- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సేద్యం చేస్తానంటే... అసలు పట్టించుకోరు
ఓ కంపెనీ పెట్టి పదిమందికి ఉపాధి కల్పిస్తామంటే.. ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. అత్యంత చౌకగా భూమి, నీరు, విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నాయి. మరెన్నో రాయితీలు ప్రకటిస్తున్నాయి. అదే ఎవరైనా వ్యవసాయం చేస్తానంటే భూమి ఇవ్వరు. భూయజమానులను అడుక్కో పొమ్మంటున్నారు. సాగునీరు ప్రభుత్వ దయాదాక్షిణ్యం. పనిముట్లు ఇవ్వరు. సంస్థాగత పంట రుణాలు ఇవ్వరు. పండించిన పంటకు గిట్టుబాటు ధర గురించి పట్టించుకోరు. కనీస మద్దతు ధరలకు కొనడానికి ముందుకు రారు. ఇలాంటి ప్రభుత్వాలే మరోవైపున రైతే రాజంటున్నాయి. రైతు ప్రభుత్వాలని చాటింపు వేసుకుంటున్నాయి. పేదల ప్రభుత్వమని ఓలింపు వేసుకుంటున్నాయి. ఇంతకన్నా దగాకోరుతనం ఏముంటుంది?
వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 60 లక్షల రైతు కమతాలున్నాయి. అందులో 25 శాతం కుటుంబాలు మాత్రమే పంటలు సాగు చేస్తున్నాయి. మిగిలిన కుటుంబాలు తమ పంట భూములను కౌలుకు ఇచ్చేస్తున్నాయి. యాంత్రీకరణతో ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వాళ్లు కౌలు రైతులుగా మారిపోయారు. ప్రస్తుతం సెంటు కూడా సొంత భూమి లేని 18 లక్షల మంది కౌలు రైతులున్నారు. మరో 14 లక్షల మంది పాక్షిక కౌల్దారులు పంటలు సాగు చేస్తున్నారు. వీళ్లంతా భారీ స్థాయిలో కౌలు దోపిడీకి గురవుతున్నారు. కౌలు రైతులకు సంస్థాగత పంట రుణాలు ఉండవు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా అమ్ముకునే హక్కు కూడా లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కౌల్దారీ చట్టం కౌలు రైతులను ఆదుకోకపోగా గ్రామీణ సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను మరింతగా పెంచుతోంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి గ్రామాలే పట్టుగొమ్మలని మహానుభావులు చెప్పారు. ప్రధాన ఉత్పత్తి కారకమైన భూమి వినియోగమే కీలకం. భూ సంబంధాల్లో మార్పు రాకుండా గ్రామీణ జీవితాల్లో వెలుగులు నింపడం సాధ్యం కాదు. దీనికి ప్రభుత్వం చురుకైన పాత్ర పోషించాలి. ఉపాధితో కూడిన అభివృద్ధికి బాటలు వేయాలి. ఈ లక్ష్య సాధన కోసం ప్రాథమికంగా వ్యవసాయ రంగంలో కీలక మార్పులు అమలు చేయాల్సి ఉంది.
ప్రభుత్వమే లీజుకు తీసుకోవాలి
మొట్టమొదట వ్యవసాయం చేయని కుటుంబాల వద్ద భూమిని ఏడాది లేదా ఐదేళ్లకు ప్రభుత్వం లీజుకు తీసుకోవాలి. సదరు సాగు భూమిని ఎకరా నుంచి రెండెకరాల వరకు సొంతంగా పంటలు సాగు చేసుకునే కుటుంబాలకు లీజుకు ఇవ్వాలి. ప్రభుత్వం లీజుకు తీసుకున్న భూముల్లో ఏఏ పంటలు సాగు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించాలి. చిన్న కమతాల్లో సాగుకు అనువైన సేద్య పరికరాలను గ్రామ రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలి. సాగునీటి వనరులను సమకూర్చాలి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులదాకా ప్రభుత్వమే సరఫరా చేయాలి. పంట నూర్పిడి నుంచి గ్రామ శీతల గిడ్డంగి వరకు రవాణా సదుపాయాలు కల్పించాలి. పంట ఉత్పత్తుల సేకరణకు వాటి కొనుగోలు ధరలను ప్రభుత్వం ముందుగా ప్రకటించాలి. వీటన్నింటికన్నా ముందుగా బ్యాంకుల నుంచి పంట రుణాలను ప్రభుత్వమే తీసుకోవాలి. ఆ సొమ్ముతో ఈ సదుపాయాల కల్పనకు వినియోగించాలి. ఓ ఆర్నెల్లపాటు పంటలు సాగు చేసే కుటుంబాలు గడవడానికి పంట రుణాల నుంచి కొంత నగదు తీసివ్వాలి. పంట ఉత్పత్తులను సేకరించి శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయడం, ప్రాసెస్ చేసి మార్కెట్లో విక్రయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. ఎగుమతి ఆధారిత పంట ఉత్పత్తులకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలి. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, లేదా చీడపీడల వల్ల పంటలు నష్టపోతే బీమా పరిహారాన్ని పొందే ప్రక్రియను సులభతరం చేయాలి. ప్రభుత్వమే ఓ బీమా కంపెనీని ఏర్పాటు చేయాలి. రైతు వారీ పంట నష్టాన్ని చెల్లించేట్లు విధి విధానాలు అమలు చేయాలి.
ఇవన్నీ ప్రభుత్వ బాధ్యతే!
ఇలా సేకరించిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్‌కు సంబంధించి పెద్ద ఎత్తున మానవ వనరుల అవసరముంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్న 2.5 లక్షల మంది వలంటీర్లను మల్టీ లెవల్ సర్వీసు ప్రొవైడర్స్‌గా మార్చి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. నెలకు పదివేల వేతనం ఇస్తూ మల్టీ లెవెల్ సర్వీసు ప్రొవైడర్స్ సర్వీసును బట్టి వేతనం పెంపుతోపాటు గ్రామ సూపర్ వైజర్, మండల స్థాయి ఆర్గనైజర్, డివిజన్ లెవల్ ఇన్చార్జి, జిల్లా స్థాయి లీడర్‌గా పదోన్నతులు కల్పించాలి. ఇలా మల్టీ లెవెల్ సర్వీసు ప్రొవైడర్స్ సంఖ్యను పది లక్షల వరకూ పెంచాలి. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ కు దోహదపడుతుంది. దీనివల్ల పంటలు పండించే వాళ్లకు వినియోగదారుల మధ్య ప్రభుత్వానిదే కీలక పాత్ర అవుతుంది. సగటు పౌరులు ఆహారానికి వెచ్చించే ఖర్చు తగ్గిపోతుంది. ఇతర వినిమయ సరకుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అనివార్యంగా ఇది అర్బన్ ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపునకు ఊతమిస్తుంది.
ఉచిత విద్య, ఉచిత వైద్యం
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యా విధానాన్ని ప్రభుత్వం తీసుకురావాలి. ప్లస్ టూ వరకు మాతృభాషలోనే బోధన ఉండాలి. పరీక్షల విధానాన్ని ఎత్తేయాలి. విద్యార్థుల్లో అంతర్గత సామర్థ్యాన్ని వెలికితీసేట్లు ఆచరణాత్మక బోధనా పద్దతులుండాలి. విద్యార్థుల అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్నత విద్యలో ప్రవేశం కల్పించాలి. ఉన్నత విద్య కరిక్యులం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అవసరాలకు తగ్గట్టుండాలి. ఆయా రంగాల్లో పరిశోధనకు పెద్ద పీట వేయాలి. విద్య లక్ష్యం విజ్ఞానాన్ని గ్రహించడమేనన్నట్లుండాలి. కెరీర్‌కు ముడిపెట్టకూడదు. ఇదే భావితరాన్ని ప్రపంచం ముంగిట ఆత్మ గౌరవంతో తలెత్తుకునేట్లు చేస్తుంది. ప్రస్తుతం గ్రామస్థాయికి ఆరోగ్య సేవలు విస్తరించాయి. కొత్త వైద్య కళాశాలలు వచ్చాయి. వాటికి అనుబంధంగా అన్ని రకాల సేవలందించే బోధనాస్పత్రులు ఏర్పాటవుతున్నాయి. ఇంతకుమించి ప్రైవేటు ఆస్పత్రుల్లో సేవలు అంత గొప్పగా ఏమీ ఉండవు. అందువల్ల పేద, ధనిక తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరికీ ఉచిత వైద్యం అందించాలి. ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రులను పెంచి పోషించే పథకాలను రద్దు చేయాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలతో ఆస్పత్రులు, సిబ్బందిని ఏర్పాటు చేయాలి.
విద్యార్థులైతే పాఠశాలలు, కళాశాలల్లో ఉండాలి. అధ్యాపకులు బోధన చేస్తుండాలి. ఉద్యోగులు విధుల్లో ఉండాలి. కార్మికులు పనిలో ఉండాలి. అంతకు మించి రోడ్డు మీద ఖాళీగా ఎవరూ కనిపించకూడదు. ఇళ్లల్లో ఏ ఒక్క గృహిణి ఖాళీగా ఉండకూడదు. పని చేయగలగిన వాళ్లంతా పనిలోనే ఉండాలి. ఇలాంటి పని సంస్కృతిని పెంచే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను రూపుమాపొచ్చు. అంతిమంగా ఇవన్నీ ప్రజల్లో ఐక్యత, సమ భావనకు ఊపిరిపోస్తాయి. నవ భారత నిర్మాణానికి ఇది దోహదపడుతుంది.
– సీహెచ్. కాశీ విశ్వనాథ్
9704141223