- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
mana ooru manabadi: లక్ష్యం చేరుకునేది ఎప్పుడు!?
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం మొదటి లక్ష్యం పూర్తి చేయలేకపోవడానికి కారణం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిన నిధులు విడుదల చేయడంలో శ్రద్ధ కనపరచకపోవడంతో పాఠశాల సౌకర్యాల కల్పనకి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, వచ్చినా పనులు మధ్యలో వదిలేసి పోవడంలో ఈ పథకం యొక్క లక్ష్యం నీరుగారిపోతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడడంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల దుస్థితి నానాటికీ దుర్భరంగా మారిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 2124 పాఠశాలలో మరుగుదొడ్లు, 11,124 పాఠశాలలో త్రాగునీరు సౌకర్యాలు లేవని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో నివేదించారంటే మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు.
దేశంలో మానవ వనరుల నాణ్యతను పెంచి గుణాత్మకమైన మార్పు సాధించడానికి సామాజిక అవస్థాపన నిర్మాణంలో భాగమైన విద్యా, ఆరోగ్య రంగాలను ప్రభుత్వాలు బలోపేతం చేయాలి. అయితే స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల కాలంలోనూ వీటిని బలోపేతం చేయడానికి ప్రవేశపెట్టిన కేంద్ర, రాష్ట్ర పథకాలు ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడం వలన కోట్లాది పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రాకపోవడం విచారకరం.
అయితే, విద్యారంగంలో ప్రైవేటీకరణ ప్రారంభమయ్యాక కార్పొరేట్ శక్తులు ప్రవేశించి విద్యా అత్యంత ఖరీదైన వస్తువుగా మారుతుంటే మరోవైపు ప్రభుత్వ రంగంలో విద్యావ్యవస్థ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో నానాటికీ హీనస్థితిలోకి నెట్టివేయబడుతుంది. విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం భారత ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం ప్రవేశపెడుతున్న తరుణంలో నాణ్యమైన విద్యను పేదలు అందుకోవాలంటే ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే బాధ్యతను ప్రభుత్వాలు చేపట్టాలి.
బడిని బాగు చేసేనా?
ఉమ్మడి రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల నుండి విశ్వవిద్యాలయాల వరకు తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురైంది. ఈ ప్రాంత విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమైనారు కాబట్టే రాష్ట్రం ఏర్పాటైతే విద్యావ్యవస్థ సమూల ప్రక్షాళన అవుతుందని ఆశించారు. నాడు ఉద్యమ సమయంలోనూ నాటి నాయకత్వం కూడా రాష్ట్రం ఏర్పడితే కేజీ నుంచి పీజీ(KG-PG) వరకు ఉచిత నాణ్యమైన విద్య, కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం విద్యా అందిస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఆ మాటలు, వాగ్దానాలు నీటిమీద రాతలు గానే మిగిలిపోయాయి. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది సంవత్సరాల కాలంలో విద్యావ్యవస్థ ప్రక్షాళన చేయడం కోసం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందజేయడం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు పెద్దగా ఏమీ లేకపోగా, రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం, ఉన్నత విద్యలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చి విద్యా వ్యవస్థను మరింత దిగజార్చిందనే భావన వ్యక్తం అవుతుంది. రాష్ట్రంలో ఉన్న దాదాపు 26,065 పాఠశాలలో 1300 పాఠశాలలు విద్యార్థులు లేరనే సాకుతో మూసివేశారు.
పాఠశాలలో మౌలిక వసతులైన మరుగుదొడ్లు, త్రాగునీరు, ఫర్నిచర్, బోర్డులు, విద్యుత్, డిజిటల్ సౌకర్యాలు, వంటశాలల ఏర్పాటు, పాఠశాల భవనాల నిర్మాణం వంటి వాటిపై సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాఠశాలలను ఆధునికరించడానికి డ్రాప్ అవుట్స్ తగ్గించడానికి నాడు-నేడు(NADU-NEDU) అనే కార్యక్రమాన్ని చేపట్టి ఢిల్లీ ప్రభుత్వ విద్యలో తీసుకొచ్చిన మార్పుల మాదిరిగా ఏపీ ప్రభుత్వం ఆధునీకరణ చేపట్టగా, ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు ఎన్‌రోల్‌మెంట్ పెరిగింది. కేంద్ర ప్రభుత్వం సైతం దేశంలోని 14,597 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక చేసి మౌలిక సదుపాయాలను ఏర్పరచడానికి 'స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా' (PM SHRI) అనే కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం మన ఊరు మన బడి(mana ooru manabadi) కార్యక్రమం చేపట్టి ఇలాంటి మార్పులే తీసుకురావాలని 7289 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి మొదటి విడతలో భాగంగా 9123 పాఠశాలలు ఎంపిక చేసుకొని 3417 కోట్ల రూపాయలు కేటాయించింది కానీ ఇప్పటివరకు కేవలం 1200 పాఠశాలలు మాత్రమే ఆధునీకరించారు. ఈ పథక మొదటి దశలోనే పూర్తి లక్ష్యాన్ని నేరవేర్చని ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఆధునీకరణ చేపట్టేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
బడ్జెట్ లో నిధులు పెంచాలి
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం మొదటి లక్ష్యం పూర్తి చేయలేకపోవడానికి కారణం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిన నిధులు విడుదల చేయడంలో శ్రద్ధ కనపరచకపోవడంతో పాఠశాల సౌకర్యాల కల్పనకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, వచ్చినా పనులు మధ్యలో వదిలేసి పోవడంలో ఈ పథకం యొక్క లక్ష్యం నీరుగారిపోతుంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడడంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల దుస్థితి నానాటికీ దుర్భరంగా మారిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో 2124 పాఠశాలలో మరుగుదొడ్లు, 11,124 పాఠశాలలో త్రాగునీరు సౌకర్యాలు లేవని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(dharmendra pradhan) రాజ్యసభలో నివేదించారంటే మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు ఇలాంటి వాటికి ఉదాహారణలే బాసర ట్రిపుల్ ఐటీ, సరూర్ నగర్ జూనియర్ కళాశాల పరిస్థితులు. బాసర విశ్వవిద్యాలయంలో సౌకర్యాల మెరుగు కోసం ఉద్యమించాకే అక్కడ పరిస్థితిలో మార్పు వచ్చింది. అందుకే పౌర సమాజం ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.
రాష్ట్ర బడ్జెట్ లో పాఠశాల విద్యకు నిధులు పెంచాలి. పెంచడమే కాక పూర్తి నిధులు ఖర్చు పెట్టాలి. రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగం వాటా 6.2 శాతంగానే ఉంది దానిని 10 శాతానికి పెంచి ఖర్చు చేయాలి అప్పుడైతేనే ఆశించిన వాస్తవిక ఫలితాలు సాధించే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం గురుకులాల ఏర్పాటే విద్యావ్యవస్థలో పెద్ద విజయంగా ప్రభుత్వం భావిస్తుంది. కానీ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజును నియంత్రించడం వలనే పేదలకు నాణ్యమైన విద్య దొరుకుతుంది. లేకపోతే నాణ్యమైన విద్య అందని ద్రాక్ష లాగే మిగిలిపోతుంది. ప్రాథమిక విద్యను ప్రభుత్వ రంగంలో అందించ లేకపోతే రాష్ట్రంలో పెరిగిన సంపదకి, జరిగిన అభివృద్ధికి అర్థమేమి ఉంటుంది?
డా. తిరునహరి శేషు
అసిస్టెంట్ ప్రొఫెసర్,
కేయూ, వరంగల్
98854 65877
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672