టీచర్ల సమస్యలపై నిర్లిప్తత ఎందుకు?

by srinivas |   ( Updated:2024-04-24 23:45:37.0  )
టీచర్ల సమస్యలపై నిర్లిప్తత ఎందుకు?
X

ఒకే క్యాడర్‌లో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించి సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా పొందకుండా ఉద్యోగ విరమణ చేసే శాఖ ఏదైనా ఉందంటే అది పాఠశాల విద్యాశాఖ అని చెప్పక తప్పదు. నిరాశ, నిస్పృహల మధ్య టీచర్లు మరో విద్యా సంవత్సరాన్ని ముగించారు. ఏళ్లుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. నూతన సర్కారు తమ సమస్యలకు పరిష్కారం చూపుతుందనే ఆశ అడియాసలుగానే మిగిలాయి. విద్యా సంవత్సరాలు వస్తున్నాయి, పోతున్నాయి కాని తమ గోడును వినే నాథుడే కనిపించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు ఎన్నడు జరుగుతాయో తెలియని సందిగ్ధ స్థితిలో టీచర్లు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఈ వేసవి సెలవుల్లోనైనా పదోన్నతులు కల్పిస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్న టీచర్ల ఆశలకు టెట్ గండంగా మారింది. టెట్ అందరు టీచర్లూ రాయాలా, ఏ పేపర్ ఎవరు రాయాలి అనే స్పష్టత ప్రభుత్వం నుండి వచ్చేలోపే టెట్ అప్లికేషన్ గడువు కాస్తా ముగిసింది జూన్ 4 వరకు ఎన్నికల కోడ్ ఉండడంతో ఈ వేసవిలో పదోన్నతుల ప్రక్రియ అటకెక్కినట్టే. పదోన్నతుల ప్రక్రియకు బదిలీలు ముడిపడి ఉండడంతో అవి కూడా జరిగే సూచనలు కనిపించడం లేదు. సంవత్సరాల తరబడి జీపీఎఫ్, సరెండర్, మెడికల్ తదితర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అవసరాల నిమిత్తం తాము దాచుకున్న సొమ్ము సకాలంలో అందడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అలాగే అరు నెలలకొకసారి మంజురుచేసే డీఏలను కూడా పెండింగ్ లో పెట్టడం, జులై 2023 నుండి రావాల్సిన పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారో తెలియని స్థితిలో ఉపాధ్యాయులు కొట్టుమిట్టాడుతున్నారు.


మెరుగైన ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత

ఇక ఉపాధ్యాయుల ఆరోగ్య విషయానికి వేస్తే గత సర్కారు జారీ చేసిన హెల్త్ కార్డులు పనిచేయడం లేదు. మెడికల్ రీయంబర్స్ మెంట్ మంజూరుకు సంవత్సర కాలం పడుతుండడంతో నెలవారీ ప్రీమియం చెల్లిస్తాం, మెరుగైన వైద్యం అందించండి మహాప్రభో అని మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. మార్చి 31 నాటికే మెడికల్ రీయింబర్స్‌మెంట్ గడువు ముగియడంతో ఈ గడువును పొడిగిస్తారా లేదా అని టీచర్లను ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు మెడికల్ ఇన్స్యూరెన్స్‌లను ఆశ్రయిస్తూ తమ జేబులను గుల్ల చేసుకుంటున్నామని, మెరుగైన వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

సీపీఎస్ రద్దుపై శీతకన్ను

ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టో లో పొందుపరచిన సీపిఎస్ రద్దు అంశంపై దృష్టి పెట్టకపోవడం శోచనీయం. లక్షా అరవై వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల సంబంధించిన ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం విడ్డూరం. ఈ ఏడాది మార్చి నుండి ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. తమకు అందించాల్సిన గ్రాట్యూటీ, కమ్యూటేషన్ వంటి సౌలభ్యాలను ఎప్పుడు అందుతాయో అన్న ఆందోళనలో రిటైరైన ఉద్యోగులున్నారు. రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వం అందించే నగదును బాండ్ల రూపంలో ఇస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ వేసవి సెలవుల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ బడుల మౌలిక వసతుల కల్పనకు పూనుకోవడం హర్షణీయం. అయితే నూతనంగా ఏర్పడ్డ ఈ కమిటీలు ఏ మేరకు తమ విధులను నిర్వర్తిస్తాయో వేచిచూడాల్సిందే. విద్యార్థులకు అందించే రెండు జతల ఏకరూప దుస్తుల బాధ్యత కూడా ఈ కమిటీలకే అప్పగించారు. కానీ చాలా గ్రామాల్లో మహిళా సమాఖ్య సంఘాలు దుస్తులను కుట్టి అందించడానికి సుముఖత చూపడం లేదు. కారణం ఒక జతకు కేవలం యాభై రూపాయలే చెల్లించడం దీనికి కారణం.

విద్యాశాఖలో గుట్టలుగా సమస్యలు

రాష్ట్ర ప్రభుత్వంలో ఏ శాఖలో లేని సమస్యలు కేవలం విద్యాశాఖలోనే గుట్టలుగా పేరుకుపోవడానికి గల కారణాలను విశ్లేశించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ శాఖ ఉద్యోగులకు లేని ఏం.ఎల్. సి వ్యవస్థ ఉపాధ్యాయులకు ఉంది. అయినా సమస్యలకు పరిష్కారాలు ఎందుకు దొరకట్లేదో అర్ధం కాని పరిస్థితి నెలకొన్నది. గత డెబ్బై అయిదు సంవత్సరాల చరిత్ర గల రాష్ట్రోపాధ్యాయ సంఘం తమ బాధ్యతలను నిర్వహిస్తూనే హక్కుల కొరకు పోరాడుతూనే ఉన్నది. కోరి తెచ్చుకున్న తెలంగాణలో గత పాలకులు అవలంభించిన ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను ఎండగట్టి అనేక పోరాటాలకు పిలుపునిచ్చి ఉపాధ్యాయుల గొంతుకగా నిలిచి సమస్యలను సాధించిదనడంలో సందేహం లేదు.

నూతన సర్కారు ఏర్పడి ఆరునెలల కాలం పూర్తవస్తున్నా నేటికి విద్యాశాఖకు మంత్రిని కేటాయించక పోవడంతో ప్రతి సమస్యను గౌరవ ముఖ్యమంత్రి చెంతకు తీసుకుపోవడం ఉపాధ్యాయ సంఘాలకు కష్టతరంగా మారింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులే సమస్యలతో సతమతమైతే ఏ విధంగా నాణ్యమైన విద్యను అందించగలరో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. టీచర్ల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసి ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గవర్నమెంటు అని నిరూపించుకోవాలని ఉపాధ్యాయ లోకం కోరుకుంటున్నది.



సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి

స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్

90006 74747

Advertisement

Next Story

Most Viewed