- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలుగు సినిమా గమనం ఎటువైపు?
చిత్రోత్సవాలు ముఖ్యంగా యువతని ప్రభావితం చేస్తాయి. తాము కూడా అంత గొప్ప సినిమాలు తీసి తెలుగు వెలుగుని ప్రపంచమంతా ప్రసరింపజేయాలని కలలు కంటారు. మన తెలుగు రాజ్యాధినేతలకి ఆ కలల మీద నమ్మకం లేదు. మాభూమి, దాసీ, శంకరాభరణం, సీతాకళ్యాణం లాంటి సినిమాలకి అంతర్జాతీయంగా కొంత గుర్తింపు లభించింది. గానీ, తెలుగు యువతరం మీద అలాంటి సినిమాలే తియ్యాలి అన్నంత ప్రభావం కనిపించలేదు. అంతర్జాతీయ స్థాయి అనగానే చాలామంది 'బాహుబలి' వైపు చూపిస్తారు. నిజమే! ఏ తెలుగు సినిమా సాధించని గౌరవాన్ని జాతీయ స్థాయిలో బాహుబలి సాధించింది. చాలామంది తెలుగు దర్శకులు హిందీలో సినిమాలు చేశారు. అలాగే తమిళ, మలయాళీ, కన్నడ, బెంగాలీ, దర్శకులు హిందీ సినిమాలకి దర్శకత్వం వహించారు. పేరు ' తెచ్చుకున్నారు. కానీ తమ భాషలో తీసిన సినిమాతో దేశమంతటా పేరు తెచ్చుకున్న తెలుగు సినిమాలు రెండే రెండు. ఒకటి కె.విశ్వనాథ్ 'శంకరాభరణం', రెండవది రాజమౌళి 'బాహుబలి' ఈ రెండు సినిమాలు మొత్తం ఇండియన్ సినిమా వులిక్కి పడేట్టు చేశాయి. వసూళ్ళలో బాహుబలి దేశమంతటికీ ప్రథమ స్థానంలో నిలబడింది. ఇది కూడా చరిత్రే కానీ వ్యాపారాత్మక సినిమాలకి కొత్త పోకడలూ, సూత్రాలూ చూపించింది గానీ, సామాన్య మానవుడి జీవన విధానానికి, మానవతా విలువలు పెంచటానికి ఉదాహరణగా నిలబడలేకపోయింది..
వినోదమా, విజ్ఞానమా.. తెగని వాదన
తెలుగు సినిమా రంగంలో ఒక వాదన విరివిగా వినిపిస్తోంది. ప్రేక్షకులకు కావాల్సింది విజ్ఞానం కాదు, వినోదం మాత్రమే. రోజంతా కష్టపడి అలసిన మనిషికి, మద్యం మత్తెక్కించి హాయిగా నిద్రపోయేలా చేసి, తన బాధ్యత తీర్చుకున్నట్టుగా, తెలుగు సినిమా కూడా ఓ రెండు గంటల పాటు నవ్వించి, వుద్రేక పరిచి, గంతులు వేయించి, కేకలు పెట్టించి, ఏదో సాదించేశాం అన్ని భావన కలిగించి తృప్తిపరుస్తోంది. ఈ విధంగా తన బాధ్యతని తీర్చుకుంటున్నప్పుడు.. తెలుగు సినిమా గమనం.. సరైన దారిలోనే సాగుతోంది అని, నిర్ధారణకి వచ్చేయొచ్చా! ఆలోచించండి. మళ్లీ వెనక్కి వెళ్లాం. భాష కూడా యింకా ప్రజల హావభావాల్ని వ్యక్తీకరించే స్థాయికి చేరకముందే, రాళ్ల మీద రాతి మొనతో బొమ్మలు వేస్తూ, మనిషి తన మనసులో మెదిలే భావాన్నీ, ఆలోచననీ, అంతరంగాన్నీ, ఊహనీ, కళాత్మకతనీ ప్రదర్శించటానికి ప్రయత్నించాడని అంటారు. అక్కణ్ణుంచి క్రమేపీ వృద్ధి చెందుతూ, నాటక ప్రక్రియగా పరిపూర్ణత సాధించిన రోజుల్లో, సినిమా పుట్టింది. తెర మీద కదులాడే బొమ్మలని చూసిన మనిషికి ఆ సాంకేతికతతో కథలు చెప్పాలనిపించింది. ఏ నాటకాలనయితే రంగస్థలం మీద చూస్తూ ఆనందించాడో, దాన్ని తెర మీద బొమ్మలతో ప్రదర్శించి చూడాలని ప్రయత్నించాడు.
సినిమా ప్రభావం అనంతం
సినిమాలతో కథలు చెప్పే స్థాయికి మనిషి చేరుకున్న రోజుల్లో మన దేశం ఆంగ్లేయుల పరిపాలనలో వుంది. స్వతంత్ర పోరాటం మంచి వూపులో వుంది, రచయితలూ, నటులూ, గాయకులూ, యితర కళాకారులు దేశభక్తి స్పందనతో తమ కళాత్మకతని ప్రదర్శించటానికి శ్రమిస్తూవుండేవారు. కేవలం వినోదం కోసం తయారయిన నాటకాల్లో కూడా సమాజానికి మేలు చేసే దిశగానే సాగుతుండేవి. మంచిని పెంచాలనీ, ధర్మాన్ని పాటించాలనీ, నిజాయితీగా మెలగాలనీ అత్యధిక శాతం ప్రదర్శనలు తయారవుతూ వుండేవి. అవే కథలూ, పాటలూ, సన్నివేశాలూ, సినిమాలుగా తెర మీదకి పయనించాయి. నాటకాలు ప్రజల బలహీనతల్ని వుద్రేకపరిచే విధంగా అంతగా వుండేవి కావు. జమీందారులు, భూస్వాముల వ్యక్తిగత విలాసాలని వుదాహరణలుగా తీసుకోవటం లేదు. నా విశ్లేషణ పూర్తిగా సామాన్య ప్రజానీకానికి పరిమితం చేస్తున్నాను. కారణం యీ రోజున ఆ ప్రజల మీద అత్యంత ప్రభావం చూపించే మాధ్యమం సినిమాయే. కాబట్టి మనం 95% ప్రజల గురించే ఆలోచిద్దాం.
పరాయి పాలనలో స్వతంత్ర్యం కోసం పోరాటం జరుగుతున్న రోజుల్లో, తరువాత స్వతంత్య్రం వచ్చిన రోజుల దగ్గరనుండి యిప్పటి వరకు తెలుగు సినిమా గమనం ఏ విధంగా సాగింది, అది సామాన్య ప్రేక్షకుడి అంతరంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తూ సాగిందో... సాగుతోందో పరిశీలిద్దాం. రచన లేనిదీ నాటకం లేదు, సినిమా లేదు. కానీ రచయిత, నేపద్య గాయకులు, సంగీత దర్శకులూ, సాంకేతిక నిపుణులూ... ఎవ్వరూ కూడా ప్రేక్షకులకి ప్రత్యేకంగా తమ కళని ప్రదర్శిస్తూ కనిపించరు. కేవలం నటులు మాత్రమే కనిపిస్తారు. నాటక ప్రదర్శనలో నటుల కన్నా, సినిమా తెర మీద నటులు చాలా పెద్దగా కనిపిస్తారు. క్లోజప్‌లో అయితే నటుని మొహం ప్రేక్షకుడికి సుమారు 35 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. నటుల హావభావాలు ప్రేక్షకుల గుండెల్లో బలంగా నాటుకుంటాయి.
సినిమాకు లెనిన్ నిర్వచనం
అందుకనే కాబోలు రష్యన్ విప్లవ అధినేత లెనిన్ '..that of all the arts the most important for us is the cinema..' (కళారూపాలన్నింటిలోనూ మనకి అత్యంత ముఖ్యమయినది సినిమా) అని ప్రకటించాడు. ఆ ప్రభావం కారణంగానే ప్రేక్షకుడు సినిమా నటులకి ఒక ఆత్మీయుడిలా, కనెక్ట్ అయిపోతాడు. ప్రేక్షకుల మీద నటుల ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది. దేశభక్తిని ప్రబోధించిన కొన్ని సినిమాలని, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నాయన్న నెపంతో ఆంగ్లేయులు నిషేధించారు, లేదా కొన్ని భాగాలని తొలగించారు. ప్రజల మీదా, సమాజం మీద సినిమాల ప్రభావం అసలు వుంటుందా అన్న వాదన కూడా వుంది. ప్రభావం ఉండదు అని నొక్కి వక్కాణించేవారు లేకపోలేదు. ఇలా మాట్లాడే వారు సాధారణంగా, కేవలం వ్యాపారంగా చేసుకుని లాభాల కోసమే సినిమాలని నిర్మించేవాళ్లు. అటువంటి సినిమాలతోనే తమ జీవనభృతినీ, పేరు ప్రతిష్టలని సంపాదించుకునే నటీనటులు, రచయితలూ, సాంకేతిక నిపుణులు, సంగీతదర్శకులు కూడా సినిమాల కారణంగానే. ఎన్నో ఘోరాలూ, అవాంఛనీయ సంఘటనలూ జరుగుతున్నాయని విమర్శించే వారి సంఖ్య తక్కువ. సామాన్య ప్రజానీకానికీ, ప్రేక్షకులకి యీ వాదనలు పట్టవు మనస్తత్వ శాస్త్రజ్ఞులు, పరిశోధకులు యీ రెండు వాదనలకీ మధ్యస్థంగా సినిమాల ప్రభావం వుంటుంది గానీ అది కొంతవరకే కానీ... సాంఘిక పరిస్థితులు, నియమాలు ఎక్కువ ప్రభావాన్ని కలిగిస్తాయి అని అంటుంటారు.
ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవటమే పతనం
గమనం అన్నది ఒక స్ఫూర్తితో సాగుతూ ఉంటుంది సినిమా గమనం ప్రేక్షకుల అభిరుచి, ఆలోచనలకి అనుగుణంగా వుంటుంది. ఆంగ్లంలో ఒక సామెత వుంది. People get what they deserve and People deserve what they get అని. ఈ సామెతని తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు అంగీకరిస్తారు? వ్యతిరేకించగలరా? గమనం ఎల్లవేళలా ఒక ధ్యేయాన్ని అనుసరించి వుంటుంది. నూటికి తొంభై శాతం సినిమాలు ఏ ధ్యేయంతో ముందుకు సాగాయో చూద్దాం. స్వాతంత్య్ర్యం రాకముందు, ప్రజల్లో దేశభక్తిని ప్రబోధించటమే ప్రధాన లక్ష్యంగా సాగాయి. స్వతంత్య్రం వచ్చిన తరువాత మన సినిమాలు వినోదాన్ని పంచుతూనే, మానవత్వానికి, నిజాయితీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి. నిర్మాత దర్శకులు, రచయితలూ, ఆ ధ్యేయం తోనే సాగారు. వారంతా కళారాధన వైపు మొగ్గు చూపారు. కాలక్రమేణా ప్రేక్షకుల మీద సినిమా నటీనటుల ప్రభావం నిర్మాతలు తెలుసుకోసాగారు. ఆ ఇమేజ్‌ని క్యాష్ చేసుకోవటం, వ్యాపార ధర్మంగా కనిపించింది. హీరోయిన్ల కన్నా హీరోల ప్రాధాన్యత, పెరిగింది. హీరో వర్షిప్ అన్నది మనం చూస్తుండగానే, మొత్తం తెలుగు సినిమా పరిశ్రమని శాసించటం మొదలు పెట్టింది. అయినా కళాత్మకతకీ, సామాజిక చైతన్యానికీ, సాంఘిక బాధ్యతకీ విలువనిచ్చే, కొంతమంది దర్శకులూ, రచయితలూ, నిర్మాతలు కూడా తమకి సాధ్యమయినంతవరకు ఆ విధమైన సినిమాలు తీశారు గానీ యీ మాస్ మసాలా సినిమాని అదిగమించలేకపోయారు.
బలహీనతల్ని రెచ్చగొట్టే మత్తుమందు
నేను కావాలనే సినిమాల పేర్లనీ, వ్యక్తుల్నీ ఉదహరించటం లేదు. అలా ఉదహరించటం సబబు కాదు. ఇది ఏ ఒక్క వ్యక్తీ నిర్దేశించినది కాదు. కమర్షియల్ సినిమా అన్నది పరుగులు తీస్తున్న జగన్నాథ రధం లాంటిది. దాన్ని లాగుతున్నది హీరోయిజమ్‌కి వుత్తేజితులయి పోతున్న సామాన్య శ్రామిక ప్రజానీకం. ఉత్తేజపరుస్తున్నది. కమర్షియల్ సినిమా మేధావులు. ఇలాంటి సినిమాల వల్ల తమకి మంచి జరుగుతోందా, మోసం జరుగుతోందా అని చదువుకున్న మధ్య తరగతి వారే ఆలోచించనప్పుడు, ఆ పేదవారిని తప్పు పట్టలేం.. బలహీనతల్ని రెచ్చగొట్టే మత్తు మందు ముందు ఏదీ నిలబడదు. ఈ వ్యాపారంలో పోటీ విపరీతంగా వుంటుంది. ఏ కథ వల్ల తన యిమేజీ పెరుగుతుందో, అదే కథని హీరో ఒకే చేస్తాడు. కనుక ఆ ఇమేజ్ పెంచే ప్రయత్నమే కమర్షియల్ సినిమా రచయితలదీ, దర్శకులదీ. ఆగివున్న రైలు బండి కదలటానికి డ్రైవరు అక్కర్లేదు. యింజను మీద నిలబడి హీరో చెయ్యెత్తి చూపుడు వేలితో చూపిస్తే చాలు, రైలు బండి కదులుతుంది. దానికి సైన్సుతో పనిలేదు. సెన్సారు కూడా అభ్యంతరం చెప్పదు.. ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. హీరో డాక్టరవనీ, లాయరవనీ, రాజకీయ నాయకుడవనీ, ముఖ్య మంత్రి అవ్వనీ, పర్యావరణ రక్షకుడు అయినా, చదువులు చెప్పే మాస్టరయినా, సైంటిస్టయినా, గుడిలో పూజారయినా, పేదల పాలిటి పెన్నిధి అయినా... ప్రధానంగా హీరోకి తప్పనిసరిగా వుండి తీరాల్సిన లక్షణం.... ఏ గూండాకీ లేనంత శారీరక బలం. ఎంతమందినయినా మట్టి కరిపించగల నేర్పు Fighting... fighting... fighting. అంతే.
ఇలాంటి సినిమాల విజయమే. నేడు మన తెలుగు సినిమాల గమనం. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా! నిజం మరచి నిదురపోకుమా! అన్న శ్రీశ్రీ హెచ్చరిక పాట గానే మిగిలిపోయింది. మత్తు మందు సేవించి, సేవించి మనిషి ఆరోగ్యం పాడు చేసుకున్నట్టే, పలాయన వాదాన్ని స్లో పోయిజన్‌లా బుర్రలోకెక్కించే యీ సినిమాలతో సమాజం పురోగతి ప్రశ్నార్ధకంగా మిగిలిపోతుంది. పుట్టిన ప్రతి బిడ్డకీ విద్యా, విజ్ఞానం సమాజమే యిచ్చి తీరాలి అని కఠినమైన నిర్ణయం తీసుకుని సాధించేంత వరకు సినిమాల గమనం యిలానే వుంటుంది.
(ముగింపు వ్యాసం)
- కె.ఎల్. ప్రసాద్
సినీ దర్శకులు, రచయిత
93910 25341