- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం సేకరణలో ద్వంద్వ వైఖరి ఎందుకు?
ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది ‘జీరో హంగర్’. ఆకలిని అంతమొందించడం, ఆహార భద్రతను సాధించడం, పోషకత్వ అభివృద్ధి, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలి. కానీ మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. ఈ దేశ ప్రజల ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పంటలు పండుతాయి. గిట్టుబాటు ధర కల్పించి వాటిని రైతుల నుంచి సేకరించి దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వ చట్టబద్ధమైన విధి. కానీ కేంద్రం ఆ విధిని నిర్వర్తించడం లేదు.
ముందుచూపు లేని నిర్ణయాలు..
తెలంగాణలో వరి ప్రధాన పంట. బీఆర్ఎస్అధికారంలోకి వచ్చిన తర్వాత గత తొమ్మిదేండ్లలో ధాన్యం దిగుబడులు రికార్డు స్థాయిలో పెరిగాయి. అయితే యాసంగిలో మాత్రం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, వడ్లను మిల్లింగ్ చేస్తే.. నూకలు ఎక్కువ అవుతాయి. అందుకే యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్‌గా చేయడం జరుగుతున్నది. ఆహార భద్రతలో భాగంగా కేంద్రం రాష్ట్రం నుంచి బియ్యం సేకరించాల్సి ఉన్నది. కానీ వానాకాలం బియ్యం తీసుకుంటున్న కేంద్రం.. బాయిల్డ్ రైస్ తీసుకోవడం కొర్రీలు పెడుతూ నిల్వలు ఉన్నాయని, బాయిల్డ్ రైస్ ఏ రాష్ట్రంలో తీసుకోవడం లేదని కుంటిసాకులు చెబుతోంది. గత రెండు మూడు సంవత్సరాలుగా ఏటా ఇదే తంతు. బాయిల్డ్ రైస్సేకరించకుంటే.. ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయి అంతిమంగా రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై గతంలో పెద్ద పోరాటమే చేసింది. సీఎం కేసీఆర్ సైతం ప్రత్యక్షంగా ఢిల్లీలో జరిగిన రైతుల ధర్నాలో పాల్గొని కేంద్ర వైఖరిని తీవ్రంగా ఖండించారు. అయినా కేంద్రం స్పందించకపోవడంతో రూ.1,000 కోట్ల నష్టాన్ని భరించి రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఈ సారి కూడా దొడ్డు ధాన్యం తీసుకునేది లేదని కేంద్రం అంటోంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమకు ఓట్లేసి గెలిపిస్తే ‘అన్నభాగ్య పథకం’ పేరుతో అర్హులైన ప్రతి వ్యక్తికి నెలనెలా రూ. 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం.. ‘బియ్యం ఇవ్వండి.. మార్కెట్ ధరకే కొంటామ’ని కేంద్రాన్ని కోరారు. తమను ఓడించారన్న అక్కసుతో బీజేపీ.. ప్రజలపై పగ తీర్చుకొనేందుకు ఇదే సరైన అవకాశం అనుకొని రాష్ట్రప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా గింజ కూడా ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీంతో పరువు పోతుందని భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బియ్యానికి బదులుగా డబ్బులు ఇస్తోంది. ఎఫ్‌సీఐ కిలో రూ.34 చొప్పున అమ్ముతున్నదని.. ఆ లెక్కన 5 కిలోల బియ్యానికి రూ.170 నేరుగా లబ్ధిదారులకు ఇస్తామని ప్రకటించింది. ఇలా కర్నాటకలో కాంగ్రెస్, బీజేపీ కొట్లాట పేదల నోటికాడి కూడును మట్టిపాలు చేసింది. ముందుచూపు లేని నిర్ణయాలు, తాత్కాలిక ప్రయోజనం కోసం గుప్పించిన హామీలు చివరకు ప్రజల ఆశలను ఛిద్రం చేశాయి.
కేంద్రం రెండు నాలుకల వైఖరి..
కర్నాటకలో చిరుధాన్యాలు ఎక్కువగా పండుతాయి. రాగి, జొన్న, మొక్కజొన్న పంట దిగుబడిలో ఆ రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉంది. ఏటా 25 లక్షల టన్నులు రాగులు, 18 లక్షల టన్నుల జొన్నలు, 8 లక్షల టన్నుల మక్కలు పండుతున్నాయి. కానీ ఏటా కేంద్రం 6 లక్షల టన్నుల రాగులు, 3 లక్షల టన్నుల జొన్నలు మాత్రమే సేకరిస్తోంది. ఎలాగూ కేంద్రం బియ్యం ఇవ్వడం లేదు కదా? అని రాష్ట్ర సర్కారు రైతుల వద్ద నుంచి కేంద్రం సేకరించిన ధరకే రాగులు, జొన్నలు సేకరించి.. ఇందిరా క్యాంటీన్ సహా.. సర్కారు బడుల్లోని మధ్యాహ్న భోజనంలో రాగి సంకటి, జొన్న గట్క పెడుతున్నది. అయితే.. ఈ రెండు పంటలకు కేంద్ర మద్దతు ధర మార్కెట్‌ధర కంటే చాలా తక్కువ ఉన్నది.
ఈ ఏడాది రాగి పంట గణనీయంగా పెరిగినందున.. కనీసం 8 లక్షల టన్నుల రాగులు, 3.5 లక్షల టన్నుల జొన్నలు సేకరించాలని, రూ.3,846 ఉన్న రాగుల ధరను రూ. 5 వేలకు, రూ.3,225 ఉన్న జొన్నల ధరను రూ.4500 పెంచి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి కర్నాటక సర్కారు లేఖ రాసింది. దానికి బదులు ఇచ్చిన కేంద్రం.. అంత పెద్దమొత్తంలో చిరుధాన్యాలు సేకరించలేమని చేతులెత్తేసింది. పైగా మధ్యాహ్న భోజనంలో రాగి, జొన్నలకు బదులుగా అన్నం వడ్డించాలని ఉచిత సలహా ఇచ్చింది. విచిత్రమేమిటంటే.. పౌష్టికాహారాన్ని ప్రోత్సహించేందుకు 2023ను కేంద్రమే చిరుధాన్యాల ఏడాదిగా ఆచరించాలని పిలుపునిచ్చింది. ఏకంగా ఐక్యరాజ్యసమితికి కూడా సిఫార్సు చేసింది. ఇప్పుడేమో.. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సి వస్తుందని పిల్లలకు మధ్యాహ్న భోజనంలో రాగులు, జొన్నలకు బదులు.. అన్నం పెట్టాలని ద్వంద్వ మాటలు చెబుతున్నది.
సమన్వయం లేకపోవడంతో..
దేశంలోని దాదాపు 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు ఏడాది జనవరి 1న ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్అన్నయోజన’ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. చాలా రాష్ట్రాల్లో ఏదైనా ఒక ధాన్యమే చౌక ధరల దుకాణాల్లో పంపిణీ చేస్తున్నది. కేంద్రానికి ముందు చూపు, సమన్వయం లేకపోవడం వల్ల తృణధాన్యాలు సహా, బియ్యం, గోదుమలు ఇతర సరుకులు అందరికీ అందడం లేదు. నిజానికి తెలంగాణలో బియ్యం ఎక్కువ సేకరించి.. బియ్యం కొరత ఉన్న కర్నాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పంపిణీ చేయొచ్చు. అలాగే కర్నాటకలో రాగులు, జొన్నలను ఎక్కువ సేకరించి.. తెలంగాణలో బియ్యం కొన్ని కేజీలు తగ్గించి.. వాటి స్థానంలో ఇవ్వొచ్చు. ఉత్తరాదిలో ఎక్కువగా ఉండే గోధుమలను సేకరించి.. దక్షిణాదిలో బియ్యంతోపాటు కిలో గోధుమలు పంపిణీ చేయొచ్చు. కానీ ఇలాంటి ఆలోచనలేమీ చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు కొర్రలు సాగు చేస్తున్నారు. అయితే కొర్రలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర లేదు. అలాంటి మంచి పోషక విలువలు ఉన్న తృణధాన్యాలను ఆయా రాష్ట్రాల్లో గుర్తించి.. వాటిని పండించే రైతులను ప్రోత్సహించాలి. ఎక్కువ మంది ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వాటిని అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
బచ్చు శ్రీనివాస్,
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు
93483 11117