- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఐల పదోన్నతులు ఎప్పుడు?
కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ విధి నిర్వహణే ఊపిరిగా, సమాజ రక్షణే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుతున్న పోలీసు శాఖలో 2012 బ్యాచ్ ఎస్ఐలు ఎదుర్కొంటున్న పదోన్నతుల సమస్య సాఫీగా సాగుతున్న కొలువుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. వారు పుష్కరకాలంగా ఎస్ఐలుగానే పనిచేస్తున్నా.. సీఐ పదోన్నతుల కోసం కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తమపై కరుణ చూపాలంటూ పాలకుల చుట్టూ చేస్తున్న ప్రదక్షిణలకు తగిన ఫలితం దక్కుతుందా లేదా..? అనే ఊగిసలాట కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
పోలీస్ ఆ పేరు వింటేనే ఓ ధైర్యం..ఒక నమ్మకం. అటువంటి పోలీసుల విధి నిర్వహణ అత్యంత శ్రమతో కూడుకున్నది. పోలీసు ఉద్యోగమంటే..ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు పరిమితమైనది కాదు. ఎండా.. వాన పగలూ.. రాత్రి అనే తేడా లేకుండా విధి నిర్వహణ చేయాల్సిన పరిస్థితి. సంపన్నుడు మొదలు.. సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరూ ప్రతి అవసరానికి సాయం కోరేది ఒక్క పోలీసులను మాత్రమే. సమాజంలో శాంతిభద్రతలను భగ్నం చేసే అసాంఘిక శక్తులతో ఢీకొట్టడమంటే చిన్న విషయమేమీ కాదు. హింస..రక్తపాతాలతో ప్రజల్ని భయాందోళనలకు గురిచేసే సంఘ విద్రోహశక్తులను ఎదుర్కోవడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ విధి నిర్వహణే ఊపిరిగా, ముందుకు సాగుతున్న పోలీసు శాఖలో 2012 బ్యాచ్ ఎస్ఐలను పదోన్నతుల సమస్య వేధిస్తోంది. పుష్కర కాలంగా ఎస్ఐలు గానే పనిచేస్తున్నా..సీఐ పదోన్నతుల కోసం వీరు పడిగాపులు కాస్తున్నారు.
జూనియర్లకు సెల్యూట్ కొడుతూ...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5వ జోన్ పరిధిలో రిక్రూట్ అయిన 2012 బ్యాచ్ ఎస్ఐల పదోన్నతుల వ్యవహారం ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఏళ్ల తరబడి సీనియార్టీ ప్రకారం తమకు దక్కాల్సిన ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో మానసికంగా...శారీరకంగా కుంగిపోతున్నామని పోలీసు అధికారులు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసిన ఎస్సైలు సీఐ ప్రమోషన్లకు అర్హులవుతారని చెబుతున్న నిబంధనలు తెలంగాణాలో అమలు కాకపోవడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొంటున్నారు. ఇందుకు తెలంగాణా ఏర్పాటు జరిగిన తర్వాత పాలకులు తీసుకొచ్చిన కొత్త జోనల్ సిస్టం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రమోషన్లు రాక వారు ఎస్ఐలు గానే మిగిలిపోతున్నామని... ఇతర జోన్లలోని తమ జూనియర్లు మాత్రం సులభంగా సీఐ ప్రమోషన్లు పొందుతున్నారని వారికి సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో తాము ఉంటూ ఎటూ పాలుపోని స్థితిలో విధులు నిర్వహించాల్సి రావడం కుంగుబాటుకు గురిచేస్తోందని.. కుటుంబాల్లో కూడా అశాంతిని కలుగజేస్తోందని అంటున్నారు.
కొత్త జోన్ల ఏర్పాటుతో..
జోనల్ సిస్టం మార్పు వల్ల పాత ఆరో జోన్ పరిధిలో రిక్రూట్ అయిన అనేక మంది ఎస్‌ఐలు 317 జిఓ కారణంగా ప్రస్తుత మల్టీ జోన్ -1 పరిధిలోకి వచ్చారు. దీంతో పాత ఐదో జోన్‌లో రిక్రూట్ అయిన ఎస్ఐలు ప్రమోషన్ లిస్టులో వెనకపడిపోయారు. అంతేకాకుండా ఒకే బ్యాచ్‌కు చెందిన కొందరికి పాత జోనల్ విధానం ప్రకారం, మరికొందరికి కొత్త జోనల్ విధానం ప్రకారం ప్రమోషన్లు రావడంతో ముందుగా ప్రమోషన్లు రావాల్సిన వారు వెనుకబడిపోయారు. దీనికి తోడు దాదాపు ఐదేళ్ల సర్వీసు కూడా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైనందున మల్టీ జోన్ ప్రకారం ప్రమోషన్లు ఇస్తే తాము మరింత నష్టపోతామని 2012 బ్యాచ్ ఎస్ఐలు చెబుతున్నారు. అందుకే తమకు పాత జోన్ల ప్రకారమే ప్రమోషన్లు ఇస్తేనే న్యాయం జరుగుతుందని అంటున్నారు. 2018లో ప్రెసిడెన్షియల్ రూల్స్ ప్రకారం స్థానికత అధారంగా ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు వెలువడ్డాయి తప్ప సర్వీస్ సీనియారిటీ, ప్రమోషన్ల విషయాన్ని అందులో ప్రస్తావించలేదని గుర్తు చేస్తున్నారు.
పాత జోన్ల ప్రకారమే ప్రమోషన్లు
కొత్త జోనల్ సిస్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా 2021, 2022 సంవత్సరాల్లో 2009, 2012 బ్యాచ్‌లకు చెందిన 45 మంది ఎస్ఐలకు పాత జోన్ల ప్రకారమే సీఐలుగా ప్రమోషన్లు ఇచ్చారు. వాస్తవానికి ప్రతీ సంవత్సరం డీపీసీని ఏర్పాటు చేసి ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా... గత మూడేళ్లుగా దానిని పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం సీఐలుగా ప్రమోషన్లు పొందిన వారెవరూ ఇప్పట్లో రిటైర్‌మెంట్ అయ్యే పరిస్థితులు ఉండవు కాబట్టి మధ్యేమార్గంగా ప్రస్తుతం వరంగల్ జోన్ పరిధిలో క్రైమ్ ఎక్కువగా నమోదవుతున్న పోలీస్ స్టేషన్లను సీఐ స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఉండే విధంగా అప్ గ్రేడ్ చేస్తే తమ ప్రమోషన్ల ప్రక్రియ సులువుగా మారుతుందని చెబుతున్నారు. కొత్త సర్కిల్స్ ఏర్పాటుపై పలు జిల్లాల యూనిట్ అఫీసర్లు ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి సమర్పించారని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసు శాఖలో ఉన్నతాధికారులు మొదలు వివిధ జిల్లాల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు అందించామని పుష్కర కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ పదోన్నతుల విషయంలో సానుకూలంగా స్పందించి వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని 2012 బ్యాచ్ ఎస్‌ఐలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
నాగేందర్ అడపాల
జర్నలిస్టు
90004 44349
- Tags
- circle inspector