జనసేన విధానాలు ఏమిటి?

by Ravi |   ( Updated:2023-10-12 01:00:56.0  )
జనసేన విధానాలు ఏమిటి?
X

రాష్ట్ర శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ విమర్శల వేడి రాజుకుంటున్నది. పాలక పార్టీల నాయకుల విమర్శలు దూషణ పర్వానికి చేరుకున్నాయి. ఎన్నికల పొత్తులు మారుతూ వస్తున్నాయి. బీజేపీతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తును ప్రకటించారు. వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా టీడీపీతో పొత్తుకు సిద్దమైనాయి.

పవన్ కళ్యాణ్ నాయకత్వాన ఉన్న జనసేన, టీడీపీ పరస్పర పొత్తు అవసరంగా భావించాయి. పవన్‌ని ప్రజలు సినిమా హిరోగా చూస్తున్నారేగాని, రాజకీయ నాయకునిగా గుర్తించలేక పోతున్నారు. దీనికి కారణం ఆయనలో రాజకీయ పరిపక్వత కన్పించక పోవటమే వైసీపీని తిరిగి అధికారంలోకి రానీయకుండా చేయటమే లక్ష్యంగా పవన్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో చంద్రబాబు అరాచక, ప్రజావ్యతిరేక పాలన పవన్‌కి గుర్తు లేదా! ఒక ప్రజావ్యతిరేక ప్రభుత్వ స్థానంలో మరో దోపిడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే పవన్ కల్యాణ్ లక్ష్యమా? జగన్ ప్రభుత్వ అరాచక పాలన గురించి పదేపదే విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగం, రాష్ట్ర అప్పులు, కేసులు గురించి అందుకు ఉదాహరణలుగా చెబుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించాల్సిందే. ఏ ప్రభుత్వ నిరంకుశ పాలననైనా ఎదుర్కోవాల్సింది ప్రజలు. పవన్, చంద్రబాబు చేసే విమర్శలను ప్రజలు పట్టించుకుంటున్నారా లేదా అన్నది ఈ పార్టీలు పరిశీలించుకోవాల్సి ఉంది.

పడికట్టు పదాలు తప్ప విధానాలేవి?

పవన్ కళ్యాణ్‌వి నిలకడ లేని విధానాలు. ఒకసారి మాట్లాడిందానికి విరుద్దంగా మరోసారి మాట్లాడుతారు. మాట్లాడేదానిలో కూడా కనీస రాజకీయ అవగాహన కూడా కన్పించదు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తానని, అవినీతి లేని పాలన అందిస్తానని, వలసలు పోకుండా ప్రజలకు ఉపాధి కల్పిస్తాననే పడికట్టు పదాలు వల్లిస్తున్నాడు తప్ప అందుకు ఎలాంటి విధానాలు అమలు చేసేది చెప్పడం లేదు. అందుకు ఎలాంటి విధానాలు అమలు జరపాలో కూడా ఆయనకు తెలిసినట్లు లేదు. గ్రామీణ పేదలకు ఉపాధి, యువతకు ఉద్యోగాల కల్పన జరగాలన్నా రెండు ముఖ్యమైన మౌలిక సమస్యలు పరిష్కారం చేయాలి. 68% శాతం ప్రజలున్న గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక భూ సంస్కరణల అమలు ద్వారా పేదలకు భూములు పంచాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నిర్మించాలి. ప్రజల అవసరాలను తీర్చే చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు జరగాలి.. అప్పుడు మాత్రమే గ్రామీణ పేదలకు, పట్టణ పేదలకు ఉద్యోగ, ఉపాధి లభిస్తుంది. వీటి గురించి మాట్లాడటం లేదంటే ఆయనకు ఉపాధి, ఉద్యోగ కల్పన ఎలా జరుగుతుందో తెలియదనే అనుకోవాలి. టీడీపీ, జనసేన ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పవన్ చెబుతున్నాడు. చంద్రబాబు భూసంస్కరణలకు పచ్చి వ్యతిరేకి. వ్యవసాయం దండగ అని చెప్పిన వ్యక్తి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నిర్వీర్యం చేసి, అవి మూతపడేలా చేశాడు. అలాంటి చంద్రబాబుతో కలిసి నిరుద్యోగ సమస్యను పవన్ కల్యాణ్ ఎలా పరిష్కరిస్తారు?

అప్పులు లేని రాష్ట్ర నిర్మాణమా?

రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని, ప్రతి వ్యక్తి తలపై లక్ష రూపాయల పైగా అప్పు ఉందని పవన్ విమర్శగా ఉంది. రాష్ట్రం అప్పుల్లో మాట నిజం, చేస్తున్న అప్పులు పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే ఎక్కువగా ఉపయోగించిన మాట నిజమే. గత చంద్రబాబు ప్రభుత్వం, నేటి జగన్ ప్రభుత్వం అప్పులు చేశాయి, చేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ప్రభుత్వ మొత్తం అప్పు 4.42 లక్షల కోట్లుగా ప్రకటించింది. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు 2,37,510 కోట్లు. అంటే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పే ఎక్కువగా ఉంది. అలాంటి చంద్రబాబుతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా అప్పులు లేని రాష్ట్రంగా పవన్ కల్యాణ్ ఎలా చేస్తారు?

కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ ఏర్పడిన ప్రభుత్వాలన్నీ ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన సాగించినవే. వైసీపీ ప్రభుత్వం కూడా కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అమలు జరిపింది. చంద్రబాబు గత పరిపాలనంతా ప్రజా వ్యతిరేకమైందే. ప్రజా ఉద్యమాల అణచివేత కొనసాగించిందే. ప్రజా ఉద్యమ కారుల పైన అనేక కేసులు బనాయించటమే కాకుండా బూటకపు ఎన్‌కౌంటర్లలో అనేక మంది ప్రాణాలు బలిగొన్నదే. ప్రతి పాలక పార్టీ, ప్రతిపక్ష పార్టీలపై కేసులు బనాయించడం కొత్తగా వచ్చిందేమి కాదు. అవి వాటి రాజకీయ ప్రయోజనాల్లో భాగమే. ఇది పవన్ కల్యాణ్ మర్చిపోయారా! నీవు అధికారంలోకి వస్తే ప్రజా ఉద్యమ కారులపై కేసులు పెట్టనని చెప్పగలవా!

చేగువేరా నుంచి సావర్కార్ దాకా..

ఏ రాజకీయ పార్టీకైనా ఒక రాజకీయ, ఆర్థిక విధానం ఉండాలి. అది ఎలాంటిదైనా కావచ్చు. దాన్ని ప్రజల ముందు పెట్టాలి. అప్పుడే ఆ పార్టీ ఎలాంటిదని అర్థం చేసుకుంటారు. జనసేన పార్టీకి ఇప్పటికీ ఒక రాజకీయ, ఆర్థిక విధానమంటూ లేదు. ఎందుకు లేదన్నది ఆ పార్టీకే తెలిసినట్లు లేదు. కాసేపు చేగువేరా అంటాడు, భగత్ సింగ్, తరిమెల నాగిరెడ్డి అని మరోసారి అంటాడు. తాజాగా సావర్కార్ గురించి కూడా మాట్లాడుతున్నారు. వాళ్ల రాజకీయాలు పవన్‌కి తెలిసినట్లు లేదు. తెలిస్తే అలా మాట్లాడడు. వారి గురించి మాట్లాడుతూ, వారిని అవమానిస్తున్నాడు. నాకు కులాలు, మతాలు లేవంటాడు. నా కులం వాళ్లే నాకు ఓట్లు వేయలేదంటాడు. హిందూ దేవుళ్లను, హైందవ ధర్మాన్ని పొగుడుతాడు. లౌకిక వాదినంటూనే హైందవ మతాన్ని, సనాతన ధర్మాన్ని గొప్పదిగా కీర్తిస్తాడు. చివరగా.. మీరు పెట్టిన జనసేనను ఒక పార్టీగా కొనసాగించాలంటే, మీ రాజకీయ, ఆర్థిక విధానాలను ప్రకటించి స్వతంత్రంగా ముందుకు రావాలి గానీ ఎల్లల ఏదో ఒక పార్టీని భుజాన మోయకూడదు పవన్..

బొల్లిముంత సాంబశివరావు

98859 83526

Advertisement

Next Story

Most Viewed