వలస ఆదివాసీలపై ఎందుకీ వివక్ష?

by Ravi |   ( Updated:2023-05-17 00:00:20.0  )
వలస ఆదివాసీలపై ఎందుకీ వివక్ష?
X

మ్మడి రాష్ట్రంలో వలస ఆదివాసీలపై తీవ్ర వివక్ష కొనసాగుతూ వచ్చింది. 2005 సంవత్సరంలో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఏర్పడ్డ సల్వాజుడుం కారణంగా ఆ రాష్ట్రం నుంచి పెద్దమొత్తంలో పక్కనే ఉన్న తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి ఆదివాసీల వలస ఒక ప్రవాహంలా సాగాయి. ఈ వలసలు నేటికి ఆగలేదు. మావోయిస్టుల నిర్మూలన కోసం ప్రభుత్వ అండదండలతో ఏర్పడి, ఒక ప్రైవేటు సైన్యంగా అపఖ్యాతి చెందిన సల్వాజుడుం దాడుల మూలంగానే వీళ్లంతా తమ మాతృరాష్ట్రాన్ని వదిలి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కట్టుబట్టలతో ఇక్కడికి వలస వచ్చి అడవుల్లో నివాసాలు ఏర్పటుచేసుకున్నారు. ఇలా వీరు తెలంగాణలో 120, ఆంధ్రప్రదేశ్‌లో 80 గ్రామాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

వీరు దేశ పౌరులు కారా?

వీరి జనాభా సుమారు 12 వేలు ఉన్నట్లు స్వచ్ఛంద సంస్థల దగ్గర సమాచారం ఉంది. వీళ్ళంతా అడవిలో పోడు వ్యవసాయం చేస్తూ ఆ ప్రాంతంలోని గిరిజనేతర రైతుల దగ్గర కూలీలుగా, పారిశ్రామిక ప్రాంతాల్లో కాంట్రాక్టుల దగ్గర రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తూ నిత్యం దోపిడీకి గురవుతున్నారు. వీళ్ళను ఈ ప్రాంతాల్లో రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారు. వారుండే ప్రాంతాల్లో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. స్థానిక గిరిజనులు ఈ వలస ఆదివాసీలను చిన్నచూపు చూడటం కొంత బాధను కలిగిస్తుంది. ప్రభుత్వాలు ఈ గిరిజన తెగలను పట్టించుకున్న పాపాన పోలేదు. సుమారు 20 సంవత్సరాలుగా అడవుల్లో నివాసాలు ఏర్పటుచేసుకొని జీవిస్తున్న వారిపై అటవీ శాఖ, పోలీసులు అనేక దాడులకు పాల్పడటం పరిపాటి అయింది. అయితే ప్రభుత్వాలు వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అటుంచి, కనీసం వారు ఈ దేశ పౌరులేనన్న సోయిలేకుండా వ్యవహరించడం బాధాకరం. 75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో నేటికి జీవించే హక్కుతోపాటు విద్య, వైద్యం, కూడు, గుడ్డ అనే మౌలిక వసతులు ఈ వలస ఆదివాసీలకు ఇంకా అందని ద్రాక్షలా ఉండటం అత్యంత బాధాకరమే కాదు అవమానం కూడా.

ఈ పాపం ఎవరిది?

దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని, రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయని నేతలు చెపుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇది అబద్ధం. వలస ఆదివాసీలపై వివక్ష, వెనకబాటుతనం, ఆర్థిక అసమానతలు దేశానికి అంత మంచిదికాదు. మనదేశంలో జీవించే హక్కును కాలరాసే కొందరు అధికారులు, కొన్ని శాఖల పనితీరు కారణంగానే వారి బతుకుల్లో ఎలాంటి మార్పు ఉండటంలేదు. వారి ప్రాంతాల్లో ఉన్న చట్టాలకు తూట్లు పొడుస్తూ, సంపద అంతా దోచుకుపోయి వారిని నిరాశ్రయులను చేస్తూ అణగదొక్కుతున్నారు. బొగ్గు, ఇనుము, బాక్సైట్, గ్రానెట్‌తో పాటు ఇంకా ఎన్నో విలువైన ఖనిజాలు, అటవీ సంపద దేశంలోని అదాని, అంబాని, పోస్కో, మిట్టల్ తోపాటు బహుళజాతి కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అప్పజెప్పుతూ ఆదివాసీ చట్టాలను హేళన చేస్తున్నారు. తమ సంపద తమకే చెందాలని, అడవిపై ఆదివాసీలకే హక్కు ఉండాలని కొట్లాడుతున్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధిస్తున్నారు. అనేక చోట్ల దశాబ్దాలుగా అడవిలో ఆవాసాలు ఏర్పాటుచేసుకున్న ప్రాంతాలకు పోలీసు, అటవీ అధికారులు వెళ్ళి గుడిసెలను తగలబెట్టడం, వారిపై దాడులు చేస్తున్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును హరించివేయడం కాదా?

వెట్టి చాకిరీకి కేరాఫ్ అడ్రస్

ఆదివాసీ గ్రామాల్లో నేటికి మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉన్న వలస అదివాసీల గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. రోడ్ల నిర్మాణాలకు అడవులు అడ్డంకిగా చూపుతున్నారు కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ గ్రామాల్లో ఎవరికైనా తీవ్ర జబ్బుచేస్తే డోలీ కట్టడం, దుప్పటిలో మూటకట్టి మోసుకురావడం ఒకటే మార్గం. సకాలంలో వైద్యం అందక అనేక ప్రాణాలు గాల్లో కలిసాయి. ఇక గర్భిణీ స్త్రీల పరిస్థితి మరీ దారుణం. ప్రభుత్వ ఉచిత టీకాలు ఇక్కడ అందవు. పాఠశాలల నిర్వహణ ప్రస్థావన లేకపోవడంతో ఇక్కడి పిల్లలు పుట్టల వెంట పశువుల కాపరులుగా జీవిస్తుండటం బాధాకరం. గ్రామాలు ప్రభుత్వ లెక్కల్లో లేకపోవడంతో పిల్లలకు అంగన్‌వాడి కేంద్రాల నుండి పౌష్టికాహారం అందడం లేదు. గ్రామాలకు సరైన నీటి సౌకర్యం లేదు. విద్యుత్ సౌకర్యం లేదు. ఉపాధి లేక సొంత గ్రామాలను వదిలేసి దగ్గరలోని పారిశ్రామిక ప్రాంతాలకు, సమీపంలోని రైతుల వ్యవసాయ పనుల్లో కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఎట్టి చాకిరీకి కూడా వీరు కేరాఫ్ అడ్రస్.

స్థానికత లేకపోవడమే పెద్ద శాపం..

అయితే చత్తీస్‌ఘడ్ నుండి ఆదివాసీల వలసలు ఇప్పటివి కాదు, రెండు దశాబ్దాల నుండి ఉన్నవే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే అదివాసీలు దశాబ్ద కాలంగా అడవుల్లో నివాసం ఏర్పరుచుకొని పోడు వ్యవసాయం చేస్తున్నారు. కానీ రాష్ట్ర ఏర్పాటుకు గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వాలు ఆ రాజపత్రంలో వీరి గురించి ప్రస్తావించలేదు. దీనిపై పెద్దగా అవగాహన లేని ఆదివాసీలు తమ కులాన్ని గెజిట్లో ఉంచాలని డిమాండ్ చేయకపోవడంతో నేడు ఇదే వారి పట్ల పెద్ద శాపంగా మారింది. స్థానికత లేకపోడం, రాష్ట్ర గెజిట్‌లో వీరి కులాన్ని ప్రస్థావించకపోవడంతో వీరు ఈ రాష్ట్రంలో షెడ్యూల్ తెగల జాబితాలో లేకుండా పోయారు. దీంతో అధికారులు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు ఒప్పుకోవడంలేదు. పైగా వీరు రెండు దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేస్తున్నా వీరికి 2005 అటవీ హక్కుల చట్టం వర్తించకుండా పోయింది. అలాగే కుల ధృవీకరణ లేకపోవడంతో విద్యార్థులకు సంక్షేమ గృహాలలో స్థానం లేకుండా పోయింది. దీంతో చదువు మానేసి ఇంటివద్దనే ఉండాల్సి వస్తుంది. కొంతమంది చదివినా వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది.

ఈ ప్రాంతంలో జీవిస్తున్న వారికీ ఓట్లు లేకపోవడం వల్లనే వీరి సంక్షేమంపై అంత శ్రద్దలేదేమో అనిపిస్తుంది. కనీసం ఒక శాసనసభ స్థానాన్ని ప్రభావితం చేసే ఓట్లు ఉండివుంటే ఈ పాటికే ఏదో ఒక రాజకీయ పార్టీ వీరిని ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు కృషి చేసేదేమో. ఎస్టీ జాబితాలో వీరిని చేర్చడానికి ప్రభుత్వాలు ఎందుకు సందేహిస్తున్నాయి? వీరిని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు వీరికి అన్ని అర్హతలు ఉన్నాయి.

ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కొన్ని అభివృద్ధి చెందిన కులాలను ఓట్ల కోసం ప్రభుత్వాలు ఎస్టీ జాబితాలో చేర్చడం, ఇప్పటికే ఉన్న ఎస్టీ కులాలు వాటిని వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగటం చూస్తున్నాం. దేశంలోనే అత్యధికంగా ఆదివాసీలు నివసించే బస్తర్ ప్రాంతం నుంచి వలస వచ్చిన గిరిజనులను ఇక్కడి ప్రభుత్వాలు ఎస్టీలు కాదనడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వీరిని స్థానికంగా ఉన్న తోటి ఆదివాసీలు అక్కున చేర్చుకోవాలి. వీరి సంస్కృతి సాంప్రదాయాలకు... స్థానికంగా ఉన్న (కోయ దొరలు) సంస్కృతి సాంప్రదాయాలకు ఏమీ తేడా ఉండదు. వీరి పండగలు, ఇంటి పేర్లు, గోత్రాలు ఎక్కడా వేరుగా లేవు. వీరిని ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు, వారికి స్థానికత కల్పించేందుకు వారితో కలసి స్థానిక గిరిజనులు పోరాటాలకు సిద్ధం కావాలి. రేపు వీళ్ళకోసం వాళ్ళు, వాళ్ళ కోసం వీళ్ళు ఇచ్చిపుచ్చుకునే అనేక విషయాలు, కలసి కొట్లాడాల్సిన అనేక అంశాలు మిళితమై ఉన్నందున ఒకరికొకరు పరస్పరం సహకరించుకోవాలి. ఇప్పటికే కొన్ని ఆదివాసీ సంఘాలు జార్ఖండ్ మొదలు ఒడిస్సా వరకు ఉన్న ఆదివాసీ ప్రాంతాలను గోండ్వానా రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న ఈ తరుణంలో, జల్ జంగిల్ జమీన్ కోసం పోరాటాలు చేస్తున్న సందర్భంలో వీరి స్థానికత కోసం నిజమైన ఆదివాసీలు వలస ఆదివాసీలకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పి. క్రాంతి

జర్నలిస్టు

85019 05444

Advertisement

Next Story