నోటాకు ప్రాధాన్యత ఎక్కడ?

by Ravi |   ( Updated:2023-10-15 00:15:59.0  )
నోటాకు ప్రాధాన్యత ఎక్కడ?
X

ప్రజాస్వామ్య భారతదేశంలో పాలకులను ఎన్నుకునే విధానం, ప్రజలందరికీ సమాన ఓటు హక్కును డా. బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించారు. అలా దేశ ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకొని ప్రజా పాలన అందించడానికి పాలకులను ఎన్నుకుంటారు. ఈ విధానంలో మొన్న 75 ఏళ్ల అమృతోత్సవాలు జరుపుకున్నాము. కానీ నేడు ఎన్నికల్లో ధన ప్రభావంపై, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగం పై అనేక ధర్మ సందేహాలు వెలువడుతున్నాయి. అలాంటి వాటిలో ఎన్నికల విధానంలో ఓటు హక్కుగా నోటాను ప్రవేశపెట్టిన సుమారు దశాబ్ద కాలం తర్వాత దాని ప్రభావం తగ్గుతున్న తీరు ఆందోళనకరం. కాబట్టి ప్రజాస్వామ్యంలోని పార్టీల చిత్తశుద్ధి, ఎన్నికల విధానంలో లోపాలను, న్యాయపరమైన చిక్కులను పరిష్కరించుకొని ముందడుగు వేయాల్సి వుంది.. `

గోప్యత దెబ్బతినడంతో..

ఓటర్లు నోటాను వినియోగించుకునేందుకు వీలుగా 'నన్ ఆఫ్ ది ఎబౌ' ఎంపిక కోసం ECI ప్రత్యేక గుర్తును ప్రవేశపెట్టింది. NOTA ను పోటీ చేసే అభ్యర్థులందరికీ తిరస్కరణ ఓటును అధికారికంగా నమోదు చేయడానికి ఓటరును అనుమతించే ఎంపిక. ఓటరు నోటాను ఎంచుకుంటే, ఆ ఓటరు ఏ పార్టీకి ఓటు వేయలేదని సూచిస్తుంది. 2013 సెప్టెంబరు 27న, ఎన్నికల్లో పైన ఏదీ లేదు ఓటును నమోదు చేసుకునే హక్కును వర్తింపజేయాలని భారత సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అదే సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలలో బటన్‌ను పొందుపరచాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. మనతో పాటుగా నోటాను కొలంబియా, ఉక్రెయిన్, బ్రెజిల్, బంగ్లాదేశ్, ఫిన్లాండ్, స్పెయిన్, స్వీడన్, ఫ్రాన్స్ తదితర దేశాలు అనుమతిస్తున్నాయి.

దీనిని వినియోగించుకునేందుకు ‘నోటా’ను ప్రవేశపెట్టింది. ఈ గుర్తు అన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో (EVMలు) చివరి ప్యానెల్‌లో కనిపిస్తుంది. 'నోటా' ఎంపిక ప్రధాన లక్ష్యం ఏమిటంటే, అభ్యర్థులెవరికీ ఓటు వేయకూడదనుకునే ఓటర్లు తమ నిర్ణయం యొక్క గోప్యతను ఉల్లంఘించకుండా తిరస్కరించే హక్కును వినియోగించుకునేలా చేయడం. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటు వేయడానికి అర్హులు కాదని భావించినట్లయితే, ఓటరు తప్పనిసరిగా తిరస్కరణ ఓటును నమోదు చేయడానికి అర్హత కలిగి ఉండాలి. గతంలో EVMలను ప్రవేశపెట్టడానికి ముందు, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరిగినప్పుడు, ఓటర్లు ఏ అభ్యర్థి ఎదురుగా బ్యాలెట్ గుర్తును వేయనప్పుడు అభ్యర్థులందరినీ తిరస్కరించినట్టుగా భావించి ఆ ఓటును నోటాగా లెక్కించారు. అయితే ఇది బ్యాలెట్ గోప్యతను దెబ్బతీసింది. ఎన్నికల నియమావళి ప్రకారం, 1961 నియమం 49-O ప్రకారం “ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న ఓటర్. ఫారమ్ 17 Aలో ఓటర్ల నమోదులో తన ఎలక్టోరల్ రోల్ నెంబర్ నమోదు చేసి ప్రతికూల ఓటు వేయవచ్చు. ప్రిసైడింగ్ అధికారి ఫారం 17 ఎలో పేర్కొన్న ఓటరు సంతకం లేదా బొటనవేలు ముద్రను పొందాలి. ఈవీఎంలను ప్రవేశపెట్టిన తర్వాత, ఇకపై ఫారం 49-ఓ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిసైడింగ్ అధికారి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.

పరిగణలోకి తీసుకోకపోవడంతో..

ఈ ఆప్షన్ వచ్చాక కూడా వివిధ రాజకీయ పార్టీల వారు మచ్చలేని అభ్యర్థులను బరిలో నిలిపే విషయంలో ఎటువంటి కట్టుదిట్టమైన నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదు. గెలుపు గుర్రాల పేరుతో అన్ని విధాల బలవంతులకే అన్ని పార్టీలు కూడా టికెట్లు ఇస్తున్న తీరును చూస్తున్నాం. అలాగే ఓటర్లు అభ్యర్థులను తిరస్కరించే నోటా(NOTA)కు ఎక్కువ ఓట్లు వేసిన పక్షంలో ఆ ప్రాతినిధ్య నియోజకవర్గంలో ఆ తర్వాత స్థానంలో ఓట్లు పొందిన (వచ్చిన) అభ్యర్థిని గెలిచినట్లేనని తెలుస్తోంది!. ఇలా నోటా ఓట్లను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఓటర్లలో నోటాకు ఓటు వేయాలనే ఆసక్తి తగ్గిపోతుంది. నోటా ఓటు ప్రవేశపెట్టిన తర్వాత సుమారు దశాబ్ద కాలంలో అనేక ధర్మ సందేహాలు, అనుమానాలు, పరిష్కారం లేని సమస్యలు ఉద్భవించడంతో క్రమ క్రమేణా నోటా NOTA ఓటు ప్రాధాన్యత తగ్గిపోవడం, దాని ప్రభావం ఓటర్లపై చూపకపోవడం కనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఓటు ప్రాధాన్యతను ప్రచారం చేస్తున్న మాదిరిగానే నోటా ఓటు గురించిన ప్రచారం, చైతన్యం ముమ్మరంగా చేయాల్సి ఉంది. మరోవైపు దీనికి ప్రత్యామ్నాయంగా తప్పనిసరి ఓటింగ్‌ను ప్రవేశపెట్టిడం,ప్రతికూల ఓటును వేయించడం లాంటి వాటితో పోలింగ్ శాతం పెరుగుతుంది. ఇది వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమైన,ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి తోడ్పడుతుంది..ఇప్పటికైనా ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం, న్యాయశాఖ ఈ నోటా ఓటు ప్రభావం క్రమ క్రమంగా తగ్గుతున్న తీరుపై చర్చించి ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చి న్యాయపరమైన చిక్కు లేకుండా నోటాకు స్వయంప్రతిపత్తిని, ఓటు వినియోగ హక్కును పరిరక్షిస్తూ పరిష్కార మార్గాలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రిగ్గింగ్, దొంగ ఓట్లను కట్టు దిట్టమైన నిఘాతో నివారిస్తూ, ఓటర్లలో చాలెంజ్, టెండర్ ఓట్ల ప్రాధ్యానత, అవగాహన, చైతన్యం కలిగించాలి.

మేకిరి దామోదర్,

సామాజిక విశ్లేషకులు,

95736 66650

Advertisement

Next Story