వైద్య విద్యార్థులకు భరోసా ఏది?

by Ravi |   ( Updated:2022-09-03 14:50:06.0  )
వైద్య విద్యార్థులకు భరోసా ఏది?
X

రోగ్యవంత సమాజం కోసం డాక్టర్లు అహర్నిశలు పాటుపడతారు. డాక్టర్‌గా స్థిరపడాలంటే జీవితమంతా కష్టపడాలి. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చదివి ఉన్నత ర్యాంకులు తెచ్చుకుని విద్యార్థులు డాక్టర్లుగా మారుతారు. పండుగలు, కుటుంబసభ్యులను దూరంగా ఉంచి వృత్తినే పరమావధిగా భావిస్తారు. క్షణం తీరిక లేకుండా సహనంతో సమాజానికి సేవలు చేస్తారు. అటువంటి వైద్య విద్యార్థులకు సమాజం, ప్రభుత్వం అన్ని విధాలా సహకరించాలి.

వారి నిర్లక్ష్యంతోనే

జాతీయ వైద్య విద్యా విధానం, జాతీయ మెడికల్ కమిషన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య విశ్వవిద్యాలయాలు తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించకపోవడంతో వైద్య విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. మూడు ప్రైవేటు కాలేజీలను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ఇటీవల ఎన్‌ఎం‌సీ (నేషనల్ మెడికల్ కౌన్సిల్) 450 ఎంబీబీఎస్, 70 పీజీ సీట్లను రద్దు చేసింది. దీంతో లక్షలాది రూపాయలు చెల్లించి కాలేజీలలో చేరిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆయా కాలేజీలకు అనుమతులు ఇచ్చి, కౌన్సిలింగ్ పూర్తి అయిన నెల రోజులకే వసతులు లేవని అడ్మిషన్లను రద్దు చేయడం ఆశ్చర్యకరం. రాష్ట్రంలో ఉన్న ఎన్నో మెడికల్ కాలేజీలకు అధ్యాపకుల కొరత వేధిస్తోంది.

కమిషన్ మార్గదర్శకాల ప్రకారం 100 ఎంబీబీఎస్ సీట్లకు 104 మంది అధ్యాపకులు ఉండాలి. 150 మంది అయితే 116 మంది, 200 సీట్లు అయితే 142 మంది, 250 సీట్లు ఉంటే 159 మంది ప్రొఫెసర్లు ఉండాలి. వీటికి అదనంగా ఒక్క కాలేజీలో 32 మంది ట్యూటర్లు , 35 మంది సీనియర్ రెసిడెంట్ వైద్యులు అవసరమని నిబంధనలు చెబుతున్నాయి. 22 విభాగాలు ఉండే కళాశాలలో నాన్ క్లినికల్ సంబంధించి అనాటమీ, బయో కెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ సైన్సెస్ విభాగాలలో, క్లినికల్ విభాగంలో రేడియాలజీ, డెర్మటాలజీ ప్రొఫెసర్ల కొరత ఎక్కువగా ఉంది. కళాశాలలు శాశ్వత ప్రాతిపదికన 40 శాతం బోధకులనే నియమించుకుంటున్నాయి. మిగతా వారిని తనిఖీల సందర్భంగా బయట నుంచి తెచ్చుకుంటున్నారు. ఆకస్మాత్తుగా తనిఖీలు జరిగినప్పుడు ఈ విషయం వెలుగులోకి వస్తోంది. మౌలిక సదుపాయాలను ముందే పరిశీలించి అనుమతి ఇవ్వాల్సిన కమిషన్ నెల రోజుల తర్వాత రద్దు చేయడం విచారకరం.

విధివిధానాల లోపంతో

మే 19న రద్దయిన సీట్లను మెరిట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయాలని చూసినా, ఎన్‌ఎం‌సీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఆలస్యమవుతోందని కాళోజీ యూనివర్సిటీవారు చెబుతున్నారు. ఇలా సర్దుబాటు చేయడం కూడా ఎంతో కష్టమని, ఫీజుతో పాటు ఎన్నో సమస్యలు వస్తాయని, అందుకే రద్దయిన కాలేజీలలోనే మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకొని వారిని అక్కడే కొనసాగించాలని అంటున్నారు.

అది కుదరకపోతే, సీట్లను సర్దుబాటు చేసే అవకాశం లేనందున సూపర్ న్యూమరీ సీట్లను సృష్టించాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే సర్దుబాటు జరుగుతుందని, తర్వాత ఎక్కడ సీట్లు అవసరమో ఆ మేరకు వాటిని సృష్టించే అవకాశం పరిశీలిస్తామని కమిషన్ చెబుతోంది. తమ కాలేజీలోనే చదువుతామని కోరాలని విద్యార్థుల మీద యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల దోబూచులాటలో విద్యార్థులు నలిగిపోతున్నారు. మానసికంగా కుంగిపోతున్నారు.

గతంలోనూ అదేవిధంగా

2016 లో నీట్, ఎంసెట్ నిర్వహించినా ఎంసెట్ ద్వారా అడ్మిషన్లు నిర్వహించారు. ఆ సంవత్సరం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. ఆ తరువాత కరోనా కలకలం చెలరేగింది. కొవిడ్ అనంతరం కాస్త కుదుటపడిన కాలేజీలు సజావుగా నడుస్తాయనుకుంటే, అడ్మిషన్ల రద్దు నిర్ణయం కలవరం కలిగించింది. అడ్మిషన్ కోసం ఒక స్పష్టమైన విధానాన్ని అవలంబిస్తే బాగుంటుంది. అడ్మిషన్లకు ముందే ప్రతి కాలేజీని తనిఖీ చేస్తే విద్యార్థులకు, యూనివర్సిటీ అధికారులకు ఉపయోగకరంగా ఉంటుంది.

అడ్మిషన్ల తర్వాత లోపాలు ఉంటే వాటిని సవరించుకునేలా మాత్రమే ఆదేశించి, యజమానికి మాత్రమే శిక్ష ఉండేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అడ్మిషన్లు రద్దుచేసి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేయడం సరికాదు. ప్రభుత్వాలు విద్య, వైద్యం మీద శ్రద్ధ చూపి, అధిక నిధులను కేటాయించాలి, విద్యార్థుల భవిష్యత్తును ఉద్దేశించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆటంకాలు కలగకుండా విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు మానసిక వేదన లేకుండా చూడాలి.

తండ సదానందం

టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్

మహబూబాబాద్, 99895 84665

Advertisement

Next Story