- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఎస్ఎన్ఎల్‌కు పునర్వైభవం రానుందా?
ఉచితానికి అలవాటు పడితే అభివృద్ధి మాటేమోగానీ ‘ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే’ అనే సామెత లాగా అవుతుందన్నది మాత్రం ముమ్మాటికి నిజం. ఉచితం అంటూ ప్రజలను నెట్‌కు బానిసలను చేసి వేరే నెట్‌వర్క్ లను బతకనీయకుండా ఏకఛత్రాధిపత్యానికి తెరలేపి ప్రస్తుతం అధిక ధరలు పెంచి జియో వారి వినియోగదారులకు పెద్ద గుణపాఠమే నేర్పింది. ఇందులో బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ నెట్‌వర్క్ అత్యున్నత స్థాయికి చేరడానికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించడం. 2022 అక్టోబర్ 5న జియో 5G సేవలు దేశమంతా అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం నేటికీ 4G సేవలు అందించలేక పోతోంది. అందుకు ప్రధాన కారణం బీఎస్ఎన్ఎల్ 4G పరికరాలు.. స్వదేశీ పరికరాల తయారీదారుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధన. అందువల్ల 4G, అలాగే 5G సర్వీసులను ప్రారంభించడానికి ఎక్కువ ఆలస్యమవుతుంది. కానీ రిలయన్స్‌కి మాత్రం ఈ రూల్ వర్తించదు. అందుకే ఆ కంపెనీ ఫిన్లాండ్ ఆధారిత నోకియా నుండి 5G నెట్‌వర్క్ పరికరాలను కొనుగోలు చేసి నేడు ఈ స్థాయిలో ఉంది. జియో లాంటి ప్రైవేట్ కంపెనీ విదేశీ పరికరాలను ఉపయోగించి ప్రముఖ స్థాయిలో నిలుస్తుంటే, ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ గురించి మాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం.
మంత్రి అనుమతి ఇవ్వకపోవడంతో..
20 సంవత్సరాల క్రితం దేశంలో ఒకే ఒక నెట్‌వర్క్ బీఎస్ఎన్ఎల్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ నెట్‌వర్క్ అంటే అప్పట్లో ప్రజలకు ఎనలేని విశ్వాసం ఉండేది. అప్పట్లో మారుమూల పల్లెల్లో సైతం పటిష్టమైన సిగ్నల్ వ్యవస్థతో ప్రజల మనసును గెలుచుకున్న నెట్‌వర్క్ నేడు కంటికి కానరాకుండా పోతోంది. ఒకప్పుడు రూ.10 వేల కోట్ల లాభంతో నడిచిన సంస్థ నేడు వేల కోట్లల్లో నష్టాల్లో కూరుకుపోవడానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1990లో ల్యాండ్‌లైన్ సేవలతో నెట్‌వర్క్ ప్రారంభించిన బీఎస్‌ఎన్‌ఎల్ 2000 సంవత్సరం నాటికి మొబైల్ సేవలను అందించింది. 2005 నాటికి అన్ని నెట్‌వర్క్‌లను వెనక్కి నెట్టి దేశంలోనే నెంబర్‌వన్‌గా ఎదిగింది. అప్పట్లో ప్రభుత్వానికి భారీ లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీల్లో బీఎస్ఎన్ఎల్ ఒకటి. 2007లో, WIMAX సాంకేతికతకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించిన బీఎస్‌ఎన్ఎల్, ఆ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడాన్ని అనుమతించాలని అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ అప్పటి కేంద్ర టెలికాం మంత్రి ఇందుకు అనుమతి ఇవ్వలేదు. 2009లో మళ్లీ ప్రయత్నించినా అనుమతించలేదు. దీంతో కొత్త టెక్నాలజీని అవలంబించడంలో బీఎస్‌ఎన్ఎల్ వెనుకబడింది. ఫలితంగా బీఎస్‌ఎన్‌ఎల్ భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. మిగిలిన టెలికాం కంపెనీలు కొత్త టెక్నాలజీని త్వరగా స్వీకరించడంతో బీఎస్ఎన్ఎల్‌కి కోలుకోలేని దెబ్బ తగిలింది.
కొత్త శకానికి నాంది
4జీ నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం బీఎస్‌ఎన్‌ఎల్- టీసీఎస్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో భారతీయ టెలికాం మార్కెట్లో కొత్త శకానికి నాంది పలికినట్లయింది. ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌లు నెల రీచార్జీ ధరలను 12 నుండి 25 శాతం మేర పెంచడంతో.. బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్ ఈ సమయంలో సిగ్నల్స్ అందిస్తే ఆ వినియోగదారులందరూ బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారే అవకాశముంది. టాటా సంస్థ కేవలం ఇంటర్నెట్ సేవలు అందించడమే కాకుండా భారతదేశంలో నాలుగు ప్రాంతాల్లో డేటా సెంటర్లు కూడా నిర్మిస్తోంది. ఇది దేశంలోని 4G మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈ అభివృద్ధి ప్రస్తుత మార్కెట్‌ను సవాలు చేస్తూ వేగవంతమైన, మరింత విశ్వసనీయమైన ఇంటర్నెట్ సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ ఈ భాగస్వామ్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే ధరల పెంపుపై అసంతృప్తిగా ఉన్న గణనీయమైన వినియోగదారులను ఆకర్షించగలుగుతుంది. దేశ భవిష్యత్తు కోసం టీసీఎస్ కూడా ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తో భాగస్వామ్యం కావడం అభినందనీయం. దేశ సంపదను పెంపొందించాలంటే ప్రతి ఒక్కరూ బీఎస్‌ఎల్ వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కోట దామోదర్
93914 80475