ఎవరి కోసం ఆసరా?

by Ravi |   ( Updated:2023-10-18 00:30:11.0  )
ఎవరి కోసం ఆసరా?
X

2014లో అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆసరా పథకం ప్రజల కోసం కాకుండా ప్రభుత్వానికే ఆసరాగా మారిందనిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోలో ఆసరా పెన్షన్లని ఐదేళ్లలో 5,016 రూపాయలు, వికలాంగులకు రూ.6,016 వరకు పెంచుతామని ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పటికే ఆసరా పథకంలో లక్షల సంఖ్యలో అనర్హులు లబ్ధి పొందడం వల్ల రాష్ట్రం అప్పుల కుప్పయింది. ఒక్క ఆసరా పథకం వల్లే ధనిక రాష్ట్రం కాస్త దివాలా తీసిందనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ సైతం అధికారమే లక్ష్యంగా ఆసరా పెన్షన్లని 2016 నుండి రూ. 4,000 కి పెంచుతామని ప్రకటించగానే ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగుల పెన్షన్లని అమాంతం రూ.4,016 కి పెంచడం ఆలస్యం జులై నెల నుండి అమలు కూడా ప్రారంభించారు. రోజు రోజుకి డబ్బులు పెంచుకుంటూపోతున్న ఆసరా పథకం ప్రజలకి మాత్రం ఆసరాగా ఉంటుందో లేదో కానీ ప్రభుత్వానికి మాత్రం రోజు రోజుకి ఓటు బ్యాంకు పెంచుకుంటూ ఆసరాగా నిలుస్తోందని చెప్పొచ్చు. వృద్ధాప్య పెన్షన్‌కి అర్హతగా మొదట్లో 65 సంవత్సరాలు ఉండగా, దాన్ని ఇప్పుడు 57 సంవత్సరాలకి కుదించడంతో ఒక్కసారిగా అర్హుల సంఖ్య ఏడు లక్షలకు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరుకోవడంతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు సైతం అంతకు నాలుగు రెట్లు పెంచుకుంది. వికలాంగులు అడగకముందే వారి పెన్షన్లని పెంచడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడటం విడ్డురంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావడానికి, బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా తిరిగి అధికారంలోనే కొనసాగడానికి ఆసరా పథకాన్ని ఒక ఆయుధంగా మలచుకుంటున్నాయి. వికలాంగుల కోటలో పెన్షన్లు పొందుతున్నవారిలో సగానికి పైగా నకిలీ డిసేబుల్ సర్టిఫికెట్లు పొందినవారేనన్న విషయం ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఓటు బ్యాంకు పెంచుకునే క్రమంలో పట్టించుకోవడం లేదు. ఒక్క ఆసరా పథకం వల్లనే ప్రభుత్వం ప్రతి నెల వేల కోట్ల రూపాయల్ని దుర్వినియోగం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో అడిగే నాథుడే లేకుండా పోయాడు. తద్వారా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఇప్పటికైనా ఇలాంటి పథకాల్ని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించాలి. అమలు సాధ్యం కాని పథకాల్ని మేనిఫెస్టోలో చేర్చినప్పుడు సాధ్యాసాధ్యాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి. సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ది పొందడాన్ని అరికట్టడానికి కోర్టులు జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వానికి ఆసరా (ఓటు బ్యాంకు) గా మారిన ఆసరా పథకంలోని లబ్దిదారులను, పెన్షన్ డబ్బుల్ని ఇప్పటికైనా కుదించి, అనర్హులను తొలగించకపోతే అతి త్వరలో రాష్ట్రం దివాలా తీయక తప్పదు అనిపిస్తుంది.

పసునూరి శ్రీనివాస్

మెట్ పల్లి

88018 00222

Advertisement

Next Story