలలోను అత్యుత్తమ ఫలితాలను కనబరిచారు. అయితే ప్రభుత్వ యూనివర్సిటీలను పట్టించుకోకుండా ప్రయివేటు యూనివర్సిటీలకు గత ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. సాంకేతిక విద్యా విషయంలో ప్రత్యేక కృషి చేయలేదు. కానీ అనేక ఐటీ కంపెనీలను రాష్ట్రానికి ఆహ్వానించింది. సింగిల్ డిజిట్‌కే పరిమితమైన మెడికల్ కాలేజీలను పదులసంఖ్యకు పెంచింది. కానీ అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదనేది ముమ్మాటికీ వాస్తవం.

ప్రయివేట్ భాగస్వామ్యంతో విద్య ప్రమాదం!

ప్రస్తుత విద్యా విధానంలో పాఠశాల స్థాయి వరకే అనేక రకాల పాఠశాలలు ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహించబడుతున్నాయి. ఇవిగాక రకరకాల రెసిడెన్షియల్ విద్యాసంస్థలు కలవు. ఈ సంస్థలన్నీ తమకు అనుకూలమైన, అనుగుణమైన విధానాలు రూపొందించుకుని నిర్వహించుకుంటున్నాయి. వీటన్నింటినీ ఒకేచోట ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌గా ఏర్పాటు చేసి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సామాజిక, మత ప్రాతిపదికన ఏర్పడిన గురుకులాలను ఒక చోటికి చేర్చి నిర్వహించాలనుకోవడం కత్తిమీద సామే. అంతేగాకుండా చాలా సంస్థలకు సొంత భవనాలు, సంపూర్ణ సౌకర్యాలు కల్పించబడినవి. వాటిని ఇప్పుడు వదిలేస్తే కోట్లాది ప్రజాధనం వృధానే. ప్రభుత్వం సాంఘిక, లింగభేదాలు, అసమానతలు తొలగించి అన్ని స్థాయిలలో సమానత్వం సాధించేందుకు కృషి చేస్తుందంటూనే, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళ్తామని పేర్కొంది. అయితే ప్రయివేటు సంస్థలు నిధులు సమకూర్చితే సమాన అవకాశాల కల్పనపై వాటి ప్రభావం పడుతుంది.

అభ్యాస ఫలితాల మెరుగుదల ఆవశ్యం!

విద్యాకమిషన్‌కు ఇచ్చిన గడువు రెండు సంవత్సరాలు. రెండు సంవత్సరాలకు అటుఇటుగా ప్రస్తుత ప్రభుత్వ మూడో సంవత్సరపు పాలన కాలంలో కమిషన్ నివేదికను అందజేస్తుంది. అయితే అప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మిగిలేది రెండు సంవత్సరాలు. నాణ్యత గల విద్యను అందించడం, విద్యార్థి అభ్యాస ఫలితాలను మెరుగుపరచడం అంటే అది నిరంతర ప్రక్రియ. సంవత్సరాల తరబడి కృషి చేస్తే తప్ప మంచి ఫలితాలను సాధించలేం. మరీ అంత తక్కువ కాలంలో ప్రభుత్వం కమిషన్ సూచనలను ఎలా అమలు చేసి ఫలితాలను రాబడుతుందో వేచిచూడాల్సిందే. అలా కాకుండా కమిషన్ ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తూ వెనువెంటనే వాటిని అమలు పరిస్తే బాగుంటుంది. ఉదాహరణకు రాష్ట్రంలో రోజూ ఒకచోట రెసిడెన్షియల్ విద్యాలయాలలో సరైన వసతులు లేవని, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డెక్కడం నిత్యకృత్యమైంది. మరి కమిషన్ రిపోర్ట్ వచ్చే వరకు ఇలాంటి సంఘటనలు జరక్కుండా ఉంటాయా?

విద్యా బడ్జెట్ పెంపుదలే పరిష్కారం!

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో విద్యకోసం బడ్జెట్‌లో పదిహేను శాతం కేటాయిస్తాననడం చాలా సంతోషం. అదే విధంగా మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. గత ప్రభుత్వం కూడా కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామని అట్టహాసంగా ప్రకటించి చివరకు హామీగానే మిగిల్చిపోయింది. కాబట్టి కొత్తవి స్థాపించడం కంటే ఉన్నవాటిని బలోపేతం చేస్తూ, నిరంతర పర్యవేక్షణలతో అత్యుత్తమ ఫలితాలను రాబట్టవచ్చును. రాశి కంటే వాసి గొప్పది. పరిమాణాత్మక మార్పు కంటే గుణాత్మక మార్పు సమాజ ప్రగతికి గీటురాయి. కాబట్టి పటిష్ట విద్యా ప్రణాళికలను రూపొందించడం కాదు వాటిని అమలు చేయడం అంతకంటే ముఖ్యం.

- డా. సందెవేని తిరుపతి

చరిత్ర పరిరక్షణ సమితి

98496 18116

Advertisement

Next Story

Most Viewed