TG Govt: తెలంగాణ ఎమ్మెల్యేలకు కీలక బాధ్యత.. 20 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం

by Gantepaka Srikanth |
TG Govt: తెలంగాణ ఎమ్మెల్యేలకు కీలక బాధ్యత.. 20 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ఆలయ కమిటీ(Temple Committees)లపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వం వేసిన కమిటీల రద్దుతో పాటు నూతన పాలక వర్గాలకు గడువు ముగిసిన వాటిని గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చింది. నిర్ణీత గడువులోగా కమిటీలను పూర్తి చేయాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 546 కమిటీలు ఉండగా, ప్రతి కమిటీలో సభ్యులు సుమారు 14 మంది వరకు ఉండనున్నారు. కమిషనర్ పరిధిలో ఉండే ప్రతి ఆలయ కమిటీలో ఏడుగురు ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రస్తుతం అధికారంలో ఉండటంతో ప్రతి కమిటీలో ఆ పార్టీ లీడర్లకు అవకాశం కల్పించనున్నారు. ఏడాది కాలపరిమితి ఉండటంతో ఎక్కువ మంది నేతలకు చాన్స్ దక్కనుంది.

20 డేస్.. డెడ్‌లైన్..

రాష్ట్రవ్యాప్తంగా 546 కమిటీలు ఉండగా, అందులో ప్రభుత్వం పరిధిలో 56 కమిటీలు, ధార్మిక పరిషత్(రెనోవేషన్ కమిటీ) పరిధిలో 118, కమిషనర్ పరిధిలో 372 కమిటీలు ఉన్నాయి. ఇందులో గవర్నమెంట్ పరిధిలోని 27 కమిటీలు, ధార్మిక పరిషత్ పరిధిలోని 41, కమిషనర్ పరిధిలోని 340 ఆలయ కమిటీలకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్టు స్టేలో 47 కమిటీలు, 10 కమిటీలకు మినహాయింపు ఇచ్చారు. 81 కమిటీలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. అందులో ప్రభుత్వ పరిధిలో 22 ఉండగా, ధార్మిక పరిషత్ పరిధిలో 59 ఉన్నాయి. నోటిఫికేషన్ వేసిన కమిటీలను 20 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వీటి కాలపరిమితి ఏడాది ఉంటుందని ఆఫీసర్లు తెలిపారు.

10 ఆలయాలకు మినహాయింపు

ప్రభుత్వం రాష్ట్రంలోని పది ఆలయాలకు మినహాయింపు ఇచ్చింది. దీంతో ఆ ఆలయాలకు కమిటీలను వేయకుండా పెండింగ్‌లో పెట్టినట్టు ఆఫీసర్లు వెల్లడించారు. గవర్నమెంట్ పరిధిలోని సికింద్రాబాద్‌లో గల టాడ్బండ్‌లో ఉన్న వీర హనుమాన్ ఆలయం, ఆదిలాబాద్ పట్టణంలోని రామచంద్ర గోపాలక్రిష్ణమఠ్, ధార్మిక పరిషత్(రెనోవేషన్ కమిటీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ అంబారిపేటలోని కాచిగూడలో గల మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం, శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలో గల లక్ష్మణ్ జీ మహరాజ్ టెంపుల్, ఆదిలాబాద్‌లోని మార్వాడి పంచాయత్ భవన్ ధర్మశాల, కమిషనర్ పరిధిలోని సికింద్రాబాద్‌లో గల బాకారం లో భ్రమరాంభమల్లికార్జునస్వామి టెంపుల్, భువనగిరి జిల్లా అనంతరంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం, నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్ఠెం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం, కరీంనగర్ గణేశ్‌నగర్‌లోని ప్రసన్న ఆంజనేయస్వామి టెంపుల్, ఆదిలాబాద్‌లోని మంగంమఠ్ ఆలయాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.

81 కమిటీలకు సైతం త్వరలో నోటిఫికేషన్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పదవుల కోసం కేడర్ ఎదురుచూస్తోంది. ప్రతి కమిటీని చైర్మన్‌తో సహా 14 మందితో ఏర్పాటు చేస్తున్నారు. ఏడాది కాలపరిమితి ఉండటంతో పార్టీలో కీలకంగా పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ కమిటీ లిస్టులను ఎమ్మెల్యేలే సిద్ధం చేస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో కమిటీలో చోటు కల్పిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే 408 కమిటీలకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఇవ్వడంతో సగానికి పైగా కమిటీలను నియమించినట్టు ఆఫీసర్లు పేర్కొంటున్నారు. పెండింగ్‌లో ఉన్న 81 కమిటీలకు సైతం త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. సర్కారు తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ కేడర్‌లో జోష్ నింపినట్లయింది.

Advertisement

Next Story

Most Viewed