పర్యావరణం:పోడు గోడు వినేదెవరు?

by Ravi |   ( Updated:2022-09-03 18:21:22.0  )
పర్యావరణం:పోడు గోడు వినేదెవరు?
X

ర్యావరణ విధ్వంసంలో అడవుల నరికివేతే కీలకంగా మారింది. ఇబ్బడి ముబ్బడిగా లాభాలను సంపాదించి పెట్టే తగరం, రాగి, జింక్, ఇనుము, వజ్రాలు, మైకా, మాంగనీస్, బైరైటీస్, బొగ్గు తదితర ఖనిజాల తవ్వకాల కోసం వేలాది ఎకరాల దట్టమైన అడవులను ప్రయివేటు కంపెనీలు యథేచ్ఛగా నరికివేస్తున్నాయి. ప్రభుత్వ విధానాల ఫలితంగా అడవులు గణనీయంగా అంతరించిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, అడవిని తల్లిగా భావించి తేనె, బంక, ఇప్ప పువ్వు, వంట చెరుకు లాంటి అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడి బతికే ఆదివాసీలు మాత్రం అడవిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఖాళీ ప్రదేశాలలో తమకు జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలలాంటి తృణ ధాన్యాలు పండించుకుంటూ పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు.

గిరిజనులు అడవిని చూసుకున్నంత వరకు అంతా సజావుగా ఉంది. పోడు వ్యవసాయం చేసేవారికి హక్కులు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడంతో గిరిజనేతరుల జోక్యం ఎక్కువైంది. దాంతో అడవుల నరికివేత భారీగా పెరిగింది. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో గిరిజనేతరులకు రెవెన్యూ అధికారులు అటవీ శాఖ అధికారులకు తెలియకుండా రిజర్వ్ ఫారెస్ట్‌లో పట్టాలు జారీ చేశారు. 1907లో నిజాం మొట్ట మొదట తన సంస్థానంలోని అడవులలో గిరిజనులకు పోడు వ్యవసాయం చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. అంటే తెలంగాణ నేలమీద 115 సంవత్సరాల క్రితమే పోడు సేద్యం ప్రారంభమైంది.

అధికారుల మధ్య సమన్వయ లోపం

నిజానికి రెవెన్యూ అధికారులు, అటవీ అధికారులు కలిసి సమన్వయంతో తగిన విచారణ జరిపిన తరువాతే గిరిజనులకు భూహక్కులను మంజూరు చేయాలి. పోడు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న భూమి రెవెన్యూదా? అటవీశాఖకు చెందినదా? తేల్చి సెక్షన్ 15 ప్రకారం వివాదాన్ని పరిష్కరించాలి. ప్రొహిబిటరీ ఆర్డర్స్ బుక్ లో (POB) సదరు భూమి యజమానుల వివరాలను నమోదు చేసి ఫైనల్ నోటీస్ ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. ఆ తరువాత ఆ భూమి మీద హక్కులు కల్పించాలి.

కానీ, ఇవేమి జరగకుండా గిరిజనేతరులకు, రాజకీయ బినామీలకు రెవెన్యూ అధికారులు హక్కులు ఇవ్వడం అటవీ అధికారులకు విస్మయాన్ని గురిచేస్తున్నది. ఇప్పటికే లక్ష ఎకరాలకు మించి అటవీ భూముల హక్కులను అర్హత లేనివారు పొందగలిగారని అటవీ అధికారులు చెబుతున్నారు. రిజర్వ్ అడవుల మధ్యలో రెవెన్యూ పట్టాలు ఎలా జారీ చేశారో తమకే అర్థం కావడం లేదని అంటున్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల వరకు ఉన్న అడవులలో ఇదివరకే ఎనిమిది లక్షల ఎకరాలు కబ్జాలతో కనుమరుగయ్యాయి. మరో పది లక్షల ఎకరాల అడవులు అక్రమార్కుల చెరలోనే ఉన్నాయి.

కదలని కమిటీ

పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు గత డిసెంబర్‌లో కమిటీ వేశారు. సమగ్ర సర్వే ద్వారా పోడు భూములను, హక్కుదారులను గుర్తించి అర్హులందరికీ పట్టాలు జారీ చేస్తామని ప్రకటించారు. నేటికీ ఏ సర్వే జరగక పోడు భూముల సమస్య 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందంగా ఉంది. గిరిజనులు స్థానిక నేతలను కలిసినపుడు 'ప్రభుత్వం ఇవ్వదలచింది కానీ, అటవీ చట్టం అడ్డం వస్తున్నదని' గిరిజనులు అటవీ అధికారులపై దాడి చేసేలా రెచ్చగొడుతున్నారు.

దీంతో ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలలోని అడవులలో పోడు రైతులు, అటవీశాఖాధికారుల మధ్య ప్రత్యక్ష యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. రెండేండ్ల క్రితం ఆసిఫాబాద్ సారసాలో జరిగిన సంఘటన.ఊట్పల్లి గ్రామంలో ఎనిమిది నెలల గర్భవతి అయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌పై కర్రలతో జరిగిన దాడి ఇందుకు నిదర్శనం. అధికారుల మీద అభాండాలు వేసిన నాయకులు అధికారిదే తప్పు అని ప్రచారం చేశారు. అదే నిజమైతే సదరు అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?

శాశ్వత పరిష్కారం చేయాలి

రెవెన్యూ- అటవీ శాఖల మధ్య సమన్వయ లోపం శాపంగా మారింది. పోడు భూములపై హక్కుల కోసం పోరాడుతున్న ప్రజలు, రిజర్వ్ ఫారెస్ట్ రక్షణ కోసం అంకితభావంతో కృషి చేస్తున్న అటవీ అధికారులకు మధ్య ఘర్షణ ఏర్పడడం బాధాకరం. గిరిజనుల, గిరిజనేతరుల సామూహిక దాడులు, పోలీసుల లాఠీ చార్జీలు, కేసులతో పల్లెల్లో శాంతియుత జీవనానికి భంగం కలుగుతుండటం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి మాట ఇచ్చినట్లు పోడు భూముల హక్కులలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలి. నిజమైన అడవి బిడ్డలకు మాత్రమే తొందరగా పట్టాలు అందించాలి. హక్కుల వివాదాలు శాశ్వతంగా పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులకు, బినామీలకు పోడు భూములు కేటాయిస్తే అది మానవ మనుగడకే కాదు, సకల జీవ జాతుల మనుగడకూ ప్రమాదకరమని గుర్తించాలి.

నీలం సంపత్

సామాజిక కార్యకర్త

98667 67471

Advertisement

Next Story