ఈ మరణం సంధించిన ప్రశ్నలేంటి?

by Ravi |   ( Updated:2024-11-28 00:45:08.0  )
ఈ మరణం సంధించిన ప్రశ్నలేంటి?
X

20 రోజులకు పైగా నిమ్స్ ఆసుపత్రిలో నరకం అనుభవించిన విద్యార్థిని శైలజ మృత్యువుతో పోరాడి ఓడింది. 16 ఏళ్ల వయస్సులోనే ఆమె తన ప్రాణాలను వదిలింది. బాగా చదివి ఉన్నత చదువులు చదువుతుందనుకున్న బిడ్డ కన్నుమూయడంతో కన్నవారి ఆశలు ఆవిరయ్యాయి. శైలజ మృతికి కారకులు ఎవరు? శైలజ మరణం తెలం గాణ సమాజం ముందుంచిన ప్రశ్నలు ఏంటి?

20 రోజులు పోరాడి..

అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో తోటి విద్యార్థులతో భోజనం చేసిన శైలజ తీవ్ర అస్వస్థతకు గురైంది. కొంతమందిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించగా.. శైలజ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో నిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనలో మిగతా వారు సేఫ్‌గా బయటపడినా శైలజ మాత్రం కన్నుమూసింది. ఆమె ఒకటి కాదు.. పది కాదు ఏకంగా 20 రోజులపాటు మరణంతో పోరాటం చేసింది. కన్నవారి కోసమో, తోటి స్నేహితులతో కలిసి చదువుకోవాలన్న ఆరాటమో..? శైలజ మృత్యువును నిమ్స్‌లో పరిహసించింది. 21రోజులపాటు గేలిచేసింది. కానీ, ఈ చావు- బతుకుల మధ్య కొనసాగిన పోరాటంలో శైలజ ఓడింది. ఎలాగైనా తమ కూతురు మళ్లీ మామూలుగా మనిషి అవుతుందని తల్లిదండ్రులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. బిడ్డ అనా రోగ్యంతో గుండెచెదిరిన తల్లిదండ్రులు తమ బిడ్డను గుండెలకు ఒక్కసారి.. ఒక్కసారైనా హత్తుకోవాలని అనుకున్నారు. ప్రతి దేవుడికి చేతులెత్తి దండాలు పెట్టారు. దేవుడి రూపంలో కనిపించిన డాక్టర్లను బ్రతిమాలాడారు. అయ్యా.. పెద్దసారు... నా బిడ్డను బ్రతికించడయ్యా.. నీ కాల్మొక్తా అని వేడుకున్నారు. పాపం ఆ తల్లిదండ్రుల గోసకు కళ్లు చెమ్మగిల్లని డాక్టరూ లేదు.. నర్సు లేదు..

ఎవరిని నిందించాలి..?

బిడ్డ పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల ఎంత సంతోషించారో తెలియదు కానీ, శైలజ ఇప్పుడు నోరారా అమ్మా.. అని పిలిస్తే చూడాలని మురిసిండ్రు.. అందుకోసం తపించిండ్రు.. బిడ్డ ఎప్పుడు కన్నుతెరుస్తుందోనని.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిండ్రు.. కానీ, శైలజ తల్లిదండ్రుల విన్నపాలు ఆ దేవుడు వినలేదు.. కంటికి రెప్పలా చూసుకున్న బిడ్డ కళ్ల ముందు చనిపోవడం ఆసుపత్రిలో వాళ్ల రోదన ఆకాశానికి తాకింది. శైలజ మృతికి ఎవరిని నిందించాలి? తమ పేదరికాన్ని నిష్టూరమడాలా? సర్కార్‌ను నిందించాలా? నిజంగా శైలజ మృతికి కారకులు ఎవరు? నాసిరకం భోజనమే కదా శైలజను కళ్లముందు లేకుండా చేసింది.. అందుకే తమ బిడ్డను దూరం చేసిన పాపం సర్కార్ దేనని ఆ తల్లిదండ్రులు అంటున్నారు.

పౌష్టికాహారం అందిస్తున్నామంటూ..

21 రోజులు.. వెంటిలేటర్‌పై చావు అంచున శైలజ ప్రయాణం.. కనీసం ఒక్కరోజైనా పాలక పార్టీ నుంచి ఎవరూ పరామర్శించలేదు. ఒక్కరోజైనా నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడలేదు? ఎందుకీ నిరాసక్తత? చిన్నారి మృతిపై కూడా ఇంత నిర్లక్ష్య ప్రదర్శన ఎందుకు? శైలజ వెళ్తూ.. వెళ్తూ.. తెలంగాణ ముందుంచిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ప్రభుత్వం బాకీ పడిన సమాధానాలు ఇవి.. ఇప్పటికే 48మంది అమాయక బిడ్డలు చనిపోయిండ్రు.. ఏడాది కాలంలో నెలకు నలుగురు చొప్పున చనిపోయిండ్రు.. వరుసగా విద్యార్థుల చావులు, అస్వస్థతలు వెరసి సర్కార్ పౌష్టికాహారం అందిస్తామని చెప్పుకుంటోంది. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్దంగా పరిస్థితులు ఉంటు న్నాయి. రోజుకో చోట కలుషిత ఆహరం తిని అస్వస్థతకు గురైతున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి.. శైలజ మృతితోనైనా సర్కార్ కళ్లు తెరవకపోతే గురుకులాలు మూతబడే పరిస్థితికి రావచ్చు!

- ప్రశాంత్ పగిళ్ళ

ఓయూ విద్యార్థి

95812 62429

Advertisement

Next Story

Most Viewed