మణిపూర్‌పై మౌనమెందుకు!?

by Ravi |   ( Updated:2023-08-09 00:45:49.0  )
మణిపూర్‌పై మౌనమెందుకు!?
X

భారతదేశం నేడు ఆర్థిక రాజకీయ, సాంస్కృతిక, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అయినా ఇంకా గిరిజనులపై వివక్ష, దళితులపై మారణకాండ, స్త్రీలపై మారణ హోమం జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఆర్ఎస్ఎస్.. దేశంలో మతోన్మాదాన్ని పెంపొందించడంలో దీని పాత్ర గణనీయమైంది, దాని కుతంత్ర పూరితమైన వ్యూహమే ‘రామ జన్మ భూమి బాబ్రీ మసీద్‌ల’ వివాదం. ఈ 75 యేళ్ళ స్వతంత్ర భారతంలో అది వర్ణ వ్యవస్థను పెంచి పోషించింది. కుల విద్వేషాలు రేపింది. అస్పృశ్యత మారణ హోమాన్ని ఆచరించింది. ఈ హిందూ నియంతృత్వాన్ని భరించలేక దళిత బలహీన వర్గాల ప్రజలు శిక్కు, ఇస్లాం, క్రైస్తవ మతాలను స్వీకరించారనే సత్యాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ దాడుల వల్ల మైనార్టీ మతాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. అయితే దీన్ని ఎదుర్కోవాలంటే అంబేద్కర్ వాదం ఒక్కటే ప్రధానం.

అంబేద్కర్ హిందూ మతోన్మాదాన్ని ఎదిరించి పోరాడిన యోధులందరినీ మన ముందుకు తెచ్చాడు. ముఖ్యంగా బుద్ధుడు, సంత్ రవిదాస్, కబీర్, మహాత్మా ఫూలే, సాహు మహారాజ్ వంటి వారందరినీ ఆయన భారతదేశ సామాజిక విప్లవానికి, సాంస్కృతిక విప్లవానికి పోరాట శక్తులుగా ముందుకు తెచ్చారు.

రాజ్యాంగాన్ని విధ్వంసం చేయాలనే

బీజేపీ, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్‌ఎస్‌ల కూటమి కేవలం ఓట్ల రాజకీయాల కోసమే ఈ వ్యూహం పన్నారని అర్థం చేసుకొనవలసిన అవసరముంది. ఈ హిందూ మతోన్మాదులు ప్రజాస్వామిక రాజ్యాధికారాన్ని కోరడం లేదు. వీరి హిందూ రాజ్యం నియంతృత్వమైంది. అందుకే వారు ఈనాడు కోర్టులను, చట్టాలను పరిగణలోకి తీసుకోకుండా వారి పద్ధతిలో వారు ముందుకెళ్ళుతున్నారు. వీరి మత నియంతృత్వ పోకడలను వ్యతిరేకించే కలెక్టర్లను, పోలీసు అధికారాలను, జడ్జీలను వీరు వేధిస్తూ, దాడులు చేస్తూ భయం కంపితులను చేస్తున్నారు. హిందూ మతోన్మాద సాయుధ దళాలకి ప్రభుత్వ యంత్రాంగలోవున్న మతోన్మాదులకి సయోధ్య కుదిర్చారు. హిందూ సాయుధ అరాచక దళాలకు ప్రభుత్వ యంత్రాంగం నుండి కూడా రక్షణ వలయాన్ని రూపొందించు కోగలిగారు. ఆర్ఎస్‌ఎస్ మూలాలను అర్థం చేసుకోకుండా అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మనం ప్రతిఫలింప చేయలేము కాబట్టే అంబేద్కర్ భారత రాజ్యాంగం పూర్తిగా మనుస్మృతికి ప్రత్యామ్నాయంగా రూపొందించారు. భారత రాజ్యాంగంలో ప్రధానమైనది ‘సమానత్వపు హక్కు’ అది నిరంతరం ఉల్లంఘించబడుతోంది. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని నిరంతరం విధ్వంసం చేయాలనే ప్రయత్నంలోనే ఉంది. అందులో భాగమే మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండ. మణిపూర్‌లో హక్కులను కాలరాయడం వెనుక ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ హస్తం ఉంది. ముఖ్యంగా ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై అత్యాచారం చేసిన ఘటనతో భారతదేశం ప్రపంచ మానవ హక్కుల వేదిక ముందు తలవంచాల్సి వచ్చింది.

హెచ్చరించినా పట్టించుకోలే..

ప్రధాని మోడీ కూడా ఈ అత్యాచారానికి బాధ్యత వహించాల్సి ఉండగా, దానికి భిన్నంగా ఆయన ఆర్ఎస్ఎస్ వాదిలానే వ్యవహరించాడు. ముఖ్యంగా సుప్రీంకోర్టు కలుగజేసుకున్నాకే మణిపూర్‌పై మాట్లాడాడు. మణిపూర్ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం ఏ చర్యా తీసుకోకపోతే మేమే ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించాకే నోరు తెరిచాడు. సుప్రీం కోర్టులో మణిపూర్ వ్యవహారం ప్రస్తావనకు రాకపోతే మోదీ నోటికి వేసిన తాళం ఖచ్చితంగా తెరుచుకునేది కాదు. అదీకాక పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్నందువల్లే మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించనట్టున్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించింది మే 4వ తేదీన కాగా, ఈ విషయంలో ఎఫ్.ఐ.ఆర్. దాఖలైంది మే 18న. అయినా ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు చీమ కుట్టినట్టయినా అనిపించలేదు. మే నాలుగన మహిళల మీద అత్యాచారం జరిగిందన్న వీడియో ప్రచారంలోకి రావడానికి కనీసం నెలరోజుల ముందు మహిళల సమస్యలపై పోరాడుతున్న కార్యకర్తలు, జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మను హెచ్చరించారు. మణిపూర్‌లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితి గురించి ఆ కార్యకర్తలు అనేక ఉదంతాలు కూడా చూపించారు. ఆ సామాజిక కార్యకర్తలు రేఖా శర్మకు అపహరణలు, కొట్టి చంపడం, దహనాలు, హత్యల గురించి సమాచారం ఇచ్చారు. కానీ కమిషన్ తనంత తాను మణిపూర్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడానికి కూడా ఇద్దరు మహిళల మీద హేయమైన అత్యాచారం వీడియో బయటకు వచ్చిన తర్వాతే స్పందించింది.

మోదీ ప్రస్తావించనిది అందుకే..

ఇకపోతే హక్కులను సంరక్షించాల్సిన ప్రభుత్వాలే వాటిని భక్షిస్తున్న ఉదంతాలు పెచ్చు పెరుగుతున్న రోజులివి. ఉక్కు కవచంగా ఉండాల్సిన మానవ హక్కులకు తూట్లు పొడిచే శక్తులు పెట్రేగిపోతున్న తరుణమిది. స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ వున్నాయా అని కాగడా పెట్టి వెతకాల్సిన పరిస్థితి. ఎక్కడికక్కడ హక్కుల ఉల్లంఘనలే తప్ప ఎదుటి వ్యక్తి హక్కును గౌరవించాలన్న కనీస స్పృహే కనుమరుగైంది. మానవ, పౌర, ప్రజాస్వామిక...... పేర్లు ఏదైనా అన్ని హక్కులకూ కావలసింది పరిరక్షణే.. వాటి నిరాకరణ, అతిక్రమణ ఎదురయ్యే ప్రతీసారీ ప్రతిఘటన తప్పదు. ఉన్న హక్కుల కోసం ఆరాటం, కొత్తవాటి గురించి పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మనిషి మనిషిగా జీవించేందుకు, తన జీవితాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు హక్కులు అవసరం. వాటి అణచివేతకు ఎవరు ప్రయత్నించినా ఎదురించటం అనివార్యం.

ఇకపోతే మణిపూర్ వ్యవహారాన్ని ప్రధాన మంత్రి మోదీ ప్రస్తావించడం యథాలాపంగానే జరిగింది. కనుక అక్కడ కొనసాగుతున్న విచ్చలవిడి హింసాకాండ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శాంతియుతంగా మెలగాలని కనీసం మణిపూర్ ప్రజలకు విజ్ఞప్తి అయినా చేయలేదు. మణిపూర్‌లో హింసాకాండ ప్రారంభమైన మే 3వ తేదీన మర్నాడు ఇద్దరు మహిళలను నగ్నంగా పరేడ్ చేయించి అత్యాచారం చేశారన్న సమాచారం, దానికి సంబంధించిన వీడియో రెండు నెలల తర్వాత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తరవాతే మోదీ ఇది భయంకరమైన సంఘటన అన్నారు. దోషులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మెజారిటీ వర్గమైన మెయితీలను కూడా గిరిజనులుగా పరిగణించాలని కోరడంతో అగ్గి అంటుకుంది. ఈ వాదనకు బీజేపీ అండ ఉంది. మణిపూర్‌లో గిరిజనులైన కుకీల మీద దాడులు జరుగుతున్నా మోదీ కానీ, బీజేపీ కానీ నోరు విప్పలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ వుంటే మెరుగైన పరిస్థితి వుంటుందన్న బిజేపి నిరంతర ప్రచారంలోని డొల్లతనం మణిపూర్‌లో బాహాటంగా రుజువైంది. అందుకే దీని గురించి మోదీ ప్రస్తావించడం లేదు. మణిపూర్ హింసాకాండ శూన్యంలో జరుగుతోందని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది.

పోలీసులే చేతులెత్తేస్తే దిక్కెవరు?

ఇకపోతే జాతీయ మహిళా కమిషన్ విషయానికి వద్దాం. జూన్ 12న నార్త్ మణిపూర్ ట్రైబల్ అసోసియేషన్, ఇద్దరు మణిపూర్ మహిళా కార్యకర్తలు రాసిన లేఖ ఒకటి కమిషన్‌కు చేరింది. ‘‘మే నెల నాలుగవ తేదీన కాంగ్పోకీ జిల్లాలోని బి.ఫైనావ్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేశారు. నగ్నంగా ఊరేగించారు. కొట్టడం మాత్రమే కాకుండా చుట్టుముట్టిన మైతీ మూక బహిరంగంగా మానభంగానికి పాల్పడింది. రాష్ట్రానికి చెందిన పోలీసులు ప్రేక్షకుల్లా వుండిపోయారు. ఇద్దరు బాధితులు చురాచాంద్‌పూర్ జిల్లా శరణార్ధి శిబిరాల్లో వున్నారు. నిజానికి పోలీసుల నిర్లక్ష్యం అతిగా వుంది. ఇది కారంచేడు, చుండూరులో కూడా ఎక్కువ జరిగింది. బాధిత మహిళల్లో చిన్న వయసు మహిళ ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ, ‘దుండగుల గుంపు మా వూరిపై దాడి చేస్తున్నప్పుడు పోలీసులు అక్కడే వున్నారు’’ అని చెప్పింది. దీనర్థం ప్రజలను రక్షించాల్సిన వాళ్లే అక్కడ నిలబడి మౌన ప్రేక్షకులయ్యారా? ‘‘పోలీసులే మమ్మల్ని వారికి (దుండగులకు) అప్పగించారు.’’. అని కూడా ఆ అమ్మాయి వాపోయింది. అంటే, తక్కువ సంఖ్యలో వున్నా సరే, పోలీసులు బలహీనంగా చేతులెత్తేశారు అని అర్థమా? అరాచక శక్తుల దాడి నుంచి పోలీసులు మహిళలను రక్షించలేదు సరికదా, వారు వారి భద్రత, ప్రాణాల సంగతి మాత్రమే చూసుకున్నారు. మనం వారి నుంచి ఆశించేది అది కాదు కదా?

బీజేపీ దుర్వ్యూహమిదే..

భారతదేశం అసలు గిరిజనులది. ఒక గిరిజన స్త్రీ ఈ రోజున రాష్ట్రపతిగా వుంది. ఆమెకు త్రివిధ దళాలు సెల్యూట్ చేస్తున్నాయి. ఒక పక్క గౌరవం ఇస్తూనే మరో ప్రక్క గిరిజన మహిళలను వెంటపడి వేటాడటం, మానభంగం చేయటం, చూస్తుంటే ఇది గిరిజనులపై, దళితులపై, స్త్రీలపై, బహుజనులపై చేస్తున్న దాడుల వెనుక ఆర్ఎస్ఎస్ కుట్రలు దాగి వున్నాయి. ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా దళిత బహుజనులకు వేటాడటంలో పౌరాణిక పాత్రలు నిర్వహిస్తోంది. అర్జునుడు కాండవ దహనం చేసి నాగుల్ని నాశనం చేసిన ఉదంతం మనకి గుర్తు వస్తుంది. అన్ని అశ్వమేధ యాగాలలోనూ దళిత గిరిజన రాజ్యాలను విధ్వంసం చేసినట్లే, సామ్రాజ్యాలను నిర్మించినట్లే ఈనాడు గిరిజనులు నివసించే ప్రాంతాలన్నింటిలో విధ్వంసాలు సృష్టించి మారణకాండలు సృష్టించి గిరిజన ప్రాంతాలను తవ్వకాలకు (బాక్సైట్, గ్రానైట్) అప్పగించాలనేది బీజేపీ దుర్వ్యూహం. అయితే గిరిజనులు అనేక సామ్రాజ్యాలను పాలక వర్గాలను, ఆధిపత్యాలను ఎదురించి తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూ వస్తున్నారు. మణిపూర్ పోరాటంలో కూడా అంతిమ విజయం గిరిజనులదే!

డా. కత్తి పద్మారావు

కవి, సామాజిక వేత్త

98497 41695

Advertisement

Next Story

Most Viewed