- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజుల సొమ్ము రాళ్లపాలు- సలహాదారులతో ఒరిగేదేమిటి?
సలహాదారులను నియమించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేనప్పటికీ అందుకు విరుద్ధంగా ఏపీ ముఖ్యమంత్రి తనకు నచ్చినవారిని ఎంపిక చేసుకుంటున్నారు. పెద్దగా చదువు సంధ్యలు లేని, ఆయా రంగాల్లో బొత్తిగా అనుభవం లేని తమ అస్మదీయులకు పంచిపెడుతున్నారు. వీరిలో కొందరికి కేబినెట్ హోదా ఇచ్చి ప్రభుత్వం వారికి జీతాలు, అలవెన్సులతో పాటు మంత్రులకు ఉండే సదుపాయాలు కల్పించింది. రాజుల సొమ్ము రాళ్ల పాలు లెక్కన ప్రజల సొమ్ము సలహాదారుల పాలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు 57 మందికి పైగా ఉన్నారు. వారు అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు. అలాంటప్పుడు ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? దీనిని బట్టి సలహాదారుల సలహాలు ప్రభుత్వం పాటించడం లేదా? ఒకవేళ సలహాదారులే తప్పుడు సలహాలు ఇస్తున్నారా? దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతమంది సలహాదారులు కానీ, ఇన్ని చిత్రవిచిత్రమైన పోస్టులు కానీ లేవు. గత మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని సలహాదారులు తొలగించాల్సిన అవసరముంది.
రాజుల సొమ్ము రాళ్ల పాలు, ప్రజల సొమ్ము సలహాదారుల పాలవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన అధికారం పిచ్చివాడి చేతిలో రాయిలా మారకూడదు. అధికారంలోకి రావడం ఎంత కష్టమో, దానిని నిలబెట్టుకోవడం, కొనసాగించడం అంతకంటే కష్టం. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతో జగన్‌మోహన్ రెడ్డిపై నమ్మకంతో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. అనేక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ అభాసుపాలవుతున్నారు. ప్రజల్లో, న్యాయస్థానాల్లో చీవాట్లు తింటున్నారు.
ప్రభుత్వ పవర్‌ను ఎవరు తీయాలి
కాంట్రాక్టర్లను దొంగలుగా మారుస్తున్నారని, పెన్షన్ దారులను పిక్ పాకెటర్లుగా మారుస్తారేమోనని... నవరత్నాలకు ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లిస్తున్నారని వ్యాఖ్యానించిన ఏపీ హైకోర్టు పలు అంశాలపై ప్రభుత్వ తీరును గర్హిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు కోట్లాది రూపాయలు ప్రభుత్వం బకాయి పడింది. ఆ బిల్లులు చెల్లించవలసిందిగా హైకోర్టు ఆదేశించినప్పటికీ సాకులు చెబుతూ జాప్యం చేస్తోంది. దీనికి తోడు ఒక కాంట్రాక్టర్ దొంగతనానికి పాల్పడటంతో రాష్ట్రంలో కాంట్రాక్టర్లను దొంగలుగా మారుస్తున్నారని న్యాయస్థానం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ప్రజలకు లక్షల కోట్లు బకాయిలు పడినప్పుడు.. 40 లక్షల బకాయి కోసం గ్రానైట్ పరిశ్రమకు పవర్ కట్ చేసిన సందర్భంలో.. మీ పవర్ ఎవరు తీయాలని ప్రశ్నించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇన్నిసార్లు కోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న చరిత్ర ఏ రాష్ట్ర ప్రభుత్వానికీ లేదు. డజన్లకొద్దీ న్యాయ సలహాదారులు ఉండి ఏం చేస్తున్నారు? ఇన్నిసార్లు కోర్టు చీవాట్లు పెట్టినా దున్నపోతు మీద వానకురిసినట్లు గానే ఉంది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి స్థానంలో మరొకరు ఉంటే.. తక్షణమే రాజీనామా చేసేవారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినా సిగ్గువిడిచి జగన్‌మోహన్ రెడ్డి నగ్నంగా పాలిస్తున్నారు.
ఇప్పటికే 375 ప్రజా వ్యతిరేక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా మందలించింది. అయినాకానీ ఎక్కడా కూడా పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు లేవు. గత మూడున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. జగన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చినప్పటికీ, అవి ప్రజలకు నచ్చినా, నచ్చకపోయినా పరువు, ప్రతిష్టల కోసం వాటిని మూర్ఖంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడానికి అయిన ఖర్చు, కోర్టు ఆదేశాలతో వాటిని తుడిచివేయడానికి అయిన ఖర్చు, తమ పరువును కాపాడుకునేందుకు లాయర్లకు చెల్లించిన ఫీజులు తడిసిమోపడయ్యాయి. ఎన్నికల కమిషనర్ తొలగింపు, రాజధాని మార్పు ఇలా అనేక అంశాలలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.
అందరినీ సంతృప్తిపరచడానికి..
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు 57 మందికి పైగా ఉన్నారు. వారు అమూల్యమైన సలహాలు ఇస్తున్నారు. అలాంటప్పుడు ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? దీనిని బట్టి సలహాదారుల సలహాలు ప్రభుత్వం పాటించడం లేదా? ఒకవేళ సలహాదారులే తప్పుడు సలహాలు ఇస్తున్నారా? అసలు ఇప్పటివరకు ముఖ్యమంత్రి, మంత్రుల సమావేశాల్లో కానీ, సమీక్షల్లో కానీ సలహాదారులు పాల్గొన్న దాఖలాలు లేవు. చాలా మంది సలహాదారులు కనీసం ముఖ్యమంత్రిని ఇప్పటివరకు కలవనేలేదు. సలహాదారుల రూపంలో వచ్చి ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారు. సలహాలు, సంప్రదింపుల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకుని సజ్జల రామకృష్ణారెడ్డిని మంత్రిగా నియమించుకున్నారు. ఆయన సకలశాఖా మంత్రిగా వ్యవహరిస్తూ మంత్రులను, అధికారులను తన అదుపాజ్ఞలో ఉంచుకున్నారు. ఆచరణలో అధికారాలు లేకపోయినా ప్రభుత్వ సలహాదారుల ముసుగులో మంత్రులపైనే పెత్తనం చెలాయిస్తూ రాజ్యాంగాన్ని గేలి చేస్తున్నారు. అన్ని వ్యవస్థల్లో ఇలాంటి రాజ్యాంగేతర శక్తులను ప్రవేశపెట్టి సమాంతర పాలన నడిపిస్తున్నారు. స్థానిక సంస్థల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు సమాంతరంగా వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీనివల్ల సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారారు.
వివిధ శాఖలకు సలహాదారుల నియామకంలో రాజ్యాంగబద్ధతను విచారిస్తామని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులు ఉండవచ్చేమోకానీ.. ఎమ్మార్వోలకు, తహశీల్దార్లకు, పోలీసులకు కూడా సలహాదారులను నియమిస్తారేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండగా.. వివిధ శాఖలకు సలహాదారులు ఎందుకుని ప్రశ్నించింది. పీఠాధిపతి సలహా మేరకు దేవాదాయశాఖకు సలహాదారు నియమించామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఆయనిచ్చిన వివరణను తప్పుబడుతూ పీఠాధిపతులు ఉన్నది ప్రభుత్వాన్ని నడపడానికి కాదని, దేవస్థానాల పాలనా వ్యవహారానికి పరిమితమైతే మంచిదని సూచించింది. రాజ్యాంగం ప్రకారం సలహాదారులను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదా? ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారు? వారి నియామకానికి సంబంధించిన విధివిధానాలేమిటి? వారికున్న అర్హతలు తదితర వివరాలు కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.
సలహాదారులను నియమించేందుకు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేనప్పటికీ అందుకు విరుద్ధంగా నచ్చినవారిని ఎంపిక చేసుకుంటున్నారు. పెద్దగా చదువు సంధ్యలు లేని, ఆయా రంగాల్లో బొత్తిగా అనుభవంలేని తమ అస్మదీయులకు పంచిపెడుతున్నారు. సగానికి పైగా సొంత సామాజికవర్గం, సాక్షి పత్రికకు చెందినవారు ఉన్నారు. వీరిలో కొందరికి కేబినెట్ హోదా ఇచ్చి ప్రభుత్వం వారికి జీతాలు, అలవెన్సులతో పాటు మంత్రులకు ఉండే సదుపాయాలను కల్పించింది. మంత్రివర్గంలో కానీ, ఇతర పోస్టుల్లో కానీ కేబినెట్ హోదా 15 శాతానికి మించకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను తుంగలో తొక్కి వారికి కేబినెట్ హోదాలు కల్పించారు. టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభ్యులందరినీ సంతృప్తి పర్చడానికి జంబో కేబినెట్ ను రూపొందించారు. అంజయ్యను ఆదర్శంగా తీసుకుని ఏపీ సీఎం తనకు ఇష్టం వచ్చినట్లు సలహాదారుల పదవుల పందేరం చేశారు. బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతమంది సలహాదారులు కానీ, ఇన్ని చిత్రవిచిత్రమైన పోస్టులు కానీ లేవు.
ఆ సభ్యుల కంటే సలహాదారులే ఎక్కువ..
తమ పార్టీ వారికి రాజకీయ పునరావాస కేంద్రంగా, ఉపాధి హామీ పథకంలా సలహాదారుల పదవులు మారాయి. వీరికి పనేలేదు, వీరి అవసరం అంతకంటే లేదు. ఒకవైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ముఖ్యమంత్రికి పాలనపై పట్టులేకపోవడం, తన అనుభవరాహిత్యంతో రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు రూ.1.50 లక్షలకు చేరింది. నిధుల కొరత కారణంగా ఉద్యోగులకు సకాలంలో జీతాలు, పెన్షన్‌లు చెల్లించలేకపోతున్నారు. దీనికి తోడు సొంత పార్టీ సర్పంచ్ లు సైతం పనులు చేసినదానికి బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడతా మంటున్నారు. మరికొంతమంది దొంగలుగా మారుతున్నారు. రహదారులు నరక కూపాలుగా మారాయి. నిధుల కొరతతో వాటి మరమ్మతులు చేపట్టలేదు. మద్యం, ఇసుక, విద్యుత్ ఛార్జీలు పెంచారు. చివరకు చెత్తపై కూడా పన్ను విధిస్తూ ప్రజలను పీడిస్తున్నారు. 45 నెలల కాలంలో 45 రకాల పన్నుల భారం ప్రజలపై మోపారు. ఇంత ఆర్థిక సంక్షోభంలో ప్రభుత్వానికి, ప్రజలకు ప్రయోజనం లేని వారికి కోట్లాది రూపాయలు ఎలా చెల్లిస్తున్నారు? ప్రజాధనంతో వారికి జీతభత్యాలు చెల్లిస్తున్నప్పుడు వారు ఏమేరకు ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నారో ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది.
ముఖ్యమంత్రి పనితీరుపై ప్రజల్లో విరక్తి కలుగుతుంది. ప్రజాస్వామ్య ప్రక్రియపైనే అనుమానం కలుగుతోంది. ఒకవైపు ప్రజలను దుర్భర పరిస్థితుల్లోకి నెడుతూ మరోవైపు కుల, మత, ప్రాంతీయ విద్వేషాలతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అధోగతి పాలుచేశారు. విద్యా ప్రమాణాల అంశంలో రాష్ట్రం 19వ స్థానంలోకి దిగజారింది. కోర్టు ధిక్కరణ కేసుల్లో, మహిళలపై, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల్లో దేశంలో నెం.1 గా నిలిచింది. పెట్రోల్, డీజిల్ ధరల్లో దేశంలోనే ప్రథమస్థానంలో ఉంది. ఇంతమంది సలహాదారులను పెట్టుకున్నప్పుడు రాష్ట్రం ఇంత అధోగతి పాలు ఎందుకవుతోందో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రభుత్వ తప్పిదాలు, అనాలోచిత నిర్ణయాలను సరిచేయాల్సిన బాధ్యత వీరికి లేదా? వీరిపై ఏడాదికి రూ.150 కోట్లు పైగా వెచ్చిస్తున్నారు. శాసనమండలి రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతుంది కాబట్టి రద్దు చేస్తున్నట్లు ఆనాడు ప్రకటించారు. కానీ ఈనాడు శాసనమండలి సభ్యులకంటే కూడా సలహాదారులు ఎక్కువమంది ఉన్నారు. శాసనమండలి రద్దు కాలేదు కానీ ఆర్థిక భారం మోపుతూ సలహాదారులను మాత్రం నియమించుకున్నారు.
సలహాదారుల రూపంలో ఉన్న స్వాహాదారులను కొనసాగించి ప్రజాధనాన్ని వృధాచేస్తారా? ప్రజా సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని వీరిని తొలగించాల్సిన అవసరముంది. ఈ ఏడాదైనా పాలనలో తుగ్లక్ గుర్తుకు రాకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కులం చూడను, మతం చూడను, విలువలు, విశ్వసనీయత, నీతి, నిజాయతీ లాంటి పడికట్టు పదాలు ప్రతి సభలు, సమావేశాల్లో ముఖ్యమంత్రి వల్లెవేస్తుంటారు. కనీసం ఈ కొద్దిసమయాన్నైనా సద్వినియోగం చేసుకుంటూ వాటిని ఆచరణలో చూపితే ప్రజలకు ఇసుమంతైనా మేలు జరుగుతుంది.
మన్నవ సుబ్బారావు
గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్
99497 77727
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read...
దేవుణ్ణి నమ్మేవాడు కమ్యూనిస్టేనా?