కార్యకర్తలు పల్లకీలు మోయాల్సిందేనా..?

by Ravi |   ( Updated:2024-07-12 00:46:18.0  )
కార్యకర్తలు పల్లకీలు మోయాల్సిందేనా..?
X

రాజకీయాల్లోకి యువత రావాలని పిలుపునిస్తున్న కురువృద్ధ రాజకీయ నేతలకు నైతిక విలువలు కొరవడినాయి. 70 నుంచి 80 ఏండ్ల వయసులోనూ 50 ఏండ్ల రాజకీయ జీవితంలో ఉన్నత పదవులు అనుభవించిననూ కోరికలు తీరని మనిషిలాగా వ్యవహారిస్తున్నారంటే శోచనీయం. చీమలు పెట్టిన పుట్టలు పాములు ఆక్రమించినట్టుగా కురువృద్ధ రాజకీయ నేతలు ఆక్రమిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేరినప్పుడు ఏ మేరకు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందో... ఏపాటి నిధులు తెచ్చారో చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేకున్నా ప్రస్తుతం తాము నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రభుత్వంలో చేరుతున్నట్టు ప్రజలను మోసం చేస్తున్నారు.

విలువలు పడిపోతున్నాయి అంటూనే..

పదవుల కోసం... పరపతి కోసం... గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి కురువృద్ధ రాజకీయ నేతలు అధికార పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా యువత పాత్ర కీలకం. అదే యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా అవకాశవాద రాజకీయాలు చేస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో ఉన్నత పదవులు అనుభవించిన కురువృద్ధులు నేడు మరో పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రభుత్వంలోనూ వారే చక్రం తిప్పడానికి పావులు కదుపుతున్నారు. దీంతో చివరికి ఏ పార్టీ అధికారంలో ఉన్న యువతకు అవకాశాలు కల్పించని పరిస్థితి తెలంగాణలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.

ఎప్పుడైనా అధికార పార్టీతో ప్రత్యక్ష పోరులో నిలబడేది యువతయే. నిన్న మొన్నటి వరకు గత ప్రభుత్వంతో పోరాటం చేసి ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వాతావరణం కల్పించింది యువతనే. కానీ వారికి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించకపోవడం ఒక ఎత్తు అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు నామినేట్ పదవులు ఇవ్వడానికి సైతం వెనుకాడుతున్నాయి అధికార పార్టీలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రత్యేక రాష్ట్రంలోనూ 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అందులో ఉన్నది ఈ కురువృద్ధులే. కానీ అదే కురు వృద్ధులు రాజకీయ విలువలు రోజురోజుకు పడిపోతున్నాయని ఆక్షేపిస్తుండటం హాస్యాస్పదం.

కార్యకర్తలను పట్టించుకోరు..

తనకు లేదా తన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వలేదని, గౌరవం లభించడం లేదని, మంత్రిగా అవకాశం కల్పించలేదని, తాను సూచించిన వారికి నామినేటెడ్ పదవి ఇవ్వలేదని గత ప్రభుత్వంపై ఆక్షేపణలు చేసి బయటకు వచ్చినవారు కొందరైతే, కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరితే తమ కుటుంబ సభ్యులకు ఎంపీ, ఎమ్మెల్సీ పదవులు అవకాశం కల్పించుకోవడానికి, తమకూ ఏ మంత్రి పదవో వస్తుందని చేరుతున్నది మరికొందరు. ఇలా అవకాశవాదంతో చేరిన వారు రేపు మరో పార్టీ అధికారంలోకి వస్తే ఇందులో ఉంటారనే గ్యారెంటీ లేదు. ప్రస్తుతం అధికారంలోకి రావడానికి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన అట్టడుగు కార్యకర్తలకు న్యాయం జరిగేది ఎప్పుడు? అవకాశవాద రాజకీయాల కోసం కండువాలు మార్చుకునే నేతలకు ప్రాధాన్యత కల్పిస్తే ఎన్నో అవమానాలు, అవహేళనలు, అక్రమ కేసులను ఎదుర్కొన్న కార్యకర్తలకు రాజకీయ భవిష్యత్తు శూన్యం అవుతుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు రేపో మాపో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో తమ సన్నిహితులకే అవకాశం కల్పించడానికి కుట్రలు చేస్తారే తప్ప నికార్సైన కార్యకర్తలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వబోరు. వీళ్ల రాజకీయ, ఆర్ధిక ఎదుగుదల కోసం పెళ్లాం పిల్లల్ని లెక్కచేయకుండా వాళ్లకి జిందాబాద్‌లు కొట్టి వారిని అందలం ఎక్కించిన కార్యకర్త మాత్రం దిక్కు తోచని స్థితిలో అక్కడే ఉండిపోతాడు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలాగే ఉంది. ఇది ప్రతి పార్టీలో ఉన్న సగటు కార్యకర్త బయటకు చెప్పుకోలేని ఆవేదన. యువతరమా మీ తల్లిదండ్రులు కురువృద్ధ రాజకీయ నేతలను భుజస్కందాలపై మోసి నేల కోరిగారు. నేడు మీరు అదే కురువృద్ధుల వారసుల పల్లకి మోయడానికి తప్ప పదవులు పొందడానికి కాదనే విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నాను.

సత్త్యారం భీమప్ప

రిపోర్టర్

'9959380524

Advertisement

Next Story

Most Viewed