Sridevi: రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడానికి కావాల్సిన అంశాలను పరిశీలించండి!

by Gantepaka Srikanth |
Sridevi: రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడానికి కావాల్సిన అంశాలను పరిశీలించండి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు(Municipal Corporations), మున్సిపాలిటీల్లోని పారిశుధ్య నిర్వహణపై పురపాలకశాఖ(Department of Municipal Administration) ప్రత్యేక దృష్టిసారించింది. ఇంటింటి చెత్త సేకరణ మెగురుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలు, పారిశుధ్య కార్మికుల(Sanitation workers) సంక్షేమం వంటి అంశాలపై ఫోకస్ పెట్టింది. చెత్త పేరుకుపోకుండా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని పురపాలక శాఖ అప్రమత్తం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దడానికి కావాల్సిన అంశాలను పరిశీలించాలని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లకు పురపాలక శాఖ కమిషనర్ టీకే.శ్రీదేవి(TK Sridevi) ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది.

కంపోస్ట్ యూనిట్లు..

ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలోని కూరగాయల మార్కెట్లపై పురపాలక శాఖ దృష్టిసారించింది. అక్కడ ఉత్పత్తి అవుతున్న కూరగాయల వ్యర్థాలను వృథా చేయకుండా వాటి నుంచి కంపోస్ట్ ఎరువు తయారుచేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పురపాలక శాఖ సూచించింది. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుపై సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.

స్వచ్చ సర్వేక్షన్‌కు సన్నాహాలు..

స్వచ్ఛ సర్వేక్షన్-2025 కోసం పురపాలకశాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆయా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు గతేడాది మాదిరిగా మంచి ర్యాంకులు సాధించడానికి సర్వేక్షన్‌లో పురపాలకశాఖకు నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్(ఎన్ఐయూఎం) కసరత్తు చేస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షన్ కోసం కావాల్సిన డాక్యుమెంటేషన్ పనులు ప్రారంభమయ్యాయి. డాక్యుమెంట్ల రూపకల్పన, క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకోవాల్సిన చర్యలు, అంశాల వారీగా మార్కులు సాధించడానికి కావాల్సిన పారామీటర్లు వంటి అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.

Advertisement

Next Story