హిందువులకు రక్షణ ఎవరిస్తారు?

by Ravi |   ( Updated:2024-08-16 01:15:42.0  )
హిందువులకు రక్షణ ఎవరిస్తారు?
X

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం అనేక మలుపులు తిరిగి, ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, దేశం విడిచి, భారతదేశ రక్షణలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. దేశ ప్రధాని దేశం విడిచి పారిపోవడంతో దేశంలో మతోన్మాద శక్తులు, సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాద గ్రూపులు స్వైర విహారం చేసి, మైనారిటీలైన హిందువుల మాన ప్రాణాలను హరించి వేస్తున్నాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలను, అభిమానులను దొరికిన వాళ్లను దొరికినట్లు మట్టు పెడుతూ, రాక్షసానందం పొందుతున్నాయి.

ఇస్లాం మతస్థులు మెజారిటీగా ఉన్న చోట మైనారిటీలపై దాడులు చేయడం, మానభంగాలకు గురి చేయడం సహజ పరిణామం. ఆఫ్ఘనిస్తాన్‌లో మొదటి తాలిబాన్ ప్రభుత్వం బామియాన్ బౌద్ధ విగ్రహాలను శతఘ్నులతో కూల్చివేయడం ప్రపంచమంతా చూసింది. బంగ్లాదేశ్‌లో నేడు జరిగే అమానుష చర్యలు ఇందుకు భిన్నమైనవి కాదు. 1946 డైరెక్ట్ యాక్షన్ పిలుపు మేరకు ఢాకా, నౌఖాలి ప్రాంతా లలో హిందువులపై జరిపిన నరమేధం మరిచిపోలేనిది.

అమెరికా ప్రధాన కుట్రదారు..

ఇక బంగ్లాదేశ్ పరిణామాలను విశ్లేషించేటప్పుడు బంగ్లాదేశ్ 1947 వరకు భారతదేశంలో ఒక భాగం అనే విషయం మర్చిపోకూడదు. మతం ఆధారంగా దేశ విభజన జరిగినప్పుడు ముస్లిం లీగ్ భారతదేశానికి తూర్పున కొంత భాగాన్ని పశ్చిమాన కొంత భాగాన్ని కోరింది. లీగ్ కోరిక మేరకు ముస్లిములకు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఏర్పాటు అంతా నాడు కాంగ్రెస్, కమ్యూనిస్టు, సోషలిస్టు నాయకుల సహాయ సహకారాలతో జరిగిందనే విషయం చరిత్రలో దాచలేని సత్యం. 1971 తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ రాజకీయ వర్గాల వైషమ్యాల వల్ల భారత సైనిక సహకారంతో తూర్పు పాకిస్తాన్ విడిపోయి, బంగ్లాదేశ్ పేరుతో ఒక కొత్త రాజ్యాన్ని ఏర్పరచుకున్నది. ఈ విషయంపై పాకిస్తాన్‌తో మన సైన్యం యుద్ధం చేసి, అనేకమంది సైనికులను కోల్పోవలసి వచ్చింది. మన పైన యుద్ధానికి దిగిన పాకిస్తాన్‌కు అమెరికా అనేక విధాలుగా వెన్నుదన్నుగా నిలిచిందనే విషయం భారతదేశంలో నేటి యువతకు తెలియదు. భారత్‌ను రక్షణ పరంగా, ఆర్థిక పరంగా బలహీన పరచడానికి అమెరికా అనేక కుట్రలను, కుతంత్రాలను, రక్షణ వ్యూహాలను అమలు చేస్తోంది. నేడు బంగ్లాదేశ్‌లో సంక్షోభం నెలకొనడానికి అమెరికా ప్రధాన కుట్రదారు అనే విషయం తేట తెల్లమైంది.

ముందస్తు ప్రణాళికతోనే తిరుగుబాటు..

రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం పేరుతో విద్యార్థులను రెచ్చగొట్టి, ప్రధానమంత్రిని బలవంతంగా రాజీనామా చేయించి, దేశం పారిపోయే విధంగా చేసి, తన రక్షణలో ఉన్న మహమ్మద్ యూనస్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా అధికార పీఠంపై కూర్చో బెట్టడం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత రాజీనామా చేయించడం, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌ను ఉన్నఫళంగా రాజీనామా చేయించచడం వంటి సంఘటనలు మామూలు విషయాలు కాదు. మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సెయింట్ మార్టిన్స్ ద్వీపాన్ని అమెరికా తన స్థావరంగా చేసుకోవడానికి అడిగినట్లు, ఇందుకు తాను అంగీకరించలేదని, తన దేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు రావడానికి కారణం ఇదేనని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేల్చిన బాంబులోని వాస్తవం ఎంతో భవిష్యత్తు తేలుస్తుంది. బంగ్లాదేశ్‌లో నేడు జరుగుతున్న పరిణామాలు అన్నిటికీ ఒక ముందస్తు ప్రణాళిక ఉంది.

భారత ప్రభుత్వం పసిగట్టలేదా?

తన దేశంలో ఒకప్పుడు భాగమైన తన పక్క దేశంలో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం పసిగట్టలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బంగ్లాదేశ్‌లో సంక్షోభం అక్కడ నివసిస్తున్న హిందువులకు మరణ శాసనంగా మారుతుందని ప్రభుత్వాన్ని నడిపే బీజేపీ నాయకులకు బాగా తెలుసు. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం ముందస్తు చర్యలను ఎందుకు తీసుకోలేదో కారణాలు స్పష్టమే. 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనసంఘ్ పూర్తి సహాయ సహకారాలు అందించి, తన కార్య కర్తలను సైన్యానికి సహాయ సహకారాలు అందించడానికి నిలబెట్టి, నిబద్ధతను చాటుకున్నది. పుల్వామా దాడి తర్వాత మన సైన్యం జరిపిన సర్జికల్ దాడులపై కాంగ్రెస్ నాయకులు అవహేళనగా మాట్లాడిన విషయం దేశ ప్రజలకు తెలుసు. ఇలాంటి మానసిక స్థితి ఉన్న కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, బంగ్లా దేశ్‌లోని హిందువుల రక్షణార్థం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతుందా? బంగ్లాదేశ్ పరిణామాలను గొప్ప మలుపుగా మన దేశంలోని కమ్యూనిస్టు నాయకులు వ్యాఖ్యానించడం బట్టి చూస్తే వారు హిందువులకు ఎంత వ్యతిరేకులో స్పష్టం అవుతుంది.

హిందువులపై మారణకాండ...

బంగ్లాదేశ్‌లో హిందువులు ఎదుర్కొంటున్న అమానుష కృత్యాల నుండి బయటపడడానికి వేల మంది హిందువులు పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల సరిహద్దుల వద్ద భారతదేశంలోకి ప్రవేశించడానికి సన్నద్ధమవుతున్నారు. బిఎస్ఎఫ్ దళాలు వారిని భారతదేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. బంగ్లాదేశ్ సంక్షోభంతో సరిహద్దుల్లో పరిస్థితి అతి భయానకంగా ఉంది. పాలస్తీనా కోసం ర్యాలీలు, ధర్నాలు చేసిన మన నాయకులు, మన సెలబ్రిటీలు బంగ్లాదేశ్ పరిస్థితి గురించి నోరు మెదపకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది వారి వక్రబుద్ధిని, హిందూ వ్యతిరేకతను స్పష్టీకరించింది. కుస్తీ యోధురాలు వినేష్ పొగట్‌కు పారిస్ ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం రాలేదని పార్లమెంట్‌లో రచ్చచేసిన మన పార్లమెంట్ సభ్యులకు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న మారణహోమంపై మాట్లాడడానికి సమయం దొరకలేదంటే... వీరి మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. బంగ్లాదేశ్ పరిణామాలను, హిందువులు ఎదుర్కొంటున్న దాడుల గురించి సమాచారాన్ని సేకరిస్తూ, ఆ దేశ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటూ, భారత ప్రభుత్వం ముందుకి వెళ్లవలసిన అవసరం ఉంది. హిందువుల మాన ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి, వ్యూహాత్మక చర్యలను చేపట్టడానికి దేశంలోని యువత మద్దతును కూడగట్టవలసిన అవసరం ఉంది.

-ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Advertisement

Next Story

Most Viewed