మహిళా బిల్లుకు మోక్షమెపుడు?40 ఏళ్ళుగా పెండింగ్ లో ఉండటానికి కారణమెవరు?

by Ravi |   ( Updated:2022-09-03 13:23:12.0  )
మహిళా బిల్లుకు మోక్షమెపుడు?40 ఏళ్ళుగా పెండింగ్ లో ఉండటానికి కారణమెవరు?
X

ఇప్పటి ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎన్నో చట్టాలను ఆమోదించారు. ఈ బిల్లుకు మాత్రం ఏకాభిప్రాయం కావాలనడం విడ్డూరం. కనీసం సీట్ల కేటాయింపులోనైనా మహిళా కోటాను అమలు చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ప్రపంచ దేశాల చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం సగటున 22 శాతంగా ఉంది. మన దేశంలో 12 శాతం మాత్రమే. మనకంటే చిన్ని దేశాలైన రువాండాలో మహిళలకు 63.8 శాతం రిజర్వేషన్ ఉంది. స్కాండినేవియన్‌లో మహిళా ప్రాతినిధ్యం అధికంగా ఉంది. అల్జీరియా, దక్షిణ సూడాన్, లిబియా, సౌదీ అరేబియా వంటి దేశాలలో మహిళలకు గణనీయ ప్రాతినిధ్యం దక్కుతోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి మహిళలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచాయి. ఘనంగా వజ్రోత్సవాలు కూడా జరిగాయి. మరి ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర్యం తరువాత కూడా దేశంలో మహిళల పరిస్థితి ఎలా ఉంది? వారికి సమాన అవకాశాలు దక్కుతున్నాయా? 'ఆకాశంలో సగం-అవకాశంలో సగం' ఇంకా నినాదంగానే ఎందుకు ఉంది? అన్ని రంగాలలో సమాన హక్కులు సరే, శాసనాలు చేసి దేశాన్ని ముందుకు నడిపించే చట్టసభలలో మహిళలకు ఏ మేరకు భాగస్వామ్యం దక్కింది?

దేశ రాజకీయాలలో మహిళలు అస్తిత్వం నిలుపుకోవాలంటే ఎన్నో దశాబ్దాలు పోరాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వారిని ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప వారి అస్తిత్వం, హక్కులు, ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. వారిని భాగస్వాములను చేయకుండా రాజకీయ ఎత్తుగడలు, సర్దుబాట్లు, సమీకరణాలతో సరిపుచ్చుతున్నారు. దీనికి ఏ రాజకీయ పార్టీ మినహాయింపు కాదు. నిర్ణయాధికారంలో మహిళలకు సమ భాగస్వామ్యం కల్పించాలని అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు చెబుతున్నా పాలకులకు పట్టింపు లేదు.

వివక్ష చూపుతూ

1996లో మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారిగా పార్లమెంటులో ప్రవేశ పెట్టినప్పుడు మంచి రోజులు వచ్చాయని భావించారు. ఇది సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సిన ఘట్టమని ఊదరగొట్టారు. ఇప్పటి వరకు ఆ బిల్లుకు ఆమోదం లభించలేదు. 'నిర్ణయాధికారంలో మహిళలకు సగ భాగస్వామ్యం' అన్న నినాదం కాగితాలకే పరిమితమవుతోంది. చట్టసభలలో సమాన బిల్లు కాదు కదా, మూడో వంతు రిజర్వేషన్ కల్పించే విషయంలోనూ ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదనేది స్పష్టమవుతోంది. పాతిక సంవత్సరాలు గడిచినా బిల్లు అమలుకు నోచుకోవడం లేదు. ఇది అర్ధ ప్రపంచపు హక్కు అయినా, దాని చుట్టూ పరిభ్రమిస్తున్న రాజకీయాలు మోసపూరితంగా, లింగ వివక్షతో కూడి ఉన్నాయి.

నిబంధనల ప్రకారం ఏ బిల్లు అయినా పెండింగ్‌లో ఉంటే సభ రద్దు తర్వాత కాలం చెల్లిపోతుంది. మహిళా దినోత్సవం రోజే పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లు మరోసారి చర్చకు వచ్చింది. ఇప్పటికైనా దీనికి మోక్షం కల్పించాలని మహిళా ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదన 1975లో తొలిసారి లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో కేంద్ర విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ కమిటీని నియమించింది. ఈ కమిటీ ముందుగా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని సిఫారసు చేసింది. దీంతో 1993లో 73,74 అధికరణలను అనుసరించి చట్ట సవరణ చేసి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించారు.

ఏకాభిప్రాయం కావాలంటూ

1996 సెప్టెంబర్ 12న అప్పటి ప్రధాని దేవెగౌడ ప్రభుత్వం తొలిసారిగా 'చట్టసభలలో మహిళా రిజర్వేషన్' బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వం మైనారీటిలో పడిపోవడంతో అది అటకెక్కింది. 1998లో రెండోసారి వాజ్‌పేయి సర్కార్ బిల్లును ప్రవేశపెట్టింది. లోక్‌సభ రద్దు కావడంతో బిల్లు మరోసారి మరుగున పడింది. 1999 డిసెంబర్ 23న దిగువసభలో ఈ బిల్లును ఎన్‌డీ‌ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సొంత నేతలతోపాటు కాంగ్రెస్ నేతలు అడ్డుపడటంతో వెనక్కి తగ్గింది. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోక్‌సభ ముగిసినా బిల్లు యాక్టివ్ గా ఉండేలా మార్పులు చేసింది. 2010 మార్చి ఎనిమిదిన రాజ్యసభలో ప్రవేశపెట్టింది. తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో మార్చి తొమ్మిదిన బిల్లు ఆమోదం పొందింది. కాంగ్రెస్ పార్టీలో గొడవలు రావడం, అసమ్మతి నేతలు వ్యతిరేకించడం, మొండిగా ముందుకుపోతే మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవ్వాలని హెచ్చరించడంతో ఈ బిల్లు లోక్‌సభలో పెండింగ్‌లో ఉండిపోయింది.

ఈ బిల్లు హామీతో ఐదుసార్లు అధికారంలోకి వచ్చిన యూపీఏ, ఎన్‌డీ‌ఏ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. ఇప్పటి ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఎన్నో చట్టాలను ఆమోదించారు. ఈ బిల్లుకు మాత్రం ఏకాభిప్రాయం కావాలనడం విడ్డూరం. కనీసం సీట్ల కేటాయింపులోనైనా మహిళా కోటాను అమలు చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ప్రపంచ దేశాల చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం సగటున 22 శాతంగా ఉంది. మన దేశంలో 12 శాతం మాత్రమే. మనకంటే చిన్ని దేశాలైన రువాండాలో మహిళలకు 63.8 శాతం రిజర్వేషన్ ఉంది. స్కాండినేవియన్‌లో మహిళా ప్రాతినిధ్యం అధికంగా ఉంది. అల్జీరియా, దక్షిణ సూడాన్, లిబియా, సౌదీ అరేబియా వంటి దేశాలలో మహిళలకు గణనీయ ప్రాతినిధ్యం దక్కుతోంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి మహిళలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

Also Read : ఇదీ సంగతి: బీజేపీ విధానాలతో దేశం బాగుపడేనా?

అజ్మీరా సమీరా

ఓయూ రీసెర్చ్ స్కాలర్

85198 36308

Advertisement

Next Story

Most Viewed