కరుగుతున్న డాలర్ డ్రీమ్స్

by Ravi |   ( Updated:2023-01-29 02:32:57.0  )
కరుగుతున్న డాలర్ డ్రీమ్స్
X

అమెరికాను ఇప్పుడు ఆర్థికమాంద్యం ఆవహించింది. 15 సంవత్సరాల తర్వాత భూతల స్వర్గంగా పేరొందిన అమెరికాలో డాలర్ల స్వప్నాలు కరిగిపోతున్నాయి. కన్నవారిని, బంధుమిత్రులను, మాతృభూమిని వదిలి ఇక్కడ మంచి భవిష్యత్ కోసం ఎన్నో ఆశలతో వచ్చిన వారు తమ కళ్లముందే స్వప్నాలు చెదిరిపోతుండటంతో విలవిలలాడుతున్నారు. పూర్వపరిస్థితులు వచ్చి వారి కలలు నెరవేరాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టస్థాయికి చేరింది. స్టాక్ మార్కెట్లు సైతం భారీగా పతనమవుతున్నాయి. కోట్లాది రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోయింది. లే ఆఫ్‌ల కారణంగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే ఇతర రంగాల్లో కూడా సుమారు లక్ష మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.ఉద్యోగం కోల్పోయిన వారిలో అత్యధిక భాగం భారతీయులే ఉండటం గమనార్హం.

ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు పేదరికం పెరగడంతో కొనుగోలు శక్తి పడిపోయింది. హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర షాపులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నవంబర్ చివరి గురువారం థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా కిటకిటలాడిపోయే షాపులు, మాల్స్ జనం లేక ఖాళీగా కనిపించాయి. ప్రతిఏడాది క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా మాల్స్‌ను బాగా అలంకరించేవారు. అనేక ఆఫర్లు కూడా ప్రకటించేవారు. కానీ ఈ ఏడాది ఎక్కడా సందడి లేదు, పెద్దగా కొనుగోళ్లు చేసిన దాఖలాలు కనిపించలేదు. అమెరికాలో ఆర్థికమాంద్యం వస్తే దాని ప్రభావం భారత్ లోని టెక్ కంపెనీలపై కూడా ఉంటుంది. ఇక్కడికి కొత్తగా వచ్చేవారు, రావాలనుకునేవారు కొద్దికాలం వేచిచూస్తే మంచిది.

భూతల స్వర్గంలో డాలర్ల స్వప్నాలు కరిగిపోతున్నాయి. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారి కలలు చెదిరిపోతున్నాయి. కన్నవారిని, బంధుమిత్రులను, మాతృభూమిని వదిలి ఇక్కడ మంచి భవిష్యత్ కోసం ఎన్నో ఆశలతో వచ్చారు. కానీ వారి ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. పూర్వపరిస్థితులు వచ్చి వారి కలలు నెరవేరాలంటే కనీసం రెండేళ్లు పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికాభివృద్ధి మందగమనంలో ఉంది. ఒకవైపు ఉక్రెయిన్, రష్యా యుద్ధం, మరోవైపు కరోనా మహమ్మారితో అంతర్జాతీయంగా గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆర్థిక మాంద్యం ఛాయలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, సేల్స్ ఫోర్స్, గూగుల్, టెస్లా, స్నాప్ చాట్, ట్విట్టర్, కేపిటల్ వన్ బ్యాంక్ లాంటి దిగ్గజ సంస్థలలో వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. గతేడాది అక్టోబర్‌లో వాల్‌స్ట్రీట్ జనరల్ నిర్వహించిన సర్వేలో 63 శాతం మంది రెసిషన్ వస్తుందని, న్యూయార్క్ ఫెడ్ సర్వేలో కూడా 47శాతం పైగా రెసిషన్ ప్రభావం ఉంటుందని ప్రకటించాయి. ఇప్పటికే యూరప్, యూకే, అమెరికా సహా అనేక దేశాల్లో భారీగా ద్రవ్యోల్బణం పెరిగింది. ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు పేదరికం పెరగడంతో కొనుగోలు శక్తి పడిపోయింది. ఇన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం, ఇతర దేశాల్లోని కరెన్సీలు బాగా బలహీనపడటంతో డాలర్ మాత్రం బలంగా ఉంది.

మరింత నష్టాల వైపు..

అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందనే సామెత ఉంది. అమెరికాలో ఆర్థికమాంద్యం వస్తే దాని ప్రభావం భారత్ లోని టెక్ కంపెనీలపై కూడా ఉంటుంది. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టస్థాయికి చేరింది. స్టాక్ మార్కెట్లు సైతం భారీగా పతనమవుతున్నాయి. కోట్లాది రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోయింది. దీనికితోడు ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు బాగా పెంచడం వల్ల దీని ప్రభావం రియల్ ఎస్టేట్, అలాగే ఇతర రంగాలపై కూడా పడింది.

హౌసింగ్ మార్కెట్ ధరలు 15 శాతానికి పైగా పడిపోయాయి. 2008లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి తర్వాత ఇంకా కొన్ని కంపెనీలు నష్టాల బాట పడతాయి. ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం ముప్పు ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతుందంటున్నారు. దీనివల్ల నేరాలు పెరిగి శాంతిభద్రతలు కూడా క్షీణిస్తాయి.

ఆర్థిక మాంద్యం ప్రభావంతో..

అమెరికాలో ప్రతిఏడాది క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా మాల్స్‌ను బాగా అలంకరించేవారు. అన్ని మాల్స్ జనంతో రద్దీగా కిటకిటలాడుతూ ఉండేవి. ఈ సందర్భంలో అనేక ఆఫర్లు కూడా ప్రకటించేవారు. కానీ ఈ ఏడాది ఎక్కడా సందడి లేదు, పెద్దగా కొనుగోళ్లు చేసిన దాఖలాలు కనిపించలేదు. ప్రతి ఏడాది నవంబర్ చివరి గురువారం థ్యాంక్స్ గివింగ్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా దీనికి ముందురోజు అన్ని కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించడం అనవాయితీ. విపరీతమైన చలి ఉన్నప్పటికీ షాపుల ముందు బారులు తీరేవారు. ఈ ఏడాది నేను మా అమ్మాయితో కలిసి వాషింగ్టన్ డీసీ సమీపంలోని ఫోటో మ్యాక్ మాల్‌కి వెళ్లాం. అక్కడ జనంలేక వెలవెలబోతున్నాయి. రద్దీ సంగతి అటుంచితే.. కనీసం నామమాత్రంగా కూడా కొనుగోలు చేసేవారు ఎవరూ కనిపించలేదు. ఆర్థికమాంద్యం ప్రభావం పర్యాటక రంగం మీద పడటంతో హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర షాపులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఆటో ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాల చరిత్రలో ఇంత తక్కువ అమ్మకాలు ఎప్పుడూ జరగలేదు. టెస్లా కారు ధర 15 శాతం తగ్గించారు. గతంలో బుక్ చేసిన ఏడాదికి కూడా డెలివరీ వచ్చేది కాదు. ఇప్పుడు నెలరోజుల్లోనే కారు ఇంటిముందుకు వస్తోంది.

వారికి మాత్రమే కొంత ఉపశమనం..

వాషింగ్జన్ పోస్ట్ లెక్కల ప్రకారం లే ఆఫ్‌ల కారణంగా 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే ఇతర రంగాల్లో కూడా సుమారు లక్ష మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఉద్యోగం కోల్పోయిన వారిలో అత్యధిక భాగం భారతీయులే ఉండటం గమనార్హం. ప్రస్తుత అంచనా ప్రకారం సుమారు లక్ష మందికి పైగా ఉద్యోగం కోల్పోయి ఉంటారు. వీరంతా హెచ్1బీ వీసాదారులే. వీసా నిబంధనల ప్రకారం ఉద్యోగం కోల్పోయిన వారు తిరిగి 60 రోజుల్లో కొత్త ఉద్యోగంలో చేరాలి. ఈ పరిస్థితుల్లో కొత్తగా నియామకాలు కూడా కంపెనీలు చేపట్టడం లేదు. ఉద్యోగం రాకపోతే అమెరికా వదిలివెళ్లాలి. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఈ పరిస్థితుల్లో అమెరికాలో అన్ని రకాల వీసాలు మంజూరు చేసే యూఎస్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే సంస్థ(యూఎస్ సిఐఎస్) ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయిన హెచ్1బీ వీసాదారులకు తాత్కాలికంగా ఉపశమనం కలిగించింది. ఏడాది పాటు ఏదైనా పనిచేసుకునేందుకు ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్(ఈఏడీ) వెసులుబాటు కలిగించింది. దీంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల చదువులకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగించుకునేందుకు వీలు కుదిరింది. ఇది కూడా హెచ్1బీ వీసాదారులందరికీ వర్తించదు. ఐ 140 అప్రూవ్ అయిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఐ140 అప్రూవ్ కానివారు కొత్త ఉద్యోగంలో చేరకపోతే యథావిధిగా 60 రోజుల్లో భారత్‌కు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ప్రతి నెల ఈఎంఐలు కట్టే అవకాశం కూడా ఉండదు. ఒకవేళ ఇల్లు, కారు, ఉంటే తెగనమ్ముకోవాల్సి వస్తుంది. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఎంతో కొంత ఉంటుంది.

మరిన్ని ఉద్యోగాలు తొలగించే దిశగా..

జీవన వ్యయం పెరగడంతో జీవన ప్రమాణాల్లో బాగా మార్పులు వచ్చాయి. ఖర్చులు తగ్గించుకుంటూ పొదుపుకు అలవాటుపడుతున్నారు. విలాస వస్తువుల కొనుగోళ్లు తగ్గించారు. మూడు నెలల క్రితం వరకు జాబ్ మార్కెట్ చాలా పటిష్టంగా ఉంది. ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఉక్రెయిన్- రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. చైనాతో పాటు అనేక దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. లాక్ డౌన్ సమయంలో అమెరికా ప్రభుత్వం అన్ని రంగాల్లోని ఉద్యోగులకు, కంపెనీలకు, ఇతర సంస్థలకు నిరుద్యోగ భృతి పేరుతో వివిధ రూపాల్లో డబ్బులు పంపిణీ చేసింది.

మార్కెట్‌లో నగదు చెలామణి పెరగడం వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. దీంతో ఆహారం, ఇంధన, ఇతర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. ఇంకా ముందుంది ముసళ్ల పండగ. ఈ ఏడాది జూన్ తర్వాత మరింత ఆర్థిక సంక్షోభం ఎదురుకానుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తెలియజేస్తోంది. కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడానికి మరింత మంది ఉద్యోగులను తొలగించే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇక్కడ కార్మిక చట్టాలు ఏవీ ఉండవు. ఎప్పుడైనా, ఎవరినైనా తొలగించవచ్చు. ఆర్థిక సంక్షోభానికి తోడు సమర్థ పాలన కొరవడటంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది.

దానిపైనే వారి ఆశ

ఇక్కడికి కొత్తగా వచ్చే వారు, రావాలనుకునేవారు కొద్దికాలం వేచిచూస్తే మంచిది. సాంకేతిక నైపుణ్యం మెరుగుపర్చుకునేవారు మనగలుగుతున్నారు. ప్రతిభ ఉన్న మరికొంతమంది హోదా తగ్గించుకొని తక్కువ జీతంతో వేరే కంపెనీల్లో చేరుతున్నారు. అమెరికాను వదిలివెళ్లడం ఇష్టంలేని కొద్దిమంది తమ వీసా స్టేటస్‌ను మార్చుకుని యూనివర్సిటీల్లో చేరి మాస్టర్స్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొనుగోలు శక్తి పెరగాలంటే ఉద్యోగ, ఉపాధి కల్పన పెరగాలి. అప్పుడే కంపెనీల ఉత్పత్తులు పెరుగుతాయి. ఉత్పత్తులు పెరగాలంటే వస్తు వినిమయం పెరగాలి. ఇదంతా ఒక సైకిల్. ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది.

ఉద్యోగ అన్వేషణ సవాలుగా మారిన నేపథ్యంలో ఈ విపత్తు నుండి బయటపడటానికి ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా అవకాశాల కోసం అన్వేషిస్తున్నారు. వీసా విధానంలో మార్పులు వస్తే తప్ప ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడలేరని ఐటీ నిపుణులు తెలియజేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వడ్డీరేట్లు తగ్గిస్తే స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. హౌసింగ్ మార్కెట్ కూడా బాగుంటుంది. నిదానంగా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. తిరిగి జాబ్ మార్కెట్ కూడా పుంజుకుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మన్నవ సుబ్బారావు

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్

99497 77727

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read..

పూజా సమయంలో తప్పుచేస్తే- ఏం జరుగుతుంది


Advertisement

Next Story