- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏం సాధించారని విద్యా దినోత్సవం?
జూన్ 20 న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యా దినోత్సవం జరపాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అసలు ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని పరిశీలన చేస్తే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అందరూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే ప్రధానంగా విద్యారంగం అభివృద్ధి చెందుతుందని భావించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కంటే స్వరాష్ట్రంలో విద్యారంగం వివక్షను ఎదుర్కొంటోంది.
తక్కువ నిధులు కేటాయిస్తూ..
ఎంతో ప్రాధాన్యత ఉన్న విద్యారంగంపై ఈ పదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క సమీక్ష కూడా సీఎం నిర్వహించలేదు. తెలంగాణ పునర్నిర్మాణం అవుతుంది. ఇదే అసలైన పునర్నిర్మాణం అంటూ గొప్పగా ప్రకటించారు, ప్రకటిస్తున్నారు కానీ అసలు పునర్నిర్మాణం అంటే విద్యారంగం అభివృద్ధి చెందడమే, విద్యా అభివృద్ధి చెందితేనే సంస్కృతి, సామాజిక విలువలు, ఆర్థిక ఎదుగుదల, సామాజిక చైతన్యం అభివృద్ధి చెందుతుంది. మౌలికంగా ఈ రంగం అభివృద్ధి మిగిలిన రంగాల్లో ఉంటుంది. ఇలా అభివృద్ధి జరిగి మిగిలిన రంగాల్లో అభివృద్ధి చెందడమే అసలైన పునర్నిర్మాణం. కానీ తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేపట్టినా, ఒక్కసారి కూడా విద్యారంగం గురించి సమావేశాన్ని కూడా నిర్వహించలేదంటే ఎంతటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వానికి ఉందో అర్ధం అవుతుంది.
సీమాంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ విద్యారంగం ధ్వంసం అయిందని, వాళ్ళు ఈ ప్రాంత విద్యాభివృద్ధి కోసం సమానమైన నిధులు, నియామకాలు చేయలేదని, ఈ ప్రాంతంపై వివక్ష చూపారని చెప్పాం, కానీ తెలంగాణా వచ్చిన తర్వాత కూడా విద్యారంగంపై వివక్ష కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్లో 12% నిధులు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బడ్జెట్లో నిధులు క్రమంగా తగ్గిస్తూ 6.57% నిధులు కేటాయింపులు చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలో సగటున విద్యారంగానికి 14.8% కేటాయింపు చేస్తే దేశంలోనే అత్యంత తక్కువ నిధులు కేటాయించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. నిధుల లేమి, ఖాళీలు భర్తీ చేయకపోవడంతో తెలంగాణ విద్యారంగం సంక్షోభంలోకి వెళ్ళింది. ప్రాథమిక స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు ఇదే రకమైన సమస్యలు వేధిస్తున్నాయి.
పాఠశాల విద్య - ప్రభుత్వ నిర్లక్ష్యం
రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల 1200 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పటికీ 6,132 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 25,966 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఉన్నాయి. 67% బడులు సింగిల్, డబుల్ టీచర్ పాఠశాలలుగా నడుస్తున్నాయి. సగంపైగా (53%) పాఠశాలలు సరిపడా తరగతి గదులు లేవు. కేవలం రెండు తరగతి గదుల పాఠశాలలుగా ఉన్న, 12 వేల పాఠశాలలకు ఆటస్థలం లేదు. 6,874 పాఠశాలలో త్రాగునీరు, రన్నింగ్ వాటర్ సౌకర్యం లేదు. 37% పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. దీనికి ఉదాహరణ ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1288 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 1052 పాఠశాలలో కుళాయిలు, త్రాగునీరు లేవు. 258 పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. బాలికలు మరుగుదొడ్లు లేవని రోజంతా నీళ్ళు త్రాగకుండా పాఠశాల పూర్తైన తర్వాత నీళ్ళు తాగుతున్నామని చెబుతున్న కథనాలను చూశాం. 2,155 పాఠశాలలో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఇన్ని సమస్యలు ఉంటే సదరు విద్యాశాఖ మంత్రి ఇప్పటికే మేము మన ఊరు- మన బడి-మన బస్తీ పేరుతో 3,200 కోట్లు పైగా ఖర్చు చేసి మొదటి దఫాలో 9,123 పాఠశాలలను అభివృద్ధి చేశామని చెబుతున్నారు. ఎక్కడ ఈ నిధులు ఖర్చు చేశారో అమాత్యులకే ఎరుక. బడిబాట సక్సెస్ అయ్యిందని లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులపై నమ్మకంతో చేరుతున్నారని ఊదరగొడుతున్నారు. చేరిన విద్యార్థులు ఎంత మంది నిలుస్తున్నారో వివరాలు మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకంటే పాఠాలు చెప్పే టీచర్లు లేక చేరిన విద్యార్థులు మళ్ళీ సర్కార్ బడులను వీడుతున్నారు. రాష్ట్రంలో తెలుగు మీడియంలో 24, వేలు ,ఇంగ్లీష్ మీడియం కలిపితే మరో 20 వేలు మొత్తం 40,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్క డీఎస్సీని కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. ఉన్న విద్యావాలంటీర్లను తప్పించారు. 592 మండలాల్లో 571 మండలాలకు ఎంఇఓ లేరు. 33 జిల్లాలో కేవలం 12 జిల్లాలోనే రెగ్యూలర్ డిఇఓలున్నారు. మిగతావి ఖాళీగా ఉన్నాయి. ఈ స్థితిలో ఏం అభివృద్ధి అయ్యిందని విద్యా దినోత్సవం జరుపుకోవాలో విద్యాశాఖ మంత్రిగారే సమాధానం చెప్పాలి. ఈ మద్యనే కేంద్రం విడుదల చేసిన ఫర్మార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ) నివేదికలో విద్యా అభివృద్ధి సూచిలో తెలంగాణ 31వ స్థానంలో ఉంది. అంటేనే విద్యకు ప్రభుత్వమిస్తున్న ప్రాధాన్యత అర్థం అవుతుంది.
గురుకులాలు - సమస్యల కూపాలు
ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న పథకం గురుకులాలు ఏర్పాటు. దీని ద్వారా కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నామని చెప్పారు. కానీ రాజ్యాంగ సమానత్వానికి వ్యతిరేకంగా కులాల పేరిట గురుకులాలు ఏర్పాటు చేసి ఆర్భాటంగా ప్రారంభించారు. గురుకులాల ద్వారా కొంత మేరకు విద్య అందుతున్నా, సౌకర్యాల పరంగా అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నాయి. రాష్ట్రంలో 618 గురుకులాలు ఏర్పాటు చేసి మొత్తంగా 900 పైగా గురుకులాలను ప్రారంభించారు. వీటిని మూసివేసిన ఇంజనీరింగ్ కళాశాలలు, ఫంక్షన్ హాల్స్‌లో నిర్వహిస్తున్నారు. ఒకే క్యాంపస్‌లో 03 నుండి 04 గురుకులాలు నడుస్తున్నాయి. డార్మెటరీ, స్నానాలకు, డైనింగ్ హాల్స్, సరైన వసతి లేక పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు లేక డార్మెటరీ గదులలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు, పుడ్ పాయిజన్స్ నిత్యకృత్యం అయ్యాయి. గత సంవత్సర కాలంలో గురుకులాల్లో, కేజీబీవీ లో చదువుతున్న విద్యార్ధులు 14 మంది జ్వరాలు, పాముకాటు, పుడ్ పాయిజన్స్ తదితర సమస్యలతో చనిపోయారు. స్వంత భవనాలు కట్టకుండా వందలాది గురుకులాలు ప్రారంభించి కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అంటూ ఊదరగొడుతున్నారు. ఇంకో పక్క మహిళా విద్య అభివృద్ధి కోసం తీసుకుని వచ్చిన కేజీబీవీలు కూడా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. నాణ్యమైన భోజనం లేదు, టాయిలెట్స్ లేవు. మేము తాగడానికి నీళ్ళు లేవు, నాణ్యమైన భోజనం లేదంటూ, సరైన టాయిలెట్లు లేవని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేజీబీవీ విద్యార్ధినిలు రోడ్డుపై రాస్తారోకో చేశారు. రాజధాని నగరంలో కోఠి ఉమెన్స్ కళాశాల హస్టల్స్ చూస్తే సంక్షేమ రంగం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి తెలుస్తోంది.
పరీక్షలు - నిర్వహణ వైఫల్యాలు
తెలంగాణ రాష్ట్రంలో కనీసం పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితిలో విద్యారంగం ఉంది. ఇంటర్మీడియట్, పదో తరగతి పేపర్లు లీకేజీలు బట్టి చూస్తే ఎంత ప్రాధాన్యత ఉందో అర్ధం అవుతుంది.
2019లో గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్ల 23 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఎంసెట్ లీక్, పదవ తరగతి పేపర్ లీక్ లాంటి సంఘటనలు, కరోనా సమయంలో సిలబస్ పూర్తికాకుండానే పరీక్షల నిర్వహణ అనేక అంశాలలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో లేదు. ప్రభుత్వం సరైన ప్రణాళికలు లేకుండా విద్యారంగాన్ని తెలంగాణలో భ్రష్టు పట్టించింది.
చదువు వ్యాపారమయం
తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి అంతం లేకుండా పోయింది. ఇంజనీరింగ్, మెడికల్ లాంటి కోర్సులకు ఫీజుల నియంత్రణ, ఫీజుల రూపకల్పన చట్టాలు, కమిషన్లు ఉన్నాయి. కానీ పాఠశాల స్థాయిలో, ఇంటర్మీడియట్ స్థాయిలో కార్పోరేట్ ఆగడాలు పెరిగిపోయాయి. విస్తృతంగా అనుమతులు లేకుండా బ్రాంచ్‌ల ఏర్పాటు, లక్షలాది రూపాయల ఫీజులు వసూళ్లు చేస్తున్నా వాటిని నియంత్రణ చేసే యంత్రాంగం లేదు. వీరి మార్కులు, ర్యాంకుల ఆగడాలకు అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఫీజుల నియంత్రణ చేసిన జీవోలు 42,46 లను అటకెక్కించింది. కార్పొరేట్ విద్యాసంస్థలను నేడు నియంత్రణ చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. విద్య పూర్తిగా వ్యాపార మయం అయ్యి సామాన్యులకు అందకుండా పోయింది. శ్రీచైతన్యలో సాత్విక్, నారాయణలో వంశిత లాంటి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ, వీటి నియంత్రణ కోసం ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదు.
ప్రాథమిక స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రభుత్వ రంగాన్ని బలహీన పరిచి ప్రైవేటు,కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పేరుతో విద్యా దినోత్సవం జరుపుతున్నారు. గత పదేళ్ల కాలంలో విద్యా రంగంలో సాధించిన ప్రగతి విద్యాసంస్థలలో నివేదించాలని పిలుపునిచ్చారు. కానీ ఈ పదేళ్ల కాలంలో ఏం సాధించారని, ఏం విజయాలు తీసుకువచ్చారని ప్రచారం చేస్తారో సమాధానం చెప్పాలి. కోట్లు ఖర్చు పెట్టి ప్రచార ఆర్భాటాలు తప్ప తెలంగాణ విద్యారంగానికి ఈ ప్రభుత్వం చేసిందేమి లేదు.
టి.నాగరాజు
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
94900 98292