ఉస్మానియా దుస్థితికి కారణాలేంటి?

by Ravi |   ( Updated:2023-08-07 23:15:40.0  )
ఉస్మానియా దుస్థితికి కారణాలేంటి?
X

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి అనేక మంది గ్రామీణ పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రోత్సాహం అందించిన ఉస్మానియా యూనివర్సిటీ నేడు సవతి తల్లి ప్రేమకు గురవుతూ అటు చదువుల్లోనూ ఇటు జాతీయ స్థాయి ర్యాంకుల్లోనూ కిందికి దిగజారిపోయింది. ఎందరో గొప్ప మేధావులను తయారు చేసే కేంద్రంగా ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈరోజు ఎందుకు ఇలా దీనస్థితికి దిగజారిపోయింది! .సేవ్ ఉస్మానియా అనే ఉద్యమం వరకు రావడానికి గల కారణాలేంటి?

ప్రశ్నించే గొంతుకలు పెరుగుతాయని..

రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ దాటి బయటకు వచ్చి ప్రజలను కలవరు, వాళ్ళ సమస్యలు వినరు... అలాగే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ దాటి బయటకు రాడు, ఏ విద్యార్థులను కలవడు. ఎప్పుడూ లేని నియంతృత్వ సాంప్రదాయానికి బాటలు వేసి ప్రైవేట్ సెక్యూరిటీతో యూనివర్సిటీని నియంత్రించే ప్రయత్నానికి వీసీ పూనుకున్నారంటే యూనివర్సిటీలో పరిస్థితులు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి నిర్బంధమే గనక ఉద్యమ సమయంలో ఉండి ఉంటే తెలంగాణ వచ్చేదా? కేసీఆర్‌కి అధికారం వచ్చేదా? ఈ మొత్తం ప్రక్రియలో కేసీఆర్ కపట నీతి స్పష్టంగా కనబడుతుంది. ఇన్ని రోజులు కేసీఆర్ ఉద్యమకారులను, మేధావులను మాత్రమే వాడుకొని వదిలేశాడనుకుంటే ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భాగస్వామి అయిన ఉస్మానియా లాంటి యూనివర్సిటీలను కూడా అలాగే వాడుకొని వదిలేశారు.

2014 కంటే ముందు ఉద్యమ సమయంలో కూడా జాతీయ స్థాయి ర్యాంకుల్లో దిగజారని ఉస్మానియా యూనివర్సిటీ స్వరాష్ట్రంలో మాత్రం జాతీయ స్థాయిలో 64వ స్థానానికి దిగజారిపోయింది. గత ఏడాదితో పోలిస్తే 18 స్థానాలు కిందికి పడిపోయింది. ఇది కావాలనే జరిగింది. ఎందుకంటే OU లో పేద విద్యార్థులు చదివి రాజకీయ అవగాహనను పెంచుకుంటున్నారు, ఆర్థికంగా బలంగా అవుతున్నారు. ఇలా అయ్యే విద్యార్థులంతా SC, ST, BC, మైనారిటీ పేద విద్యార్థులే కాబట్టి అది తనకు ఇబ్బందికర పరిస్థితి అవుతదని, ప్రశ్నించే గొంతుకలు పెరుగుతాయని ఇలా యూనివర్సిటీలపై సవతి తల్లి ప్రేమని చూపిస్తున్నారు. కనీసం అకడమిక్స్ విషయంలో అయినా యూనివర్సిటీ మెరుగ్గా ఉందా అంటే అది కూడా లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు భర్తీ చేయలేదు CRB (COMMON RECRUITMENT BOARD) అనే బిల్లు తీసుకొచ్చి గవర్నర్ దగ్గర పెండింగ్‌లో పెట్టారు ఆ బిల్లుపై అభ్యంతరాలు ఉన్నాయని గవర్నర్ పలుమార్లు చెప్పినా విద్యాశాఖ మంత్రి స్పందించలేదు అసలు ఆ బిల్లు గురించి విద్యాశాఖ మంత్రికి తెలుసో లేదో?

ఈ దుస్థితి.. ఎవరు పట్టించారు?

విద్యా వ్యవస్థపై కేసీఆర్ ప్రభుత్వ కుట్ర వైఖరిని చెప్పడానికి ఒక ఉదాహరణ చూస్తే, రాష్ట్ర గవర్నర్ మెడికల్ విభాగంలో డీఎంఈ , ఏడీఎంఈ, ప్రిన్సిపల్ , సూపరిండెంటెంట్ పదవీ విరమణ వయసు పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లు విషయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వారి దగ్గర మనిషికి మేలు చేయాలన్న దృక్పథంతో గవర్నర్ దగ్గరకు వెళ్లి అనేకసార్లు విన్నవించుకున్నారు కానీ యూనివర్సిటీ లో చదివే పేద విద్యార్థులు వారికి దగ్గర వారు కారు కాబట్టే ప్రొఫెసర్ల భర్తీ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు. లెక్క ప్రకారం OU లో 1250 మంది ప్రొఫెసర్ ఉండాల్సిన చోట 300 మంది మాత్రమే ఉన్నారు. 17 మంది మంత్రులు ఉండాల్సిన చోట 5 గురు మంత్రులు మాత్రమే ఉంటే గవర్నమెంట్ నడుస్తుందా? 119 ఎమ్మెల్యేలు ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుందా? 200 మంది సెక్యూరిటీ ఉండవలసిన ప్రగతి భవన్‌కి 20 మంది ఉంటే కేసీఆర్ భద్రత సురక్షితమేనా? అలాంటిది 100 సంవత్సరాల చరిత్రగల ఉస్మానియా యూనివర్సిటీకి ఈ దుస్థితి ఎందుకు పట్టింది, ఎవరు పట్టించారు?

ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించడానికి విద్యను కార్పొరేటీకరణ దిశగా మరల్చడానికి మంత్రి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి రాజకీయ నేతలను బాగు చెయ్యడం కోసం తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాంటి ఉస్మానియా యూనివర్సిటీని నాశనం చేయడానికి పూనుకున్నారు. ఇక ఫీజుల విషయానికి వస్తే, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నారు అది కూడా అడ్డు అదుపు లేకుండా దోచుకుంటూ పోతున్నారు. ప్రొఫెసర్‌లకు బదులు పాఠాలు చెప్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలకు కూడా విద్యార్థులు కట్టే ఫీజుల్లోంచే ఇస్తున్నారు, గెస్ట్ ఫ్యాకల్టీ తోని పాఠాలు చెప్పించుకోవటానికి ఉత్తమ ర్యాంకులు తెచ్చుకొని యూనివర్సిటీలలో చదవాల్సిన అవసరం ఉందా? మంచి ఫ్యాకల్టీ లేకపోవడంతో , దేశ స్థాయిలో ర్యాంకు దిగజారుతోంది. ఇన్ని సజీవ సాక్ష్యాల మధ్య కేసీఆర్‌కి మరోసారి అధికారం కట్టబెట్టాలా వద్దా అనేది రాష్ట్ర ప్రజలే ఆలోచించుకోవాలి.

వెంకట్ నాయక్

ఎన్‌.ఎస్.యూ.ఐ రాష్ట్ర కార్యదర్శి

90140 12381

Advertisement

Next Story